ETV Bharat / state

ప్రివిలేజ్‌ నోటీసుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే వరకు సభ బహిష్కరణ

author img

By

Published : Feb 10, 2022, 4:39 PM IST

Updated : Feb 10, 2022, 5:03 PM IST

TRS MPs walkout from Lok Sabha sessions 2022
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

16:37 February 10

లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేసిన తెరాస ఎంపీలు

TRS MPs walkout from Lok Sabha sessions 2022
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

TRS MPs walkout from Lok Sabha

లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్‌ చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల విషయంలో తెరాస ఎంపీలు లోక్​సభలో నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్ద నినాదాలు చేశారు. అంతకుముందు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు తెరాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసులిచ్చారు. ప్రధానిపై చర్యలు తీసుకోవాలని తెరాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసులు అందజేశారు. ఏపీ విభజన బిల్లు ఆమోదంపై ప్రధాని వ్యాఖ్యలపై ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్‌ చేశారు. ప్రివిలేజ్‌ నోటీసుపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ నిర్ణయం తీసుకునే వరకు సభ బహిష్కరణకు తెరాస నిర్ణయించింది.

Privilege Notice on Prime Minister: ఉదయం రాజ్యసభలో సైతం ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు.

రాజ్యసభ నుంచి తెరాస వాకౌట్​

అనంతరం తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిలబడి తెరాస ఎంపీలు నిరసన తెలిపారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెరాస ఎంపీ కె.కేశవరావు రాజ్యసభలో ప్రస్తావించారు. సభ్యులను వారించిన డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్​ నారాయణ్.. సభలో గొడవ చేయడం తగదన్నారు. నోటీసును ఛైర్మన్‌ పరిశీలనకు పంపామని.. సంయమనం పాటించాలని సూచించారు. అయితే తెరాస ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. నోటీసుపై నిర్ణయం తీసుకునే వరకూ సభకు వెళ్లకూడదని నిర్ణయించారు.

మండిపడుతోన్న తెరాస..

ఇటీవల రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై తెరాస మండిపడుతోంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ... ఆంధ్రప్రదేశ్‌ విభజన అవమానకరంగా జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సహా ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తెరాస రాజ్యసభ ఎంపీలు ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు.

రాజ్యసభలో ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Modi on Andhra Pradesh Bifurcation : ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై... చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని.. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మైకులు ఆపేసి... ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని... మోదీ ఆక్షేపించారు.

'ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో పార్లమెంటులో మైక్‌లు ఆపేశారు. పెప్పర్‌ స్ప్రే వాడారు. ఎలాంటి చర్చ జరగలేదు. ఈ విధానం సరైనదేనా..? ఇదేనా ప్రజాస్వామ్యం..? అటల్‌జీ ప్రభుత్వం మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. రాష్ట్రాల ఏర్పాటుకు మేం వ్యతిరేకం కాదు, కానీ.. విభజించిన తీరు ఏంటి..? అటల్‌జీ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌లను.. ఏర్పాటు చేసింది. అప్పుడు ఎలాంటి గందరగోళం లేదు. శాంతిపూర్వకంగా.. నిర్ణయం జరిగింది. అంతా కూర్చుని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విభజన కూడా అలాగే చేయగలిగేవారం. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. అంతా కలిసి చేయగలిగేవాళ్లం. కానీ మీ(కాంగ్రెస్‌) అహంకారం, అధికార మత్తు.. దేశంలో ఇంత గందరగోళానికి దారి తీసింది. ఆ గందరగోళం వల్లే.. ఇప్పటికీ తెలంగాణ నష్టపోతోంది. ఆంధ్రప్రదేశ్‌ కూడా నష్టపోతోంది. మీకు ఎలాంటి రాజకీయ లబ్ది కూడా కలగలేదు. మీరా మాకు చెప్పేది.'

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చదవండి:

Last Updated : Feb 10, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.