ETV Bharat / state

సన్నరకం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

author img

By

Published : Nov 4, 2020, 7:21 PM IST

రాష్ట్రంలో సన్నరకం వరి ధాన్యంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సన్నాలకు రూ.1,888లకు, దొడ్డు వరి ధాన్యాన్ని రూ.1868లకు కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది వానకాలంలో వరి సాగులో సన్నరకాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించడం వల్ల రైతులంతా పెద్ద ఎత్తున ఆ వండగాల సాగు చేశారు. తీరా ధాన్యం అమ్ముకోవడానికి వస్తే సన్న రకాలకు సరైన మద్దతు ధరలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Thin type of paddy purchases with rs.1888 in grain purcheses centers
సన్నరకం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమైన దృష్ట్యా... అక్కడక్కడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం సంబంధించి నిర్దేశిత పంట సాగు విధానం అమల్లోకి వచ్చిన తరుణంలో... వరి సాగుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏకంగా 53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగైంది. దాదాపు కోటి టన్నుల ధాన్యం ఉత్పత్తి రాబోతుందని అంచనా. ఈసారి వరి సన్న రకాలు సాగు చేయాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు ఇవ్వడం వల్ల రైతులు దొడ్డు రకాలతోపాటు సన్న రకాల సాగుకు బాగా మొగ్గు చూపారు.

ఏ గ్రేడ్​, సాధారణ రకం

పంట చేతికొస్తున్న తరుణంలో వరంగల్, కరీంనగర్‌ జిల్లాల నుంచి రైతులు ఫోన్ ద్వారా సన్న వరి రకాల కొనగోళ్లపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్​ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ-ఎఫ్‌సీఐ ఆదేశాల మేరకు ధాన్యం పొడవు, వెడల్పు నిష్పత్తి ఆధారంగా వరి ధాన్యాన్ని "ఏ గ్రేడ్", "సాధారణ రకాలు"గా విభజించిన విషయం విదితమే. ఎఫ్‌సీఐ మార్గదర్శకాల ప్రకారం పొడవు వెడల్పు నిష్పత్తి 2.5, ఆపైన ఉన్నట్లైతే "ఏ గ్రేడ్" సన్న రకం, 2.5 కంటే తక్కువ ఉంటే సాధారణ రకం-దొడ్డు రకంగా గుర్తిస్తారు.

వీటికే రూ.1888

తెలంగాణ సోన-ఆర్‌ఎన్‌ఆర్15048 రకం, సాంబమశూరి-బీపీటీ 5204, జై శ్రీరామ్, జగిత్యాల సన్నాలు-జేజీఎల్ 1798, పొలాస ప్రభ-జేజీఎల్384, ఎంటీయూ1061, బీపీటీ 2595, బీపీటీ 3291, డబ్ల్యూజీఎస్ 14, వరంగల్ సన్నాలు-డబ్ల్యూజీఎల్ 32100, సిద్ధి-డబ్ల్యూజీఎల్ 44, జగిత్యాల వరి 1-జేజీఎల్ 24423, కాటన్ దొర సన్నాలు-ఎంటీయూ 1010, కూనారం సన్నాలు-కేఎన్‌ఎం-118, బతుకమ్మ-జేజీఎల్ 18047, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156 రకాలను "ఏ గ్రేడ్" రకాలు గుర్తించాలని స్పష్టం చేశారు. విజేత-ఎంటీయూ 1001 అనే వరి రకాన్ని సాధారణ రకంగా గుర్తించాలన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.1888, సాధారణ రకానికి రూ.1868గా నిర్ణయించారు.

మిల్లర్ల సిండికేట్​

కానీ కొన్ని చోట్ల మిల్లర్లు తక్కువ ధరకు సన్నాలను కొంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1600 నుంచి 1700 రూపాయలు మించి రైస్ మిల్లర్లు రైతులకు ఇవ్వడం లేదు. అంతా సిండికేట్‌గా మారారు. ఈ విషయంపై అన్నదాతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఒక రైస్‌ మిల్లును మూసివేశారు. ఈ నేపథ్యంలో తమపైనే ఫిర్యాదులు చేస్తూ కేసులు పెడతారా అంటూ ధాన్యం కొనబోమంటూ రైస్ మిలర్లు మెరపు సమ్మెకు దిగడం వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు ధాన్యం సేకరణ కేంద్రాల్లో రైతులకు తగిన అవగాహన కల్పించాలని వ్యవసాయ, మార్కెటింగ్ కార్యదర్శి డాక్టర్ జనార్దన్‌ రెడ్డి సూచించారు.

కేవలం రూ.20 తేడా

సన్నాలు వేసి నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నరకానికి దొడ్డు రకం కంటే కేవలం రూ.20 ఎక్కువగా చెల్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.