ETV Bharat / state

రైతుబంధుకు రంగం సిద్ధం

author img

By

Published : May 12, 2020, 9:24 AM IST

వానాకాలం పంటలకు పెట్టుబడి సాయాన్ని అందించేలా రాష్ట్రంలో రూ.7 వేల కోట్లను విడుదల చేస్తున్నట్లు విత్తమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోని రైతులకూ రైతుబంధు పథకం ద్వారా సాయం అందనుండగా రబీలో అసంపూర్తి చెల్లింపులపై స్పష్టత లేనందున అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

rythu bandhu scheme fund is released for telangana farmers
రైతుబంధుకు రంగం సిద్ధం

జగిత్యాల జిల్లాలోని రైతులకూ రైతుబంధు పథకం ద్వారా సాయం అందనుండగా రబీలో అసంపూర్తి చెల్లింపులపై స్పష్టత లేనందున అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

  • జూన్‌లో వానాకాలం పంటలు ఆరంభమవుతాయి. ఈ లోపే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన క్రమంలో నిధులను విడుదల చేశారు. సీజనుకు సన్నద్ధత నిధుల విడుదల బాగానే ఉన్నా గత వానాకాలం, ఈ యాసంగి పంటకాలాలకు చెంది నిధులందని రైతుల సంగతేమిటన్నది ప్రశ్నగా మారింది.
  • ఒక రైతుపేరిట ఎంత భూమి ఉన్నా అంత భూమికి ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్నట్లు ప్రకటించినా గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి మాత్రం 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే చెల్లించారు. 10 ఎకరాల కన్నా ఎక్కువ భూమిగలవారు, రెవెన్యూ రికార్డుల్లో తప్పులున్నవారు, ఇతరత్రా కారణాలతో దాదాపుగా రూ.41 కోట్లవరకు నిధులు జిల్లా రైతులకు అందలేదు.
  • ఈ యాసంగి పంటకాలంలో జగిత్యాల జిల్లాలో 2.06 లక్షల మంది రైతులకు రూ.209 కోట్లను ఇవ్వాల్సి ఉంటుందని తొలుత అధికారులు భావించారు. కానీ 2018 యాసంగిలో చెల్లించిన జాబితానే పరిగణలోకి తీసుకోవడంతో రైతుల సంఖ్య, చెల్లించాల్సిన మొత్తం తగ్గింది. 2018 యాసంగి జాబితా ప్రకారం జిల్లాలోని 380 గ్రామాల పరిధిలో 1,67,816 మంది రైతులకు రూ.183 కోట్లను ఇవ్వాల్సి ఉంది. వీరిలో 1,45,277 మంది రైతులకు రూ.121.93 కోట్లను చెల్లించారు. 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్నవారికే చెల్లింపులు జరిపినందున ఇంకనూ 22,539 మంది రైతులకు రూ.61.06 కోట్లు రావాల్సి ఉంది.
  • ఈ సీజన్‌లో తక్కువ భూమి ఉన్నవారి నుంచి ఎక్కువ భూమి కలిగినవారిని గుర్తించి క్రమంగా చెల్లింపులు జరుపుతూ 5 ఎకరాలున్న వారి వరకు చెల్లించారు. 5 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నవారికి నిధులు రానందున ఎంత భూమి ఉన్నవారికి చెల్లిస్తారనేది రైతుల్లో ఉత్కంఠకు కారణమైంది. ఓవైపు రైతుబంధుకు భూ పరిమితిని విధించలేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నా 5 ఎకరాలకు పైబడి భూమి ఉన్నవారికి నిధుల్లో నుంచి చెల్లించటంపై స్పష్టతనివ్వకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
  • లాక్‌డౌన్‌ వల్ల మార్చి రెండో పక్షం నుంచి చెల్లింపులను నిలిపివేసినా ప్రస్తుత నిధులను విడుదల చేయడంతో నిధులందని రైతుల్లో మళ్లీ ఆశలు కలిగాయి. గత రెండు సీజన్లకు సంబంధించి దాదాపుగా రూ.100 కోట్లవరకు బకాయిలుండగా వీటిని చెల్లించాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఒకవేళ పరిమితి విధించినట్లయితే వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని లేకుంటే నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.
  • ఒక రైతుకు ఎంత భూమి ఉన్నా పరిమితి విధిస్తే ఆ పరిమితి మేరకు రైతులందరికీ కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపచేయాలని అత్యధికశాతం రైతులు అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు 10 ఎకరాల పరిమితి విధిస్తే 25 ఎకరాలున్న రైతుకు కూడా 10 ఎకరాలకు మాత్రమే సాయాన్ని ఇవ్వాలని, ఇది హెచ్చుతగ్గులకు, వివక్షకు ఆస్కారం లేకుండా ఉంటుందని, ఈ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మెజారిటీ అన్నదాతలు అభిలషిస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.