ETV Bharat / state

మొదలైన సంక్రాంతి సందడి... టోల్​గేట్ల వద్ద పెరిగిన వాహనాల రద్దీ

author img

By

Published : Jan 12, 2023, 5:12 PM IST

Rush At Toll Plaza: ఆంధ్రావారికి సంక్రాంతి పండగ ఎంతో ముఖ్యమైనది. ఇందుకోసం హైదరాబాద్​లోని ఆంధ్రా వాసులంతా సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. భారీగా వాహనాలన్నీ ఆంధ్రాకు క్యూకడుతున్నాయి. దీంతో టోల్​ప్లాజాల వద్ద వాహనాల రద్దీ ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్​ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిలోని టోల్ ప్లాజాలో స్వగ్రామానికి వెళ్లే వారి వాహనాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

టోల్​గేట్
టోల్​గేట్

Rush At Toll Plaza: తెలుగు వారు చేసుకునే ముఖ్యమైన పండుగ సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. తెల్లవారుజామున పల్లె ఆడపడుచులు మేలుకొని వాకిళ్లలో ముత్యాల ముగ్గులేసి మురిసిపోయే పండుగ. అంతేకాకుండా కోడి పందాలతో కోలాహలంగా జరిగే పండుగ సంక్రాంతి. ఇలాంటి పర్వదినానికి ఎవరైనా ఎక్కడున్నా స్వస్థలాలకు చేరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. రాష్ట్రానికి వచ్చే వాహనాలతో టోల్​ప్లాజాల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్​ జామ్​ ఏర్పడుతుంది. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు.

పండగ పురస్కరించుకొని భాగ్యనగరం నుంచి స్వగ్రామాలకు తిరిగి వచ్చేవారితో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. వాహనాలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో దానికి తగ్గట్టుగా టోల్ ప్లాజా వద్ద అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు చేశారు. వాహనాలకు ఫాస్ట్ టాగ్‌ లేకుంటే డబ్బులు తీసుకొని త్వరగా రసీదు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నామని కీసర టోల్ ప్లాజా మేనేజర్ మాదల జయప్రకాష్ తెలిపారు.

సంక్రాంతి హడావుడి మొదలైంది. ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు తరలివచ్చే వాహనదారులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉన్న చిల్లకల్లు టోల్ ప్లాజా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. నిమిషానికి 20 వాహనాలు టోల్ గేట్​ దాటేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిల్లకల్లు టోల్ ప్లాజాలో మొత్తం 12 బూతులు ఉండగా వాటిలో ఆరు బూతులు విజయవాడ వైపు, మిగిలినవి హైదరాబాద్ వైపు ఉన్నాయి. విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగేకొద్దీ అదనంగా మరో రెండు బూతులు తెరిచేందుకు టోల్ ప్లాజా అధికారులు సిద్ధం చేస్తున్నారు.

పండగ సమయంలో అదనపు ఇబ్బందులు ఉండకుండా సిబ్బందిని కూడా నియమించారు. టోల్ ప్లాజాకు 300 మీటర్ల దూరం నుంచి వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. వాహనాలకు ఫాస్ట్ టాగ్​ స్టిక్కర్లు ఉన్నప్పటికీ కొన్నింటికి టోల్ ప్లాజాలో స్కాన్ కావడం లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు ఒక్కో బూతు వద్ద హ్యాండ్ రైడర్ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు తాగునీరు, వసతి సౌకర్యాలు కల్పించారు. పండుగ రోజుల్లో రోజుకి 5 నుంచి 10వేల వాహనాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.