ETV Bharat / state

ఎండిపోతున్న 'డ్రై' ఫ్రూట్​ వ్యాపారం

author img

By

Published : May 17, 2020, 4:29 PM IST

Updated : May 17, 2020, 4:46 PM IST

నోరూరించే మధురమైన రుచి, హై ప్రోటీన్ విలువ, ఎక్కువ కాలం నిల్వ ఉండే ఎండు ఫలాల వ్యాపారంపై కరోనా ప్రభావం భారీగా పడింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మాంద్యం పరిస్థితులు తలెత్తాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం వల్ల.. డ్రై ఫ్రూట్స్​ వ్యాపారం కోలుకోవటానికి ఇంకో సంవత్సరం పట్టొచ్చని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నారు. మిగతా రంగాలను ఆదుకున్నట్టు.. తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

అంతంతమాత్రంగా 'ఎండు' ఫలాల వ్యాపారం
అంతంతమాత్రంగా 'ఎండు' ఫలాల వ్యాపారం

హైదరాబాద్ పాతబస్తీ ఎండుఫలాల వ్యాపారానికి చాలా ప్రసిద్ధి. అమెరికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇజ్రాయిల్, ఇరాన్, ఇరాక్ వంటి మధ్యప్రాచ్య దేశాల నుంచి ఎండు ఫలాలు నగరానికి దిగుమతి చేసుకుంటారు. జంటనగరాల్లోని చార్మినార్, బేగంబజార్, సుల్తాన్ బజార్, కిషన్ బాగ్, మెహదీపట్నం, బంజారాహిల్స్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఎండుఫలాల వ్యాపారం జోరుగా సాగేది. ముఖ్యంగా రంజాన్ మాసంలో ఈ వ్యాపారం రెట్టింపయ్యేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలేదని.. వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

రంజాన్​ మాసంతో ఊరట:

కరోనా ప్రభావంతో దేశవ్యాప్త లాక్ డౌన్​తో ప్రజలు ఎక్కువగా బయటకు రాకపోవటం, వారి ఆదాయం, కొనుగోలుశక్తి పడిపోవటం జరిగింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో పెద్దగా డిమాండ్ ఉండే హలీం తయారీలోనూ ఎండుఫలాలను విరివిగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దేశీయ, అంతర్జాతీయ ఆర్డర్లు సైతం రద్దవటమే కాకుండా.. విదేశాల నుంచి సరకు దిగుమతులపైనా ప్రభావం పడిందని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కాస్త ఊరటనిస్తున్నా.. పూర్తిస్థాయి వ్యాపారం జరిగేందుకు సమయం పడుతుందని వ్యాపారులంటున్నారు.

"రంజాన్​ మాసంలో ఎప్పుడు బాగానే నడుస్తుంది. ధరలు గతేడాది కన్నా తక్కువగానే ఉన్నాయి. ఈ కరోనా, లాక్​డౌన్​ వల్ల ఆదాయం తక్కువైంది. రంజాన్​ తర్వాత ఇంకా తగ్గిపోతది. అందరం కొంచెం గుబులుపడుతున్నాం. పైసల ఇబ్బంది ఉంది."

-డ్రై ఫ్రూట్​ వ్యాపారి

అత్యవసరం కాదు కనుక..

ప్రస్తుత సంక్షోభ సమయంలో కొవిడ్ బాధితుల డైట్​లో ఎండుఫలాల వినియోగం, రంజాన్ కొనుగోళ్లు వ్యాపారానికి ఊతమిస్తున్నాయని.. ఆ తర్వాత మళ్లీ మందగించొచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ ట్రేడింగ్​లో పదిశాతానికి మించి ఎండఫలాల డెలివరీలు జరగట్లేదని తెలిపారు. పన్నుల్లో రాయితీలు, స్వల్పకాలిక రుణాలను అందించి పరిశ్రమకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

Last Updated : May 17, 2020, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.