ETV Bharat / state

Cancer in Women : క్యాన్సర్​కు ఎక్కువగా బలవుతోంది మహిళలే

author img

By

Published : Dec 20, 2022, 9:54 AM IST

Cancer attack women : రాష్ట్రంలో మహిళలను క్యాన్సర్‌ నిర్దాక్షిణ్యంగా కబళిస్తోంది. ప్రధానంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఐసీఎంఆర్‌-ఆరోగ్యశ్రీ గణాంకాలను పరిశీలిస్తే.. తెలంగాణలో నమోదైన మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 30 శాతం మహిళలవే ఉండడం ఆందోళనకరం.

Cancer attack womens
Cancer attack womens

Cancer attack women: రాష్ట్రంలో ఏటా సుమారు 49 వేల మంది కొత్తగా మహమ్మారి బారినపడుతుండగా.. 27 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2021లో తెలంగాణలో మహిళల్లో క్యాన్సర్‌ గణాంకాలను పరిశీలిస్తే.. ఇందులో రొమ్ము క్యాన్సర్‌ 5,826 కేసులు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ 5,797 కేసులు.. అండాశయ క్యాన్సర్‌ 198 కేసులు నమోదయ్యాయి.

స్త్రీలకు మాత్రమే వచ్చే క్యాన్సర్లు 30 శాతం కాగా దేశంలో ప్రతి లక్షలో 105.5 మంది రొమ్ము క్యాన్సర్‌ బాధితులు ఉన్నారు. వీరి చికిత్సల కోసం తెలంగాణ సర్కారు వ్యయం ఏటా సుమారు రూ.100 కోట్లు -ఐసీఎంఆర్‌-ఆరోగ్యశ్రీ నివేదికలో వెల్లడి

2021లో మహిళల్లో 14.60 లక్షల క్యాన్సర్‌ కేసులుంటే.. అవి 2025 నాటికి 15.70 లక్షలకు పెరుగుతాయని భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్‌) అంచనా వేసింది. ‘నేషనల్‌ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌’లో నమోదైన బాధితుల గణాంకాల ఆధారంగా ఈ విశ్లేషణ చేసింది.2022లో దేశంలో సగటున ప్రతి లక్ష మంది జనాభాకు 100.4 మంది క్యాన్సర్‌ బాధితులుండగా... రొమ్ము క్యాన్సర్‌ సోకిన మహిళలు 105.4 మంది ఉన్నారు. పురుషుల్లో అత్యధికంగా ప్రతి లక్ష జనాభాకు 95.6 మంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడుతున్నట్లు తేలింది.

మహిళలు, పురుషులు కలిపి.. 30 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి లక్ష మందికి.. ప్రపంచంలో 204 మంది, భారత్‌లో 97.1 మంది, తెలంగాణలో 72.6 మంది బాధితులున్నారు. దేశం మొత్తమ్మీద అత్యధిక క్యాన్సర్‌ కేసులు ఉత్తర్‌ప్రదేశ్‌లో 2022లో 2,10,958 నమోదు కాగా.. ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్రలో 1,21,717, పశ్చిమబెంగాల్‌లో 1,13,581, బిహార్‌లో 1,09,274 నమోదయ్యాయి.

క్యాన్సర్‌ చికిత్సలకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఆరోగ్యశ్రీ ద్వారానే ఏటా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణాలు

* ‘హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌’ ద్వారా ఈ క్యాన్సర్‌ సోకుతుంది.

* మర్మావయవాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం

* పదేపదే సుఖవ్యాధులు సోకడం

* పౌష్టికాహార లోపం

* 18 ఏళ్ల లోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం

రొమ్ము క్యాన్సర్‌ ఎందుకంటే..

* ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం

* 35 ఏళ్లు దాటాక గర్భధారణ

* పిల్లలు లేకపోవడం

* తల్లిపాలు బిడ్డకు పట్టకపోవడం

* జన్యుపరంగా

* ప్రతి తొమ్మిది మంది భారతీయుల్లో ఒకరు 74 ఏళ్ల వయసుకొచ్చేసరికి ఏదో ఒక క్యాన్సర్‌ బారినపడుతున్నట్లు ఐసీఎంఆర్‌-ఆరోగ్యశ్రీ నివేదిక స్పష్టం చేసింది.

క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరీక్షలు: "సంచార వాహనసేవల ద్వారా అన్ని జిల్లాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌, ఖమ్మం, కొత్తగూడెం, మిర్యాలగూడ, దేవరకొండ, నేలకొండపల్లి తదితర ప్రాంతాల్లో 6,025 మందికి పరీక్షలు చేశాం. వీరిలో 56 మందికి క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో వెంటనే చికిత్స మొదలుపెట్టాం. ఎంఎన్‌జేలో కొత్తగా రూ.30 కోట్లతో అధునాతన శస్త్రచికిత్స థియేటర్లు ఏర్పాటు చేశాం. ఇందులో ఒకటి రోబోటిక్‌ థియేటర్‌. పడకల సంఖ్యను 450 నుంచి 750కి పెంచాం. ప్రైవేటు ఆసుపత్రిలో రూ.20 లక్షల వరకు ఖర్చయ్యే బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందిస్తోంది. 33 జిల్లాల్లో పాలియేటివ్‌ కేర్‌ సేవలు ప్రారంభించి అవసాన దశలో ఉన్న వారికి ఆత్మీయంగా సేవలు అందిస్తున్నాం." -డాక్టర్‌ జయలత, సంచాలకులు, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి

మారిన జీవనశైలితో ముప్పు: "పురుషులతో పోల్చితే.. మహిళల్లో అతి వేగంగా క్యాన్సర్‌ కోరలు చాస్తోందని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. మారిన జీవనశైలి, గతి తప్పిన ఆహారపుటలవాట్లు తదితర కారణాల వల్ల ఒకప్పుడు 50 ఏళ్లు దాటాక కనిపించే రొమ్ము క్యాన్సర్‌ కేసులు ఇప్పుడు 30 ఏళ్లలోనే కనిపిస్తున్నాయి. వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల సుమారు 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. టీనేజీ దశలోనే అమ్మాయిలకు హెచ్‌పీవీ టీకా ఇప్పించాలి. 40 ఏళ్లు పైబడిన వారు ఏటా ఒకసారైనా క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవాలి. శారీరక శ్రమ చేయాలి. ఊబకాయాన్ని తగ్గించుకోవాలి." -డాక్టర్‌ సెంథిల్‌ రాజప్ప, సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.