ETV Bharat / state

'2030 వరకు లైఫ్ సైన్సెస్​లో తెలంగాణ ఆసియాలోనే నెంబర్​వన్ కావాలి'

author img

By

Published : Nov 3, 2020, 7:45 PM IST

Updated : Nov 3, 2020, 8:19 PM IST

2030 వరకు లైఫ్ సైన్సెస్ విభాగంలో తెలంగాణ ఆసియాలోనే ప్రధాన క్లస్టర్​గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ విజన్ 2030 రిపోర్టును ఆయన విడుదల చేశారు.

తెలంగాణ లైఫ్​సైన్సెస్​ విజన్​ 2020 నివేదికను విడుదల చేసిన కేటీఆర్​
తెలంగాణ లైఫ్​సైన్సెస్​ విజన్​ 2020 నివేదికను విడుదల చేసిన కేటీఆర్​

మరో పదేళ్లలో రాష్ట్రాన్ని ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి లైఫ్ సైన్సెస్ సలహాసంఘం రూపొందించిన తెలంగాణ లైఫ్ సైన్సెస్-విజన్ 2030 నివేదికను పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. పరిశ్రమలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలు, సలహాదారులు, ప్రభుత్వంతో చర్చించి ఈ నివేదికను లైఫ్ సైన్సెస్ సలహాసంఘం రూపొందించింది.

ఇవీ లక్ష్యాలు..

లైఫ్ సైన్సెస్ రంగంలో వంద బిలియన్ డాలర్ల ఎకోసిస్టాన్ని అభివృద్ధి చేయటంతో పాటు 50 బిలియన్ డాలర్ల క్లస్టర్ రెవెన్యూను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆసియాలోనే ఆవిష్కరణలకు మంచి గమ్యస్థానంగా మార్చే ధ్యేయంతో ప్రఖ్యాత పది మల్టీనేషననల్ కంపెనీల్లో మూడు నుంచి ఐదు కంపెనీల పరిశోధనా, అభివృద్ధి కేంద్రాలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చికిత్స పరిశోధన, రోబోస్ట్ సర్వైలైన్స్ వ్యవస్థను అభివృద్ధి చేసేలా ప్రజారోగ్యంలో మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపర్చారు.

సూచించిన సలహాలు..

బయోఫార్మా హబ్, డయోగ్నస్టిక్ హబ్​లను అభివృద్ధి చేయాలని సూచించింది. హైదరాబాద్ ఔషధనగరిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. డ్రగ్స్ తయారీలో వీలైనంత ఎక్కువ స్వయం సమృద్ధి సాధించేలా ఏపీఐ, ఇంటర్మీడియట్ తయారీకి అధికంగా ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. వైద్యఉపకరణాల తయారీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. లైఫ్ సైన్సెస్ రంగానికి టాలెంట్ పూల్ అందుబాటులో ఉండేలా అవసరమైన నైపుణ్యశిక్షణ ఇవ్వాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు మరింత ప్రోత్సహం ఇవ్వడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ ప్రభుత్వానికి తెలిపింది. బయోఏసియా లాంటి మరిన్ని లైఫ్ సైన్సెస్ సదస్సులను నిర్వహించాలని సూచించింది.

లక్ష్య సాధనకు నివేదిక తోడ్పడుతుంది

2030 నాటికి ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా నిలవాలన్న లక్ష్యాన్ని అందుకునేందుకు కమిటీ రూపొందించిన నివేదిక వ్యూహాత్మక దిశానిర్దేశం చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన మానవవనరులు, పటిష్ఠ సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత నాణ్యత కలిగిన మౌలికసదుపాయాలు, క్రియాశీలకంగా ఉన్న ప్రభుత్వం... లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయని లైఫ్ సైన్సైస్ సలహాసంఘం ఛైర్మన్ సతీష్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఇదే స్ఫూర్తి అవసరం: కేటీఆర్​

Last Updated : Nov 3, 2020, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.