ఎవరి పయనం ఎటో.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయం..!

author img

By

Published : Jan 3, 2023, 6:34 AM IST

Political Heat

Political Heat in Telangana : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. భారాస, కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలు... భవిష్యత్తులో ఏ మార్గంలో పయనిస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరు పార్టీ మారతారనే అంశంపై చర్చలు జోరందుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వాతావరణం వేడెక్కింది.

Political Heat in Telangana : రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారత్‌ రాష్ట్ర సమితిలో టికెట్‌ దక్కే అవకాశం లేనివారు, కాంగ్రెస్‌లో అసంతృప్తులు... పార్టీ మారే యోచనలో ఉన్నారు. వీరిలో ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు..? వీరి పయనం ఏ వైపు ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. మహేశ్వరంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి... అధికార పార్టీలో చేరి మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈమె చేతిలో ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

గ్రూపు రాజకీయాలు : కొల్లాపూర్‌ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఆయనపై గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి... ఆ తర్వాత భారాసలో చేరారు. అప్పటి నుంచి రెండు గ్రూపుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. జూపల్లి కృష్ణరావు మరో పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది. తాండూరులోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్‌ లభిస్తుందన్న పట్నం మహేందర్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రోహిత్‌రెడ్డి కీలకంగా మారడంతో... తాండూరులో ఎలాంటి రాజకీయ మార్పులు చోటుచేసుకొంటాయో చూడాల్సి ఉంది.

తుమ్మల పయనం ఎటువైపు : ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లావ్యాప్తంగా ప్రభావం, గుర్తింపు ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ప్రస్తుతం భారాసలోనే ఉన్నా... భవిష్యత్తులో మార్పు చోటుచేసుకొనే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం ఉంది. 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలిచిన ఉపేందర్‌రెడ్డి... ఆ తర్వాత భారాసలో చేరారు. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో వామపక్షాలు భారాసకు మద్దతు పలికాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలను సీపీఐ, సీపీఎంలు కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మలకు పాలేరు టికెట్‌ ఇస్తారా అన్నది వేచిచూడాలి. సీపీఎం కూడా ఈ స్థానాన్ని కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల పయనం ఎటువైపు ఉంటుందన్నది ఆసక్తికరం కానుంది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి... 2014 లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా తరపున ఖమ్మంలో ఎంపీగా గెలుపొందడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి భారాసలో చేరారు. అనధికారికంగా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చారన్న ప్రచారం, జిల్లాలో కొందరు నాయకులతో విభేదాలతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ లభించలేదు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటారని, ఆయన చెప్పినట్లు వింటారనే ప్రచారం ఉంది. అయితే నూతన సంవత్సరం వేడుక సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా ఉన్నాయి. పొంగులేటికి కొత్తగూడెం నుంచి అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం ఉంది. అయితే తనకే కాకుండా తాను సూచించిన మరికొందరికీ టికెట్‌ ఇవ్వాలని ఈయన కోరుతున్నట్లు తెలిసింది. ఖమ్మం శాసనసభ స్థానం నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

అసంతృప్తులకు గాలం వేసే పనిలో ఓ పార్టీ : నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కాంగ్రెస్‌తో విభేదాలు తీవ్రమయ్యాయి. ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి భాజపాలోకి చేరారు. అనూహ్య మార్పులు జరిగితే తప్ప కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎన్నికలకు నెల ముందు తన భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్‌ కమిటీపై కొండా సురేఖ కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది. బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్న ఓ పార్టీ... భారాస, కాంగ్రెస్‌లో అసంతృప్తుల తమ వైపు రప్పించుకోవాలని చూస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.