ETV Bharat / state

నేడు ప్రపంచ హార్ట్‌ డే.. ఆ వయసు వారిలో పెరుగుతున్న ముప్పు

author img

By

Published : Sep 29, 2020, 9:55 AM IST

కరోనా రాకమునుపు నగరంలో గుండె వ్యాధులకు సంబంధించి ఎంపిక చేసిన సర్జరీలు అన్ని ఆసుపత్రుల్లో సాధారణంగానే జరిగేవి. కొవిడ్‌ తర్వాత దాదాపు 20 శాతం వరకు ఇవి తగ్గిపోయాయి. వైరస్‌ ముప్పుతో చాలామంది ఈ సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. కొందరైతే సాధారణ చికిత్సలు చేసుకునేందుకూ ముందుకు రావడం లేదు. అకస్మాత్తుగా గుండె వైఫల్యానికి ఇది కారణమవుతోంది’ -గుండె శస్త్ర చికిత్స నిపుణులు

Today is World Heart Day
నేడు ప్రపంచ హార్ట్‌ డే.. ఆ వయసు వారిలో పెరుగుతున్న ముప్పు

హైదరాబాద్​ నగరంలో హృద్రోగ ముప్పు పెరుగుతోంది. కొవిడ్‌ తర్వాత చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. వ్యాయామం చేయడం లేదు. ఎక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు పెరగడం, కరోనా జాగ్రత్తల ఒత్తిడితో సతమతువుతున్నారు. ఈ కారణాలన్నీ గుండెపై ప్రభావం చూపుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. మంగళవారం ప్రపంచ హార్ట్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

తక్కువ వయసులోనే..

ఆహారపు అలవాట్లు, ధూమ, మద్యపానం, శారీరక వ్యాయామం లేకపోవడం తక్కువ వయసులోనే గుండె జబ్బు పాలవడానికి ప్రధాన కారణాలు. నగరంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల యువత ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం గుండె వ్యాధులను నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. నగర జీవనమంటే ఒత్తిడి మయం. ఈ కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం సమస్యల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. 50 శాతం మందికి తమకు అధిక రక్తపోటు ఉన్న సంగతే తెలియక చివరికి తీవ్ర హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి.

కాలుష్యంతోనూ ముప్పు

లాక్‌డౌన్‌ తర్వాత నగరంలో మళ్లీ వాహన రాకపోకలు పెరిగాయి. ముఖ్యంగా వాయు కాలుష్యం వల్ల పల్మనరీ ఎంబోలిజం పెరిగి గుండె వైఫల్యానికి దారి తీస్తోంది. గ్రేటర్‌లో ఇప్పటికే 50 లక్షల వాహనాలు ఉన్నాయి. రోజూ 1500 వరకు కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇవి తీవ్రమైన వాయి కాలుష్యానికి కారణమవుతున్నాయి. నగరంలో పంజాగుట్ట, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, అబిడ్స్‌, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌ లాంటి సెంటర్లలో సాధారణం కంటే 100 శాతం ఎక్కువ వాయు కాలుష్యం పెరుగుతోంది.

కొవిడ్‌తో తీవ్ర ఆందోళన

  • ‘కొవిడ్‌ సమయంలో సాధారణ జనాభాలో ఆందోళన చెందుతున్న వారి శాతం 30 నుంచి 33 శాతం వరకు ఉంది. ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
  • ఒత్తిడి, ఆందోళనలతో రోగ నిరోధక శక్తి మరింత తగ్గిపోవచ్ఛు ఎక్కువగా దిగులు, దుఃఖం సమయంలో గుండెపోటు రావడం వంటివి జరుగుతాయి.
  • పక్షవాతం, గుండె జబ్బులకు అతి పెద్ద ముప్పు కారకం అధిక రక్తపోటు (హైబీపీ). బీపీ ఎక్కువగా ఉన్నా సరే ఎటువంటి హెచ్చరికలు, లక్షణాలు, సంకేతాలు కన్పించవు. లోలోన అది చేయాల్సిన నష్టం చేస్తుంది. అందుకే తరచూ బీపీ చూసుకోవడం అవసరం.
  • కొవిడ్‌ తర్వాత ఇళ్లల్లో కూర్చొని చేసే ఉద్యోగాల్లో ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వారంలో కనీసం అయిదు రోజుల పాటు అరగంట పాటు వ్యాయామానికి కేటాయించినా... చాలావరకు గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.

మహిళల్లోనూ ఎక్కువే

గుండె సమస్యలతో వస్తున్న వారిలో మహిళలు కూడా అధిక శాతం మంది ఉంటున్నారు. స్త్రీలు ఎక్కువ మంది మృత్యువు పాలవుతుండటానికి ముఖ్య కారణం గుండె జబ్బులే. నెలసరి నిలిచిపోయిన స్త్రీలకు అధిక రక్తపోటు ముప్పు ఎక్కువ. హార్మోన్ల సమతౌల్యం కూడా దెబ్బ తింటుంది. స్త్రీలు తరచూ బీపీ చూపించుకోవడం చాలా ముఖ్యం. -డాక్టర్‌ బి.హైగ్రీవ్‌రావు, కన్సల్టెంట్‌ కార్డియాలజిస్టు

ఇవీ చూడండి: ఆ ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.