రైతు వేదికల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

author img

By

Published : Aug 4, 2020, 5:00 AM IST

telangana government focus on farmer's platforms constructions

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దసరానాటికి రైతు వేదికలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పనులు ఊపందుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో నిర్దేశిత గడువులోగా తొలి "రైతు వేదిక" నిర్మాణం పూర్తైంది. వినూత్నంగా గ్యాల్ వాల్యూం స్టీల్‌తో దీనిని నిర్మించారు.

అన్నదాతలను సంఘటితం చేసి సాగు విధానాలపై సమిష్ఠి నిర్ణయాలు తీసుకునేందుకు రైతువేదికల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. వ్యవసాయశాఖ, గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపడుతున్న ఈ నిర్మాణాలను ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున చేపడుతున్నారు. రైతువేదికల నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా సాగుతున్నాయి. 32 జిల్లాల్లో మొత్తం 2,604 నిర్మాణాలు చేపడుతుండగా.. వీటిలో 2,588 వేదికలకు భూసేకరణ పూర్తైంది. దసరా నాటికి అన్ని చోట్ల నిర్మాణాలు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రులు, జిల్లాల కలెక్టర్లు నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.

తొలి రైతు వేదిక నిర్మాణం పూర్తి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం క్లస్టర్‌ పరిధిలోని సిరిగిరిపురంలో తొలి రైతువేదిక నిర్మాణం పూర్తైంది. అరఎకరం విస్తీర్ణంలో నెలరోజుల వ్యవధిలోనే ఆధునిక హంగులతో దీనిని తీర్చిదిద్దారు. 22 లక్షల రూపాయల వ్యయంతో 2వేల 46 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ వేదిక నిర్మాణం జరిగింది. విశాల సమావేశ మందిరం, చక్కటి వెలుతురు వచ్చేలా ఏర్పాటు, వ్యవసాయ విస్తరణ అధికారి గది, రైతుబంధు సమితి సమన్వయకర్తకు మరో గది, బయట మరుగుదొడ్లను నిర్మించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణాలను యూనిక్ బిల్డింగ్ కాన్సెప్ట్స్‌ (యూబీసీ) సంస్థకు అప్పగించింది. "కోల్డ్ ఫామ్డ్‌ స్టీల్ స్ట్రక్చర్‌"తో కార్పొరేట్ హంగులతో ఈ వేదికను ముస్తాబు చేశారు. అత్యంత పటిష్ఠంగా నిర్మించిన ఈ భవనానికి ఎలాంటి పగుళ్లు ఏర్పడే అవకాశంలేదు. 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా నిర్మాణం చెక్కుచెదరదని యూబీసీ సంస్థ చెబుతోంది. మంత్రి సబితారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ పర్యవేక్షణలో అతిస్వల్పకాలంలో దీనిని నిర్మించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ వేదికను త్వరలోనే మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితారెడ్డి ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రారంభాలు చేసేందుకు ఏర్పాట్లు

ఈ తరహా రైతు వేదికలను మహేశ్వరంతో పాటు కామారెడ్డిలో మాత్రమే ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలు పూర్తైన వెంటనే సంబరాల నడుమ ప్రారంభాలు చేసేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఇవీ చూడండి: కొత్త సచివాలయం ఎన్ని అంతస్తులో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.