కలిసికట్టుగా పోరాడి బతుకులను మార్చుకుందాం: సీఎం కేసీఆర్‌

author img

By

Published : Mar 26, 2023, 4:47 PM IST

Updated : Mar 26, 2023, 5:21 PM IST

KCR

KCR Speech in Maharashtra Meeting: 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పార్టీలు మారాయి తప్ప.. ప్రజల తలరాత మారలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. దేశంలో అన్ని వనరులున్నాయని.. కానీ ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపించారు. కలిసికట్టుగా పోరాడి బతుకులను మార్చుకుందామని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కలిసికట్టుగా పోరాడి బతుకులను మార్చుకుందాం: సీఎం కేసీఆర్‌

KCR Speech in Maharashtra Meeting: మహారాష్ట్రలోని లోహ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి బహిరంగ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో రెండోసారి సభ నిర్వహించింది. ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్‌లో ఏర్పాటు చేసిన ఈ సభకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా సభావేదిక మీద ఏర్పాటు చేసిన మహారాష్ట్ర యోధులు ఛత్రపతి శివాజీ మహరాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా పూలే, అహల్యాబాయి హోల్కర్ విగ్రహాలకు కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఎన్సీపీ మాజీ ఎమ్యెల్యే శంకర్ రావు దొండే సహా పలువురికి ముఖ్యమంత్రి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు మారాయి.. ఏలిన వారి తలలు మారాయి.. కానీ ప్రజల బతుకులు మారలేదని సీఎం వ్యాఖ్యానించారు. వీపీ సింగ్, చరణ్ సింగ్, దేవెగౌడ కొందరిని మినహాయిస్తే.. మిగిలిన 54 ఏళ్లు కాంగ్రెస్‌ 14 సంవత్సరాలు, బీజేపీ అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. కానీ రైతుల పరిస్థితి ఎందుకు మారలేదని కేసీఆర్ ప్రశ్నించారు.

మహారాష్ట్రలోనూ అమలు చేస్తే నేను రాను: మహారాష్ట్రకు ఎందుకు వస్తున్నారని దేవేంద్ర ఫడణవీస్‌ అడుగుతున్నారని.. తానొక భారతీయుడిని అని ఎక్కడికైనా వస్తానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలు.. మహారాష్ట్రలోనూ అమలు చేస్తే తాను రానని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా రైతులకు మేలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. తనతో కలిసి పోరాటం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లొస్తాయని పేర్కొన్నారు.

పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇస్తున్న రూ.6,000.. కేవలం బీఆర్ఎస్ భయంతో ఇస్తున్నారని కేసీఆర్ తెలిపారు. కానీ ఈ పథకం కింద రైతులకు కనీసం రూ.10,000 ఇవ్వాలని అన్నారు. అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి దేశంలో ఉందని పేర్కొన్నారు. ఏటా 50,000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని పేర్కొన్నారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయని.. 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉందని కేసీఆర్ వివరించారు.

జీవితాంతం రైతులు పోరాడాల్సిందేనా?: దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటల విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. ఉల్లి, చెరుకు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇది రాజకీయ సభ కాదని.. బతుకులపై ఆలోచన సభ అని స్పష్టం చేశారు. యూపీ, పంజాబ్‌లో నేతల మాయమాటలకు మోసపోయామని కేసీఆర్ పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా: రైతులు మోసపోకూడదనే అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదం ఇస్తున్నానని కేసీఆర్ చెప్పారు. ధర్మం, మతం పేరిట విడిపోతే రైతుల ఆత్మహత్యలు ఆగవని అన్నారు. తాము నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6,000 వేశారని తెలిపారు. బీఆర్ఎస్‌ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా అని పేర్కొన్నారు. పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్‌ చేయించామని వెల్లడించారు.

మహారాష్ట్రలో ఎందుకు అమలు కావు?: మహారాష్ట్రలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలని అన్నారు. ఫసల్‌ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను గెలిపించండి.. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని.. తమ ప్రాంతంలో సభ పెట్టాలని కోరుతున్నారని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలుకావడం లేదని కేసీఆర్ ప్రశ్నించారు.

"దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోంది.. దాన్నెవరూ ఆపలేరు. కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడణవీస్‌ అంటున్నారు. తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరెంట్ అందిస్తున్నాం. తెలంగాణలో రైతు బీమా ఇస్తున్నాం.. పూర్తిగా పంట కొంటున్నాం. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడణవీస్‌ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నా. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకూ నేను వస్తూనే ఉంటా." -కేసీఆర్, సీఎం

ఇవీ చదవండి: టీవోడీ ఛార్జీల పేరిట మోయలేని భారం వేస్తే చూస్తూ ఊరుకోం: జగదీశ్‌రెడ్డి

రాహుల్​ కోసం కాంగ్రెస్ సత్యాగ్రహం.. ఎన్ని కుట్రలు చేసినా పోరాటం ఆగదన్న ఖర్గే

Last Updated :Mar 26, 2023, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.