ETV Bharat / state

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ.. హైదరాబాద్​ తర్వాత ఇందూరులోనే..

author img

By

Published : Dec 3, 2020, 5:44 AM IST

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణే లక్ష్యంగా... ప్రభుత్వం ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తోంది. నిజామాబాద్‌లోనూ ఐటీ హబ్ నిర్మాణం సాగుతుండగా... మరో ఐదు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఐటీ టవర్‌తోపాటు ఇంక్యూబేషన్‌ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత కేవలం నిజామాబాద్‌కు మాత్రమే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది.

IT HUB IN NIZAMABAD
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ.. హైదరాబాద్​ తర్వాత ఇందూరులోనే..

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ.. హైదరాబాద్​ తర్వాత ఇందూరులోనే..

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించడం, హైదరాబాద్‌పై భారం తగ్గించాలనే ఉద్దేశ్యంతో... వివిధ జిల్లాలకు ప్రభుత్వం ఐటీ హబ్‌లు మంజూరు చేసింది. ఐటీ కేంద్రాలుగా తీర్చిదిద్దడం సహా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, వరంగల్‌లో సేవలు మెుదలయ్యాయి. ఖమ్మంలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2017లో నిజామాబాద్‌లోనూ ఐటీ హబ్‌ ఏర్పాటుకు అనుమతిచ్చింది. 2018 ఆగస్టులో గిర్‌రాజ్‌ కళాశాల సమీపంలో... నిర్మాణానికి మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. 3.20 ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

కోరోనా కారణంగా..

ఐటీ హబ్‌ నిర్మాణ పనులు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనా.... కరోనా కారణంగా కొద్ది రోజులపాటు నిలిచిపోయాయి. ప్రస్తుతం పనుల్లో వేగం పుంజుకుంది. సివిల్‌ పనులు పూర్తవ్వగా... ప్రహరి, ఎలివేషన్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, పార్టిషన్ పనులు చేపట్టాల్సి ఉంది. దాదాపు 72 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్.... మరో 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంక్యుబేషన్ సెంటర్‌ నిర్మిస్తున్నారు. మెుదట కేటాయించిన రూ.25 కోట్లతోపాటు అదనంగా మరో రూ.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఐటీ టవర్ కోసం రూ.33 కోట్లు వెచ్చిస్తున్నారు.

వెయ్యి మంది పని చేసుకునే అవకాశం..

ఐటీ టవర్‌ను జీ ప్లస్ 3 విధానంలో నిర్మిస్తున్నారు. మూడు అంతస్తుల్లో ఐటీ కార్యాలయాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో అంతస్తులో ఎనిమిది కార్యాలయాలు... ఏర్పాటు చేసుకునేందుకు వీలు ఉంటుందని తెలిపారు. మొత్తం వెయ్యి మంది పని చేసుకునే అవకాశం ఉందని వివరించారు. శంకుస్థాపన సమయానికే 60కి పైగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా... నిర్మాణం పూర్తయిన వెంటనే సేవలు ప్రారంభించేందుకు 20కి పైగా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

మొదటి దశలో ఐటీ టవర్.... రెండో దశలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తున్నారు. అయితే... హైదరాబాద్ తర్వాత కేవలం నిజామాబాద్‌కు మాత్రమే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది.

ఇవీచూడండి: ఐటీ రంగం వృద్ధితో మారిపోయిన నగర స్వరూపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.