ETV Bharat / state

కంటి చూపుతో పట్టేస్తున్నాయ్‌.. ప్రత్యక్ష ఆధారాలిస్తున్నాయ్​

author img

By

Published : Mar 2, 2020, 6:36 AM IST

భాగ్యనగంలో ఎటుచూసినా సరికొత్త నిఘా నేత్రాలు కనిపిస్తున్నాయి. ఇవి దొంగలు, నిందితుల జాడను ఇట్టే కనిపెడుతున్నాయి. హైదరాబాద్​ నగరంలో శాంతిభద్రతలు స్థాపించడానికి ట్రాఫిక్‌ పోలీసులకు ఎంతగానో ఈ కొత్త తరహా సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. ఐటీఎంఎస్‌ ద్వారా క్లిష్టమైన కేసుల్లో సైతం ప్రత్యక్ష ఆధారాలు అందిస్తూ పలు కేసులను సులువుగా ఛేదిస్తున్నాయి.

latest model cc cameras helped to the traffic police for solving major cases in Hyderabad
కంటి చూపుతో పట్టేస్తున్నాయ్‌.. ప్రత్యక్ష ఆధారాలిస్తున్నాయ్​

హైదరాబాద్‌ నగరంలో రహదారులను కనిపెట్టి చూసేందుకు ఎన్ని రకాల కళ్లున్నాయో! వాటిల్లో దేని పనితనం దానిదే. అవి మామూలు కళ్లు కాదు... అత్యాధునిక కెమెరాలు. వాహనం ఎంత వేగంగా వెళ్లినా నంబరు ప్లేట్‌లోని వివరాలను దానంతటదే జూమ్‌ చేసుకొని చూడగలిగిన ఆటోమెటిక్‌ నంబరుప్లేట్‌ రికగ్నిషన్‌(ఏఎన్‌పీఆర్‌) కెమెరాల గురించి తెలిసిందే. అలాగే వాహనం ఎంత వేగంగా వెళ్తోందో చూపించేవి స్పీడ్‌ లేజర్‌ గన్‌లు. పీటీజడ్‌ కెమెరాలు 360 డిగ్రీల్లో తిరుగుతూ పరిశీలిస్తుంటాయి.

ఆర్నెళ్ల నుంచి అందుబాటులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐటీఎంఎస్‌)లోని కెమెరాలు శాంతి భద్రతల పోలీసులకు బాగా అక్కరకొస్తున్నాయి. న్యూయార్క్‌ పోలీసులు ఉపయోగిస్తున్న అధునాతనమైన ఈ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చినట్టు అదనపు సీపీ (ట్రాఫిక్‌) ఎస్‌.అనిల్‌కుమార్‌ తెలిపారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వీటిని 260 చోట్ల అమర్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించడం కోసం వీటిని ప్రవేశపెట్టగా దొంగలను.. నిందితులను కూడా పట్టిస్తున్నాయి. గత ఐదు నెలల్లో 60 కేసుల్లో ఇవి కీలకమైన ఆధారాలను అందించాయి.

ఆటోలో ప్రయాణికులు.. రూ.3 లక్షలు కొట్టేశారు..

కొత్తపేటలో ఉంటున్న విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి ఎం.విజయమోహన్‌రెడ్డి ఫిబ్రవరి 1న భార్యతో కలిసి రూ.3 లక్షల నగదుతో మలక్‌పేట రైల్వేస్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కారు. ఆటోలో అప్పటికే కొందరు ప్రయాణికులున్నారు. ఇంటికి వెళ్లి చూసుకునేసరికి రూ.3 లక్షల నగదు కనిపించలేదు. మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయన ఎక్కిన ఆటో నంబరు టీఎస్‌11యూఏ0239 అని గుర్తించారు. డ్రైవర్‌ను.. అతడి ఆధారంగా నిందితులను పట్టుకుని రూ.3 లక్షలు బాధితుడికి ఇప్పించారు.

