ETV Bharat / state

KTR: 'సోలార్​ విద్యుదుత్పత్తిలో.. దేశంలోనే తెలంగాణ రెండోస్థానం'

author img

By

Published : Jul 29, 2021, 3:08 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో రాష్ట్రానికి 15వేలకు పైగా పరిశ్రమలు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. 2 లక్షల 20 వేల కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడులను రాష్ట్రం సాధించుకుందన్న కేటీఆర్‌... ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణమని వెల్లడించారు. హైదరాబాద్​ శివారు మహేశ్వరంలో ప్రముఖ సోలార్​ కంపెనీ ప్రీమియర్​ ఎనర్జీస్​ నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్​ ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్​, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీమియర్​ ఎనర్జీస్​కు కేటీఆర్​ ధన్యవాదాలు తెలియజేశారు.

solar plant in maheshwaram
మహేశ్వరంలో సోలార్​ ప్లాంట్​, మంత్రి కేటీఆర్​

సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ శివారు మహేశ్వరంలోని ఈ-సిటీలో ప్రముఖ సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ప్రారంభోత్సంవంలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్​లో 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ సెల్, 750 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూళ్ల తయారీని కంపెనీ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతుల ప్రక్రియ, ల్యాండ్ అలాట్​మెంట్ జరిగిన 18 నెలల రికార్డు సమయంలోనే ఈ తయారీ యూనిట్​ను కంపెనీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి కల్పిస్తామన్న కంపెనీ.. ఇందులో 80 శాతం ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే కేటాయిస్తామని ప్రకటించింది. మరో రెండేళ్లలో పెట్టుబడులను రూ. 1200 కోట్లకు పెంచి 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్, సోలార్ మాడ్యూల్ తయారుచేసేలా తెలంగాణలో విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది.

దేశంలోనే రెండో స్థానం

సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కేటీఆర్​ అన్నారు. సోలార్ సెల్స్, మాడ్యుల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్​ను ఎంచుకున్న ప్రీమియర్ ఎనర్జీస్​ను ఈ సందర్భంగా మంత్రి​ అభినందించారు.

'కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ 18 నెలల రికార్డు సమయంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యుల్ తయారీ ప్లాంట్​ను ఏర్పాటుచేయటం అభినందనీయం. ఉపాధి కల్పన ప్రతి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల నియామకం చేసుకుంటూనే, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నాం. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రం 15 వేల పైచిలుకు పరిశ్రమలను, తద్వారా 2 లక్షల 20 వేల కోట్ల పైచిలుకు పెట్టుబడులను సాధించుకుంది. ఇందులో 80 శాతానికి పైగా పరిశ్రమలు ఇప్పటికే పని ప్రారంభించడం అసాధారణం.' -కేటీఆర్​, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి

రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్​కు ధన్యవాదాలు. స్థానికులకు ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా యువతీయువకుల్లో నైపుణ్యం పెంపొందించేలా ప్రత్యేక శిక్షణా కేంద్రాలు రూపొందిస్తే వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. -సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి

త్వరలోనే నైపుణ్య శిక్షణ కేంద్రాలు

కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ ఉపాధి అవకాశాలు: కేటీఆర్​

2023 లోపు రూ. 1200 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ కెపాసిటీని 4 గిగా వాట్ల సామర్థ్యానికి పెంపు, 2వేల అదనపు ఉద్యోగాలు కల్పించేలా ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ ప్రణాళికల పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మహేశ్వరంలో నైపుణ్య శిక్షణ సంస్థను ప్రారంభించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనకు స్పందించిన కేటీఆర్.. ఆగస్టు 5న నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించి స్థానికుల్లో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: శ్రీశైలంలో ఏపీ విద్యుదుత్పత్తికి అభ్యంతరం లేదు: తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.