ETV Bharat / state

Polavaram Project: పోలవరం పనుల్లో అపశ్రుతి.. సొరంగాల్లో కూలిన కొండ!

author img

By

Published : Oct 26, 2021, 9:35 AM IST

పోలవరం ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్​ ప్రజల కలల సౌధం. వచ్చే ఏడాది జూన్‌ 30నాటికి కుడి, ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా నీరందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ప్రాజెక్టు ప్రధాన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతా అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో జంట సొరంగాల్లో కుడివైపు భాగంలోని సొరంగంలో కొండ భాగం కూలింది. జంట సొరంగాల నిర్మాణం మొదలై పుష్కరం దాటినా నిర్మాణంలో జాప్యం, లైనింగ్‌ పనులు నిలిచిపోవటం, రెండు కొండల వాలు ప్రాంతంలో సొరంగ మార్గం ఉండటం తదితర కారణాలతో ఇలా జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో పెద్దగొయ్యి ఏర్పడింది.

polavaram-project
జంట సొరంగాల పనులకు అవరోధం

ఈ చిత్రంలో కనిపిస్తున్నది పోలవరం 64వ ప్యాకేజీలో భాగంగా మామిడిగొంది-తోటగొంది గ్రామాల మధ్యలో 800 మీటర్ల పొడవున కుడివైపు సొరంగంలో కొండ కూలిన ప్రాంతం. సాధారణంగా కొండ విరిగిపడటం చూస్తాం. ఇక్కడ మాత్రం సొరంగంలో దిగిపోయింది. పోలవరం అనుబంధ పనుల్లో భాగంగా ఏర్పాటుచేస్తున్న జంట సొరంగాల మార్గంలోనే ఈ గొయ్యి ఏర్పడింది. దీని లోతు సుమారు 30 మీటర్లు. సొరంగాల లోపలి భాగం చుట్టూ లైనింగ్‌ పనులు చేయకపోవటంతో కొండ బరువుకు పైభాగం కుంగింది.

కారణాలెన్నో..

సొరంగాల లోపలి భాగం చుట్టూ 80 సెం.మీ. మందంతో చేపట్టాల్సిన కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు ఇప్పటివరకూ మొదలుకాలేదు. సొరంగాలకు రెండు వైపులా కొండలు ఉండటం వల్ల వర్షపు నీరు పైభాగంలో నిండుగా ప్రవహిస్తుంది. దీంతో సొరంగ ప్రాంతంలో క్రమేణా రంధ్రాలు పడటం, అది బలహీనపడటం, మరోవైపు కొండ బరువెక్కడం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

లైనింగ్‌ పనుల్లో పురోగతి లేదు..

లైనింగ్‌ పనులకు ఏడాది కిందటే అనుమతులు వచ్చినా పురోగతి లేదు. ప్రస్తుతం కొండవాలులోని నీరు ఇప్పటికి కూలిన భాగంలోకి చేరుతోంది. ఈ నీటి ద్వారా కొట్టుకొచ్చిన గ్రావెల్‌.. సొరంగం ముఖద్వారం వద్ద గుట్టగా కనిపిస్తోంది. అటువైపు ఎవరూ వెళ్లకుండా అధికారులు సూచికలు ఏర్పాటుచేశారు. కొండచరియలు దాదాపు రెండు నెలల క్రితమే కూలినట్లు స్థానిక పశువుల కాపరులు చెబుతున్నారు. ప్రాజెక్టు వెనక భాగంలో నీటిని కుడి కాలువలకు తరలించేందుకు ఓ రెగ్యులేటర్‌తోపాటు జంట సొరంగాలను వినియోగిస్తారు. వీటి నిర్మాణం 2005లో ప్రారంభించారు. 64వ ప్యాకేజిలో భాగంగా మామిడిగొంది, తోటగొంది మధ్యలో 800 మీటర్ల పొడవునా తవ్వకం ప్రారంభించారు.

అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు లేవని 2006 మే నెలలో పనుల నిలిపివేతకు సుప్రీంకోర్టు ఉత్తర్వులనిచ్చింది. ఈ అనుమతులు లభించడంతో 2008 సెప్టెంబరులో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. అన్ని అవరోధాలను అధిగమించి సొరంగాలను నిర్మించారు. లైనింగ్‌ ఆకృతులకు ఏడాది కిందట అనుమతులు వచ్చాయి. 16 మీటర్ల వెడల్పున 20 మీటర్ల ఎత్తున సొరంగాలు తీశారు. వాటి అడుగుభాగాన బెడ్‌లెవెల్‌ కాంక్రీట్‌ను మాత్రమే వేయగలిగారు. లైనింగ్‌ పనులకు రేపుమాపంటూ కాలం నెట్టుకువస్తుండగా ప్రభుత్వం నీటి సామర్థ్యం పెంపునకు సొరంగాలను వెడల్పు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈలోగా సొరంగం పైభాగంలోని కొండ కూలింది.

బలహీన ప్రాంతం కావడంతో..

సొరంగ మార్గంలో గొయ్యి పడిన చోటు బలహీన ప్రాంతం. లైనింగ్‌ చేసేందుకు అనుమతులు వచ్చినా సొరంగాలను వెడల్పు చేయాల్సిన నేపథ్యంలో పనులు మొదలుపెట్టలేదు. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వారి మార్గదర్శకాల ప్రకారం గొయ్యి మరమ్మతు పనులు పది రోజుల్లో మొదలుపెడతాం.

-కె.బాలకృష్ణ, ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అనుబంధ పనుల ఈఈ.

ఇవీచదవండి: TSRTC Revenue Loss: నష్టాల్లో ఆర్టీసీ... దీపావళి తర్వాత ఛార్జీల పెంపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.