ETV Bharat / state

New Cotton Varieties: పత్తి పంట సాగు చేసే రైతులకు తీపి కబురు...

author img

By

Published : Dec 16, 2021, 8:00 AM IST

New Cotton Varieties: పత్తి పంట సాగు చేసే రైతులకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం తీపి కబురు అందించింది. సాగు ఖర్చులు తగ్గించి... అధిక లాభాలు వచ్చే కొత్త వంగడాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. కూలీల సమస్యను పరిష్కరించేందుకు ఒకే కోతతో పత్తి పంట సాగును ముగించే కొత్త వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు తెలిపింది.

New Cotton Varieties
New Cotton Varieties

New Cotton Varieties: పత్తి పంట సాగు... రైతులకు ఏటేటా భారంగా మారుతోంది. అటు సాగు ఖర్చులు పెరుగుతుండటం, ఇటు లాభాలు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త వంగడాలను తీసుకొచ్చింది. వీటితో పత్తి పంట సాగులో కీలక మార్పులు రానున్నాయి. ఒకే ఒక్క కోతతో (దూది తీసి) పంట సాగును ముగించే వంగడాలపై ప్రయోగాలు చేశారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ రకం వంగడాలు అందుబాటులోకి వస్తే పత్తి సాగు వ్యయం తగ్గి, దిగుబడి పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అన్నింటికి మించి.. యంత్రాలతో దూది తీసే విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తీసుకురావడానికి ఈ కొత్త వంగడాలు ఉపకరిస్తాయి. రాష్ట్రంలో తెల్ల బంగారం సాగు కాలం సాధారణంగా 8 నుంచి 9 నెలలు. రైతులు ఏడాదికి 2 నుంచి 3 సార్లు దూది తీసి మార్కెట్లకు తెస్తున్నారు. దూది తీయడానికి కొన్ని ప్రాంతాల్లో కూలీలు దొరకడం లేదు. దొరికినా కూలి ధరలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒకే కోతతో పత్తి పంట సాగును ముగించే కొత్త వంగడాలు రైతులకు అందుబాటులోకి తేవాలని జయశంకర్‌ విశ్వవిద్యాలయానికి గతంలో వ్యవసాయ శాఖ సూచించింది. ఈ మేరకు నాగ్‌పుర్‌లోని జాతీయ పత్తి పరిశోధన సంస్థ ఇచ్చిన నాలుగు వంగడాలు, నూజివీడు విత్తన సంస్థ తయారుచేసిన మరో మూడు వంగడాలతో గతేడాది వరంగల్‌లో ప్రయోగాత్మకంగా పత్తి సాగు చేపట్టారు. ఈ వానాకాలంలో ఆదిలాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మంజిల్లాల్లో రైతులతో, కృషి విజ్ఞాన కేంద్రాల్లో సాగు చేయిస్తోంది.

ఒక్కో మొక్కకు 20 కాయలు..

ప్రస్తుత సాధారణ సాగు విధానంలో ఎకరానికి 6 వేల నుంచి 7 వేల విత్తనాలు నాటుతున్నారు. రెండు విత్తన ప్యాకెట్లు వాడుతున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో 450 గ్రాముల విత్తనాలు ఉంటాయి. రెండింటి ధర రూ.1,550 అవుతోంది. కానీ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఒకే కోత వంగడాలను ఎకరానికి 16 వేల నుంచి 20 వేల వరకు నాటారు. ఆదిలాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ సీజన్‌లో ఎకరానికి 16,500 నాటారు. ఒక్కో మొక్కకు 20కి తగ్గకుండా కాయలు వస్తాయని అంచనా. ఒక్కో కాయ పగిలి కనీసం 4 గ్రాముల దూది వస్తుంది. ఈ లెక్కన 16,500 పత్తి మొక్కల నుంచి కనీసం 13 నుంచి 15 క్వింటాళ్ల దూదిని ఒకేసారి తీయవచ్చని వ్యవసాయ వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు.

విత్తన ఖర్చు పెరిగే అవకాశం...

ఒక ఎకరంలో 25,000 విత్తనాలు నాటి కూడా ప్రయోగం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ పద్ధతిలో ఎకరానికి 4 ప్యాకెట్లు వాడాల్సి ఉన్నందున విత్తన ఖర్చు రూ.3500 దాకా అవుతుంది. విత్తన వ్యయంతో పాటు, మొక్కలు త్వరగా పెరిగి పూత, కాత రావడానికి కొన్ని మందులు అదనంగా చల్లాల్సి ఉంటుందని పత్తి పంట ప్రధాన విశ్రాంత శాస్త్రవేత్త సుదర్శన్‌ ఈటీవీ భారత్​కు చెప్పారు. గతేడాది వరంగల్‌లో వర్సిటీ తరఫున సాగు చేయిస్తే 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిందని వివరించారు.

6 నెలల్లో సాగు.. రెండో పంటకూ వీలు

రాష్ట్రంలో గత సీజన్‌లో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. అయితే.. సాగు వ్యయం ఏటేటా పెరుగుతుండటంతో రైతులకు లాభాలు రావడం లేదు. కూలీల ఖర్చే రూ.15 వేలకు పైగా ఉంటోంది. దీన్ని తగ్గించడానికి పత్తి కోతకు వచ్చినప్పుడు దూదిని 2 లేదా 3 సార్లు కాకుండా ఒకేసారి తీయడం మేలు అని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఆస్ట్రేలియా, చైనాల్లో ఇలా ఒకేసారి యంత్రంతో దూది తీసి.. పంటను తొలగించి మరో పంట వేస్తున్నారు. దీనివల్ల దూది తీయడానికి పెట్టే ఖర్చు సగానికి సగం తగ్గనుంది. తెలంగాణలో ఆరు నెలల్లో పత్తి సాగు పూర్తయితే.. సాగునీటి వసతి ఉన్న భూముల్లో ఆ పంట తీసేసి రెండో పంట వేయవచ్చని, వానాకాలంలో ఏదో ఒక పంట వేసి యాసంగిలో పత్తి సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: Assigned lands: అసైన్డ్​ భూములకు పట్టాలు.. వేల ఎకరాల ప్రభుత్వ భూములకు రెక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.