ETV Bharat / state

అధికారుల ఉదాసీనత.. అందరి దరిచేరని 'బంధు'వు

author img

By

Published : Jun 14, 2020, 7:17 AM IST

వానాకాలం పంటకు రైతు బంధు ద్వారా పెట్టుబడి అందించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సాగు చేసుకుంటున్న భూమిపై యాజమాన్య హక్కులు లేక రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులకు బంధు సొమ్ము అందడం లేదు. రెవెన్యూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అనంతరం తప్పిపోయిన సర్వే నంబర్ల ఆన్‌లైన్‌, పాసుపుస్తకాల జారీ ప్రక్రియలలో క్షేత్రస్థాయి యంత్రాంగం ఉదాసీనత ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

most of the farmers did not get rythu bandhu scheme money in rabi season
అందరి దరిచేరని బంధువు

  • మెదక్‌ జిల్లా శివంపేట మండల కేంద్రంలోని 315, 316 సర్వే నంబర్లలో 1100 ఎకరాల విస్తీర్ణం ఉంది. భూ దస్త్రాల్లో మాత్రం ఈ విస్తీర్ణం 1400 ఎకరాలకు చేరుకుంది. దస్త్రాల ప్రక్షాళన అనంతరం ఇక్కడ విస్తీర్ణంలోని తేడాలను గమనించిన అధికారులు ఈ సర్వే నంబర్లలోని రైతులకు పాసుపుస్తకాల జారీని నిలిపివేశారు. దాదాపు 500 మంది రైతులకు పుస్తకాలు అందలేదు. యాజమాన్య హక్కులూ దక్కలేదు. రైతు బంధు సాయానికి, బీమాకూ వారు దూరమయ్యారు. సర్వే చేసి అర్హులైన రైతులెవరో తేల్చాల్సి ఉండగా.. ఆ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంటోంది.
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోనూ చాలా మంది రైతులకు నేటికీ పాసుపుస్తకాలు అందలేదు. యాసంగి గడిచిపోయింది.. కనీసం వానాకాలానికైనా ప్రభుత్వ సాయం వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.

అర్హులైన అన్నదాతలందరికీ పంటల సాగు వేళ పెట్టుబడి నిమిత్తం రైతు బంధు సాయం అందించడంతో పాటు బీమాను అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. గడిచిన యాసంగి (రబీ)లో 43 లక్షల మందికి ప్రభుత్వం రైతు బంధు అందించింది. ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో పెట్టుబడి అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాగు చేసుకుంటున్న భూమిపై యాజమాన్య హక్కులు లేక జిల్లాల్లో వేలాది మంది రైతులకు అందడం లేదు. రెవెన్యూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం అనంతరం తప్పిపోయిన సర్వే నంబర్ల ఆన్‌లైన్‌, పాసుపుస్తకాల జారీ ప్రక్రియలలో క్షేత్రస్థాయి యంత్రాంగం ఉదాసీనత ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

సాగు చేసుకుంటున్న భూమిపై యాజమాన్య హక్కులు అందనివారు జిల్లాల్లో వేలల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 61.13 లక్షల మంది రైతుల సాగు భూమికి పుస్తకాల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటివరకు దాదాపు 59 లక్షల పుస్తకాలు అందించినట్లు రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. దీనికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భూ క్రయవిక్రయాల అనంతరం యాజమాన్య హక్కుల మార్పిడికి తిరుగుతున్న వారిలో రైతులు కూడా ఉన్నారు. ఆధార్‌తో వేలిముద్రలు సరిపోలకపోవడం, కొందరు ఆధార్‌ సమర్పించకపోవడంతో వారికి పుస్తకాల పంపిణీ సాధ్యపడలేదు. ఇతర సమస్యలతో కొందరు రైతులు తహసీల్దారు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

  • మా భూమి పోర్టల్‌ నుంచి టీఎస్‌ఎల్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లోకి సమాచార బదిలీ సమయంలో సర్వే నంబర్లు తప్పిపోయిన వారు నిత్యం వెబ్‌సైట్‌లో నంబర్‌ను వెతుక్కుంటూనే ఉన్నారు. వీటిని సరిచేసేందుకు ఆన్‌లైన్‌లో ఐచ్ఛికాలు ఇచ్చినప్పటికీ మండలాల్లో యంత్రాంగం చొరవ చూపడం లేదని రైతులు చెబుతున్నారు.
  • పార్ట్‌-బీలోని వివాదాస్పద భూములకు పాసుపుస్తకాల జారీ అంశం క్షేత్రస్థాయి సర్వేతో ముడిపడి ఉంది. ఖాస్రా పహాణీకి, గ్రామంలోని రైతుల వద్ద ఉన్న పట్టాల్లోని విస్తీర్ణానికి పొంతన కుదరని పరిస్థితులు మండలాల్లో ఉన్నాయి. ఇప్పటికైనా క్షేత్రస్థాయి సర్వే చేపట్టి పుస్తకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య భాగపంపిణీ, ఫిర్యాదులతో పుస్తకాల జారీ నిలిచిపోయిన చోట సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  • ఇదీ చూడండి స్పిన్నింగ్ మిల్లుల సంక్షోభం.. జీతాలు లేక కార్మికుల అవస్థలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.