ETV Bharat / state

మరో 550 ఎలక్ట్రిక్​ బస్సులకు ఆర్డరిచ్చిన ఆర్టీసీ.. త్వరలోనే రయ్​.. రయ్​..!

author img

By

Published : Mar 7, 2023, 10:04 AM IST

TSRTC Ordered 550 Electric buses: రాష్ట్రంలో ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు పాటుపడుతోన్న టీఎస్​ఆర్టీసీ మరో శుభవార్తను అందించింది. ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే 550 ఎలక్ట్రిక్​ బస్సులను ఆర్డర్​ ఇచ్చినట్టు ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ తెలిపారు.

Electric buses will be available in Telangana
తెలంగాణలో ఎలక్ట్రిక్​ బస్సులు అందుబాటులోకి రానున్నాయి

TSRTC Ordered 550 Electric buses: టీఎస్​ఆర్టీసీకి త్వరలో భారీగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. పర్యావరణ పరిరక్షణ దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ ఒలెక్ట్రా గ్రీన్​టెక్​ లిమిటెడ్​కు 550 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్ ఇచ్చింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సులను టీఎస్ఆర్టీసీకి సరఫరా చేస్తుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఆర్టీసీ మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని నిర్ణయించిందని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ పేర్కొన్నారు.

విడతల వారీగా అందుబాటులోకి: వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నామని ఆయన అన్నారు. మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మొదటి దశలో 550 ఈ-బస్సులను కొనుగోలు చేస్తున్నామని, ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. టీఎస్ఆర్టీసీ నుంచి 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ వచ్చిందని, ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ తెలిపారు.

కాలుష్యం తగ్గించి సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి: వీటిలో స్టాండర్డ్ ఫ్లోర్ 12 మీటర్లున్న 500 ఇంట్రాసిటీ బస్సులు, 50 ఇంటర్సిటీ కోచ్ ఈ-బస్సులున్నాయన్నారు. ఈ బస్సులను త్వరలో దశల వారీగా పంపిణీ చేస్తామన్నారు. ఈ బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదని ఓజీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ వెల్లడించారు. ఎయిర్ కండీషన్డ్ ఇంటర్​సిటీ కోచ్ ఎలక్ట్రిక్ బస్సులు మహా నగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య తిరుగుతాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

ఏ ఏ డిపోల్లో ఏర్పాటు చేయనున్నారంటే: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరగనున్నాయి. వీటిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225పైగా కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల విస్తరణ, నిర్వహణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్టీసీ జంట నగరాల్లో ఐదు డిపోలను నిర్ణయించింది. దిల్​సుఖ్​నగర్​, హయత్​నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలో డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్​ఆర్టీసీ తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.