ETV Bharat / state

Temperature Drops In AP: పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఏపీ గజగజ

author img

By

Published : Dec 23, 2021, 10:12 AM IST

Today Weather Report in AP: ఏపీలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి పంజా విసురుతోంది. సగటు కంటే 5 డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Temperature Drops In AP
ఏపీలో వాతావరణం

Today Weather Report in AP: ఉత్తర, తూర్పు గాలులు.. కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజల్ని వణికించేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 4 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. బుధవారం అత్యల్పంగా విజయనగరంలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోనూ చలి ప్రభావం అధికంగానే ఉంది. బుధవారం గుంటూరు జిల్లా జంగమహేశ్వపురంలో 11 డిగ్రీలు, కళింగపట్నం, ఆమదాలవలస 11.8, బాపట్ల 12.3, అనంతపురం 13, అమరావతిలో 13.3, విజయవాడలో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలైనా కొన్ని చోట్ల చలి తీవ్రత తగ్గడం లేదు.

చలి పంజా

వారం నుంచి చలి తీవ్రత అధికం

ఏపీలో డిసెంబరు 1 నుంచే చలి తీవ్రత అధికమైంది. నవంబరు చివరి వారంతో పోలిస్తే.. సగటున 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. తర్వాత చలి ప్రభావం కాస్త తగ్గినా.. గత వారం రోజులుగా మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. కనిష్ఠంగా విజయవాడలో 1970 డిసెంబరు 14న, 2010 డిసెంబరు 22న 13 డిగ్రీలుగా నమోదైంది. 2013 సంవత్సరంలో 14 డిగ్రీలు నమోదుకాగా.. ఇప్పుడు అదే స్థాయికి ఉష్ణోగ్రతలు తగ్గాయి.

ఉత్తరభారతం నుంచి చలిగాలులు

ఉత్తర భారతదేశంలో చలితీవ్రత అధికంగా ఉంది. అటు నుంచి ఆంధ్రప్రదేశ్‌పైకి గాలులు వీస్తున్నాయి. కోస్తాలో ఉత్తరగాలులు, రాయలసీమలో తూర్పుగాలుల ప్రభావం అధికంగా ఉంది. వీటి ఫలితంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదు కావచ్చు. ఒకటి రెండు రోజుల్లో గాలుల దిశ మారే అవకాశం ఉంది. దీంతో చలి తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

- స్టెల్లా, డైరెక్టర్‌, వాతావరణ కేంద్రం, అమరావతి

.

విశాఖలో నరాలు పట్టే చలి..

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి కొరికేస్తోంది గత వారం రోజులుగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి సాయంత్రం ఐదు గంటల నుంచి చలిగాలులు విపరీతంగా పెరుగుతున్నాయి రాత్రి వేళలో మంటలు వేసుకుంటే గాని ఆరు బయట ఉన్న వాళ్ళు చలిని తట్టుకోలేక పోతున్నారు. చలి వర్షపు జల్లులా కురుస్తోంది. వాహనచోదకులకు కూడా రహదారి కనిపించడం లేదు. పొగమంచు దట్టంగా వ్యాపించి వాహనాలు నడపడానికి ఇబ్బంది పడుతున్నారు. చలిమంటలు కనపడగానే వాహనాలు ఆపి మంటలు తాగుతున్నారు. చలితో నరాలు పట్టేస్తున్నాయి. చలిమంటలు వేస్తే గాని సేద తీరడం లేదు. పాడేరు ఏజెన్సీలో కనిష్టం 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: YCP Leader Hulchal In Guntur : 'నాది అధికార పార్టీ.. నా ట్రాక్టర్​నే సీజ్ చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.