ETV Bharat / state

RERA: రెరా బేఖాతరు... నిబంధనలు పట్టించుకోని నిర్మాణ సంస్థలు

author img

By

Published : Dec 30, 2021, 7:40 AM IST

Real Estate Regulatory Authority: స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ చట్టం అమలు అంతంత మాత్రంగానే అమలవుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని పలు భవననిర్మాణ సంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) అనుమతి తప్పనిసరి అయినా పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు మినహా ఇతరచోట్ల ఆసక్తి కనబర్చడం లేదు.

Real Estate Regulatory Authority, RERA
RERA

Real Estate Regulatory Authority: స్థిరాస్తి కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని పలు భవన నిర్మాణ సంస్థలు బేఖాతరు చేస్తున్నాయి. స్థిరాస్తి నియంత్రణ అథారిటీ(రెరా) అనుమతి తప్పనిసరి అయినా పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు మినహా ఇతరచోట్ల ఆసక్తి కనబర్చడం లేదు. హైదరాబాద్‌ చుట్టుపక్కలతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పలు జిల్లా కేంద్రాల్లో రెరా అనుమతి లేకుండానే పెద్దసంఖ్యలో అపార్ట్‌మెంట్‌లు, లేఅవుట్‌లు పుట్టుకొస్తున్నాయి. వరంగల్‌ నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో 10 శాతం కూడా రెరా అనుమతి పొందడం లేదు. కరీంనగర్‌, నిజామాబాద్‌ సహా పలు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఎనిమిది, అంత కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉంటే తప్పనిసరి..

రాష్ట్రంలో 2018 ఆగస్టు 31న రెరా అమల్లోకి వచ్చింది. 500 చ.మీ. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టే ప్రాజెక్టు లేదా 8 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు నిర్మించే ప్రాజెక్టుకు ఈ చట్టం అనుమతి తప్పనిసరి. ఇది లేకుండా ప్రీ లాంచ్‌ లేదా విక్రయాలుచేయకూడదు. స్థిరాస్తి రంగంలో పారదర్శకత, కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణ, కొనుగోలుదారులు-రియల్‌ సంస్థల మధ్య వివాదాల సత్వర పరిష్కారం, రియల్‌ వెంచర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండటం వంటి కీలకాంశాలతో రెరా ముడిపడి ఉంది. 2017 జనవరి ఒకటో తేదీ తర్వాత ప్రారంభమై.. చట్టం పరిధిలోకి వచ్చే అన్ని వెంచర్లను రెరా కింద నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఇప్పటివరకూ 3,823 మాత్రమే నమోదు..

రాష్ట్రవ్యాప్తంగా వందలాది లేఅవుట్‌లు వస్తున్నా రెరా కింద నమోదు చేసుకుంటున్నవి నామమాత్రంగానే ఉంటున్నాయి. 2017 జనవరి 1 తర్వాత అనుమతి పొంది 2018 ఆగస్టు 30 వరకు.. అంటే చట్టం అమలులోకి రావడానికి ముందు వరకు రెరా వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన ప్రాజెక్టులు 4,947 ఉన్నట్లు గుర్తించారు. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 2,985, హెచ్‌ఎండీఏ పరిధిలో 640, డీటీసీపీ పరిధిలో 1,122 ఉన్నాయి. వీటి నమోదే పూర్తి కాలేదు. టీఎస్‌బీపాస్‌ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 500 మీటర్లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోని ప్రాజెక్టులే రెండు వేలకు పైగా ఉన్నాయి. రెరా అమలులోకి వచ్చాక వేల వెంచర్లు వచ్చినా ఇప్పటివరకూ నమోదైనవి 3,823 మాత్రమే. అనుమతి లేని ప్రాజెక్టులపై చట్టంలోని సెక్షన్‌ 59 ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు అమలు చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో మినహా జరిమానాలు విధించిన దాఖలాలు లేవు. నోటీసులు కూడా ఇవ్వకపోవడంతో రియల్‌ సంస్థలు చట్టాన్ని బేఖాతరు చేస్తున్నాయి.

ఇదీ పరిస్థితి

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ ఏడాది 14 వేలకు పైగా భవన నిర్మాణ అనుమతులిచ్చారు. వీటిలో 25 శాతమైనా నమోదు చేసుకోలేదు.
  • వరంగల్‌లో ఈ ఏడాది 160కి పైగా భారీ భవనాల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఇప్పటివరకూ రెరా కింద 10 ప్రాజెక్టులు కూడా నమోదు కాలేదు.
  • చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నిజామాబాద్‌లో సుమారు 100కుపైగా పెద్ద భవన నిర్మాణ ప్రాజెక్టులు వచ్చాయి. రెరా కింద నమోదైనవి వీటిలో పదో వంతు కూడా లేవు.
  • సింగిల్‌ విండో అనుమతుల ద్వారానే రాష్ట్రంలో ఈ ఏడాది 1,900 ప్రాజెక్టులు ఆమోదం కోసం వచ్చాయి. భవన నిర్మాణ అనుమతుల ఆమోదం పొందాక రెరా నమోదు తప్పనిసరి.
  • భారీ లేఅవుట్‌లు పెద్దసంఖ్యలో వస్తున్నా రెరా నమోదు మాత్రం చేసుకోవడం లేదు.

ఇదీ చదవండి: new year celebrations Guidelines : న్యూ ఇయర్​ వేడుకలు సిద్ధమవుతున్నారా..? ఇవి తెలుసుకోవాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.