ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. ప్రతాప్‌గౌడ్‌కు కీలక పదవి ఆఫర్‌..!

author img

By

Published : Nov 26, 2022, 7:06 AM IST

MLAs poaching case : సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖతో పాటు హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌లను సిట్‌ శుక్రవారం 8 గంటల పాటు ప్రశ్నించింది. నందకుమార్‌కు ప్రతాప్‌ గౌడ్‌ భారీగా డబ్బులు ఇచ్చినట్లు గుర్తించిన సిట్‌.. అందుకు కారణాలను ఆరా తీసింది. నిందితులు కేంద్రం అధీనంలోని పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో ఈ డబ్బులు ఇచ్చినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది.

'ఎమ్మెల్యేల ఎర' కేసు.. ప్రతాప్‌గౌడ్‌కు కీలక పదవి ఆఫర్‌..!
'ఎమ్మెల్యేల ఎర' కేసు.. ప్రతాప్‌గౌడ్‌కు కీలక పదవి ఆఫర్‌..!

MLAs poaching case : ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు విచారణలో కొత్త విషయాలు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దృష్టికి వస్తున్నాయి. నిందితుడు నందకుమార్‌ భార్య చిత్రలేఖ, హైదరాబాద్‌ అంబర్‌పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్‌గౌడ్‌లను సిట్‌ శుక్రవారం సుదీర్ఘంగా 8 గంటల పాటు ప్రశ్నించింది. కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కు కూడా విచారణకు రావాలని నోటీసులివ్వగా.. తనకు గాయం కావడంతో చికిత్స పొందుతున్నందున రాలేనని ఆయన సమాచారం అందించారు.

ప్రతాప్‌గౌడ్‌ తడబాటు.. కంటతడి..: అధికారుల ప్రశ్నలకు ప్రతాప్‌గౌడ్‌.. తొలుత తెలియదని చెప్పడంతో కొన్ని ఆధారాలను వారు చూపినట్లు తెలిసింది. నందకుమార్‌కు ప్రతాప్‌గౌడ్‌ భారీగా డబ్బు ఇచ్చినట్లు గుర్తించిన సిట్‌.. అందుకు కారణాలను ఆరా తీసింది. ఈ క్రమంలో తడబాటుకు గురైన ప్రతాప్‌గౌడ్‌ ఒకదశలో కంటతడి పెట్టినట్లు తెలిసింది. పలు దఫాలుగా ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పినట్లు సమాచారం. నిందితులు కేంద్రప్రభుత్వ అధీనంలోని కీలక పదవి ఇప్పిస్తామని నమ్మించడంతో భారీగా డబ్బు ఇచ్చానని అంగీకరించినట్లు తెలిసింది. ఈ విషయంలో నిందితులకు, ప్రతాప్‌గౌడ్‌కు మధ్య జరిగిన పలు సంభాషణలు లభ్యమైనట్లు సమాచారం. ప్రతాప్‌గౌడ్‌ ఫోన్లలో అవి రికార్డు కావడంతో వాటిని సిట్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పదవి ఇస్తామంటూ డబ్బులు వసూలు చేయడంపై మరో కేసు నమోదు చేసే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. శనివారం కూడా విచారణకు రావాలని వారు ప్రతాప్‌గౌడ్‌కు సూచించారు.

భార్య ఫోన్‌కు స్క్రీన్‌షాట్లు పంపిన నందకుమార్‌..? రామచంద్రభారతి, సింహయాజిలకు.. ఎమ్మెల్యేలకు మధ్య నందకుమార్‌ అనుసంధానకర్తగా వ్యవహరించాడని పోలీసులు భావిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో ఉన్న పరిచయంతో మిగిలిన ఇద్దరు నిందితులను నందకుమార్‌ ఆయనతో మాట్లాడించాడు. ఈ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్లు.. నందకుమార్‌ తన భార్య చిత్రలేఖ సెల్‌ఫోన్‌కు వాట్సప్‌ ద్వారా పంపినట్లు గుర్తించిన అధికారులు ఆమెను ప్రశ్నించారు. తొలుత తనకు తెలియదని ఆమె బదులివ్వగా.. ఆధారాలను ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. తన భర్త పలు విషయాలు తనకూ చెప్పారని చిత్రలేఖ అంగీకరించినట్లు సమాచారం. కేసు నమోదు తర్వాత నిందితుల రిమాండ్‌కు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో రామచంద్రభారతి, సింహయాజి రెండు రోజులపాటు నందకుమార్‌ ఇంట్లోనే ఉన్నారు. వారిద్దరినీ ఎందుకు పిలిపించారనే ప్రశ్నకు.. పూజల కోసమే అని చిత్రలేఖ చెప్పినట్లు తెలిసింది. సోమవారం మళ్లీ విచారణకు రావాలని సిట్‌ ఆమెకు సూచించింది.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేల ఎర కేసు... చిత్రలేఖపై 8 గంటలపాటు సిట్‌ ప్రశ్నల వర్షం..

చిన్నారిని చంపి రక్తం తాగిన మహిళ.. పిల్లలు లేరనే కారణంతోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.