ETV Bharat / state

pneumococcal conjugate vaccine: న్యుమోనియా కట్టడికి.. న్యుమోకోకల్​ వ్యాక్సిన్​ తప్పనిసరి.!

author img

By

Published : Aug 22, 2021, 7:34 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా న్యుమోకోకల్ కాంజుగేట్​ వ్యాక్సిన్​(pneumococcal conjugate vaccine)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రత్యేక డ్రైవ్​లు ఏర్పాటు చేసి మరీ టీకాలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు న్యుమోకోకల్ వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు.? ఏ వయసు వారు ఈ టీకా తీసుకోవచ్చు. న్యుమోకోకల్ టీకా వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే అంశాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

pneumococcal conjugate vaccine
న్యుమోకోకల్ కాంజుగేట్​ వ్యాక్సిన్​

యూనివర్శల్​ ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం న్యూమోకోకల్ కాంజుగేట్​​ వ్యాక్సిన్(pneumococcal conjugate vaccine PCV)​- పీసీవీని అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్నారుల్లో వచ్చే న్యుమోనియా కట్టడి చర్యల్లో భాగంగా ఈ టీకాలను అన్ని పీహెచ్​సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు సహా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో ఈ పీసీవీ​ని అందిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు చిన్నారులకు శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఏటా వేలాది మంది చిన్నారులు న్యుమోనియా బారిన పడుతున్నారు. న్యుమోకోకల్ బ్యాక్టీరియా కారణంగా న్యుమోనియాతో పాటు.. చెవిలో, సైనస్ భాగాల్లో, రక్తంలో ఇన్​ఫెక్షన్​తో పాటు... మెనిన్​జైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. రెండేళ్లలోపు చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువ. ఫలితంగా చిన్నారుల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి సమస్యలు తలెత్తుతాయి.

కరోనా థర్డ్​ వేవ్​ అలర్ట్​

న్యుమోకోకల్ కాంజుగేట్​ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా 13 రకాల బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్లను నివారించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ టీకా అత్యంత సురక్షితమైందని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా మూడో దశ.. పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఇలాంటి వ్యాక్సిన్ల అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు టీకా ఇవ్వనున్నారు. మొత్తం మూడు డోసులుగా ఈ టీకాను అందిస్తారు. చిన్నారికి ఆరు వారాల వయసులో ఒక డోసు, 14వారాల వయసులో రెండో డోస్ ఇస్తారు. ఇక 9వ నెలలో మూడో డోస్ వేస్తారు. అయితే కనీసం ఒకడోస్ అయినా కచ్చితంగా ఏడాది లోపు ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రైవేటులో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ టీకా ఇప్పుడు అన్ని ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనూ ఉచితంగా అందిస్తారు.

టీకా తప్పనిసరి

సుమారు రూ.4 వేలు ఖర్చయ్యే టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నా తల్లిదండ్రులు వ్యాక్సిన్ పట్ల అపోహలతో టీకా వేయించుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. అయితే అత్యంత సమర్థవంతమైనదే కాకుండా సురక్షితమైన వ్యాక్సిన్.. ఈ పీసీవీ అని వైద్యులు చెబుతున్నారు. న్యుమోనియా నుంచి పిల్లలను రక్షించుకునేందుకు తప్పక చిన్నారులకు టీకా ఇప్పించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: Bandi Sanjay: బండి సంజయ్​ పాదయాత్ర వాయిదా... కారణం ఏంటంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.