విలువైన పత్రాలు.. గంటల్లో ఇప్పించారు

ఔరంగాబాద్‌లో నివాసముంటున్న ముఖేష్‌ కుమార్‌ కల్యాణ్‌ స్నేహితులతో కలసి జనవరి 8న హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాలు చూసేందుకు వచ్చారు. చార్మినార్‌లో వారంతా ఆటో ఎక్కారు. బిర్లామందిర్‌ వద్ద దిగారు. తర్వాత ముఖేష్‌ తన వస్తువులను చూసుకోగా.. చిన్న సంచి కనిపించలేదు. అందులో ఏటీఎం, ఆధార్‌, పాన్‌ కార్డులున్నాయి. ఆయన సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారు ప్రయాణించిన ఆటో నంబరు గుర్తించారు. అనంతరం డ్రైవర్‌కు ఫోన్‌ చేసి ముఖేష్‌ వస్తువులను తిరిగి ఇప్పించారు.

తప్పుడు నంబరు ప్లేట్లు..

ట్రాఫిక్‌ చలానాలను తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు బైకులు, కార్ల నంబర్లను మార్చేస్తుంటారు. వాటినీ ఈ కెమెరాలు పట్టేస్తున్నాయి. ఉదాహరణకు విద్యానగర్‌ వై-జంక్షన్‌ వద్ద నీలం రంగు యాక్టివా వెళ్తోంది. రవాణా శాఖ రికార్డుల్లో దాని నంబరు ప్రకారం ఆరా తీస్తే అది బూడిదరంగు యాక్టివాకు కేటాయించినట్టుంది. వెంటనే ఈ విషయాన్ని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వివరించగా.. ఇన్‌స్పెక్టర్‌ నర్సింగరావు బేగంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘరానా దొంగలను పట్టించిన కారు..

ప్రముఖ రాజకీయ నేత టి.సుబ్బరామిరెడ్డి సోదరుడు టి.ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో గతేడాది ఆగస్టులో భారీ దొంగతనం జరిగింది. బంజారాహిల్స్‌ పోలీసులకు సీసీ కెమెరాలో ఒక నిందితుడి చిత్రం మినహా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. శ్రీనగర్‌ టీ-జంక్షన్‌ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని ఇన్‌స్పెక్టర్‌ నర్సింగరావుకు సమాచారం ఇచ్చారు. ఆ కారు నంబరు హెచ్‌ఆర్‌ 26బీఎఫ్‌0786 అని తెలుసుకున్నారు. పోలీసులు పరిశోధించి దిల్లీలో ఉంటున్న ఘరానా నిందితుడిని పట్టుకున్నారు.

సీఎం కేసీఆర్‌కు అనుమానాస్పద పార్శిల్‌ పంపిన కేసులో...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలువురికి ఆరు నెలల క్రితం సికింద్రాబాద్‌ పోస్టాఫీస్‌ నుంచి 62 అనుమానాస్పద పార్శిళ్లు బుక్‌ చేశారు. బాటిళ్లలో ఉన్న ద్రవాన్ని చూసి ప్రమాదకర రసాయనాలు కావచ్చనే ఆందోళన నెలకొంది. మహంకాళి పోలీసులు పార్శిళ్లు బుక్‌ చేసేందుకు వచ్చిన వ్యక్తి చిరునామాను పరిశీలిస్తే అది తప్పుడుదని తేలింది. పోలీసులు ఈ కెమెరాలను ఆశ్రయించి టీఎస్‌ 10యూబీ 6922 నంబరున్న ఆటో పోస్టాఫీస్‌ వద్దకు వచ్చినట్టు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ ద్వారా నిందితుడి చిరునామా తెలుసుకుని 48 గంటల్లో అతడిని అరెస్ట్‌ చేశారు. తమ ప్రాంతంలో మంచినీళ్లు సరిగా రానందుకు నిరసనగా తాను ఆ పని చేసినట్టు అతడు చెప్పాడు.

latest model cc cameras helped to the traffic police for solving major cases in Hyderabad
కంటి చూపుతో పట్టేస్తున్నాయ్‌.. ప్రత్యక్ష ఆధారాలిస్తున్నాయ్​

ఇదీ చూడండి: బంగాల్​పై భాజపా గురి- దీదీని దించేందుకు పక్కా స్కెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.