ETV Bharat / state

అవసరమైతే రాత్రి వేళల్లోనూ శవపరీక్ష నిర్వహించాలి: హరీశ్‌రావు

author img

By

Published : Dec 11, 2022, 10:46 PM IST

Harish Rao Review On Hospitals: జిల్లాకు ఒక మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లయ్యిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఇవాళ డీఎంఈ పరిధిలోని టీచింగ్ హస్పిటల్స్ పని తీరుపై నెలవారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీచింగ్ ఆసుపత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

harish rao
హరీశ్​రావు

Harish Rao Review On Hospitals: అన్ని సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చుకున్నామని, అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దని స్థానికంగానే మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకున్నామని, టిఫాతో పాటు అన్ని రకాల పరీక్షలు గర్భిణులకు ఆసుపత్రుల్లోనే అందేలా చూడాలన్నారు. ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు.

ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్ అన్ని ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినందున.. ప్రతి సోమవారం ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు సమావేశమై ఇన్ ఫెక్షన్ కంట్రోల్ పై సమీక్ష జరిపి అవరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్‌ను, నర్సును గుర్తించి వారికి నిమ్స్‌లో శిక్షణ ఇచ్చామని, హస్పిటల్‌లో ఇన్భెక్షన్ సమస్యలు రాకుండా పకడ్బందిగా పని చేయాలని ఆదేశించారు. అన్నిఆసుపత్రులకు ఎయిర్ శాంపిలర్స్ పంపించామని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎయిర్ చెకింగ్‌తోపాటు, స్టెరిలైజేషన్ విషయంలో నిర్లక్ష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

డిచ్ఛార్జ్ సమయంలో వైద్యులు రాసిన మందులన్నీ ప్రభుత్వ ఆసుపత్రులల్లో ఇచ్చే పంపాలని, రోగులు డబ్బులు పెట్టి బయట కొనుక్కునే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో మూడు నెలలకు సరిపడ బఫర్ స్టాక్ ఉండేట్లు చూసుకోవాలని, ఈ విషయంలో ఆర్ఎంవోలు, సూపరిడెంట్లు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. అన్నివేళల్లో అవసరమైన వైద్యులు, నర్సింగ్ స్టాఫ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవల విభాగంలో కూడా వైద్య సిబ్బంది తగిన రీతిలో ఉండేట్లు చూసుకోవడంతోపాటు ఎస్ఆర్‌ల సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వైద్యపరికరాలు పాడయితే వెంటనే.. వాటిని గంటల్లోనే రిపేర్ చేసేలా పీఎంయూ విధానం తీసుకువచ్చామని, మెడికల్ పరికరాలు పాడయితే ఫోన్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే వాటిని రిపేర్ చేయిస్తున్నట్లు వివరించారు. అన్ని వైద్య పరికరాలు పూర్తి వినియోగంలో ఉండాలని, సంబంధిత నిర్వహణ ఏజెన్సీలకి ఆన్ లైన్‌లో విషయం తెలియజేయాలని, నిర్దేశిత సమయంలో మరమ్మతులు జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఆసుపత్రిలో నిబంధనల మేరకు రాత్రి వేళ పోస్ట్ మార్టం చేయాలని, అనంతరం ఉచితంగా గమ్యం చేర్చాలన్నారు. టీచింగ్ హస్పిటల్స్‌కు 800 మంది సీనియర్ రెసిడెంట్లను పంపామని, ప్రతి ఆసుపత్రికి 25 నుంచి 30 మంది ఎస్ఆర్​లు కేటాయించినట్లు వివరించారు. వారి సేవలను ప్రణాళికా బద్దంగా వినియోగించుకోవాలన్నారు. అవసరం లేని సి-సెక్షన్ ఆపరేషన్లు జరగకుండా చూడాలని, వైద్యుల సూచన మేరకే సి-సెక్షన్ జరగాలని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.