ETV Bharat / state

అయినోళ్లకు దూరంగా.. ఆయువే భారంగా!

author img

By

Published : May 15, 2020, 12:09 PM IST

కరోనా తెచ్చిన కష్టంలో కరిగిపోతున్న జీవితాలెన్నో.. ఓవైపు మహమ్మారి తెచ్చిన భయం.. మరోవైపు మనసులో పెరుగుతున్న భారంతో ముందు వెనకా ఆలోచించకుండా జీవితాన్నే తెంచుకుంటున్నారు. తాత్కాలిక కష్టాలకు భయపడి శాశ్వతంగా బంధాలకు దూరమవుతున్నారు. నగరంలో జరిగిన కొన్ని ఘటనలు అందుకు నిదర్శనం.

loneliness-is-intolerable-suicides-at-lock-down-time
అయినోళ్లకు దూరంగా.. ఆయువే భారంగా!

లాక్‌డౌన్‌ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయి ఒకరు.. కొడుకును చూడలేననే బెంగతో మరొకరు.. మట్టికి దూరమయ్యాననే బాధతో ఇంకొకరు.. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదాంతం. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసింది.

అమ్మ రావొద్దంది.. ప్రాణమే వద్దనుకుంది..!

చిన్న వయసులోనే ఉన్న ఊరిని, కన్నతల్లిని వదిలి పనికోసం నగరానికొచ్చింది కృష్ణా జిల్లాకు చెందిన శ్రీవల్లి. ఆర్థికంగా కుటుంబానికి ఆసరానిచ్చేందుకు వందల మైళ్లు దాటి హైదరాబాద్‌ చేరుకుని ఇక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. ప్రతినెలా ఠంచనుగా ఇంటికి డబ్బులు పంపేది. గతవారమే తన అక్కకి కొడుకు పుట్టాడు. లాక్‌డౌన్‌ ఉన్నా ఎలాగైనా వెళ్లాలనే ఆలోచనతో తోచిన అన్ని ప్రయత్నాలు చేసింది. ఐదు రోజులుగా రోజూ వస్తానంటూ అమ్మకి ఫోన్‌ చేసింది. కానీ, వచ్చినా ఇక్కడ క్వారెంటెయిన్‌లో పెడుతున్నారు రావొద్దని తల్లి నచ్చజెప్పింది. క్షణికావేశంలో భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

‘తల్లి’డిల్లి.. తనువు చాలించి..

నగరంలోని చిక్కడపల్లి ప్రాంతంలో ఉంటున్న లక్ష్మి, బాలరాజు దంపతుల సొంతూరు సిరిసిల్ల. ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి ఇక్కడే స్థిరపడ్డారు. యూకేలో ఉంటున్న కొడుకు మార్చిలో రావాల్సింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకుని అక్కడే ఆగిపోయాడు. అప్పటి నుంచి ఆందోళనలో ఉన్న తల్లి యాసిడ్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

మనసు భారమై..

పల్లె నుంచి 50రోజుల క్రితం కొడుకును చూడటానికి నగరానికొచ్చాడు ఓ వృద్ధుడు. రెండురోజులు ఉండిపోదామనుకునే సమయానికి లాక్‌డౌన్‌ ఇక్కడే ఆపేసింది. మట్టికి దూరమైన ఆ మనసు బరువెక్కడంతో ఇక ఇంటికి వెళ్లలేనేమోననే బెంగతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు సూర్యాపేటకు చెందిన వెంకన్న(70). అక్కడ వ్యవసాయం చేసుకునే వృద్ధుడు హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో ఉంటున్న కొడుకు వీరేశంను చూడటానికి లాక్‌డౌన్‌కి ముందు వచ్చాడు. వెళదామనుకొనేసరికి లాక్‌డౌన్‌ వచ్చింది. వారాల తరబడి నాలుగు గోడలకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొడుకుతో రోజూ తన వేదనను చెప్పుకొన్నా సొంతూరు వెళ్లలేని పరిస్థితి. తిరిగి ఊరుని చూడలేమోనన్న ఆందోళనతో బుధవారం ఉరిపోసుకున్నాడు.

గుర్తించి భరోసానివ్వాలి..

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా చాలామందిలో ఆత్మహత్యల్లాంటి విపరీత ఆలోచనలే పుడుతున్నాయి. తాము దూరమవుతున్న వారితో ఎంత ఫోన్లో మాట్లాడుతున్నా మనసు కోరుకునే స్పర్శ దొరక్కపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి లక్షణాలున్న వారిని గుర్తించి భరోసానివ్వాలి. ప్రేమను పంచాలి.

- డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, మానసిక వైద్యనిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.