ETV Bharat / state

Neem Tree Drying: తెలుగు రాష్ట్రాల్లో ఎండిపోతున్న వేపచెట్లు... రక్షించుకుందామిలా..!!

author img

By

Published : Mar 10, 2022, 9:14 AM IST

Neem Tree Drying: వేపను ఆరోగ్య సంజీవనిగా భావిస్తారు. వ్యవసాయంలో చీడపీడలు, తెగుళ్లను సమర్థంగా  అరికడుతుంది. బహుళ ప్రయోజనాల గనిగా అనాది నుంచి ఔషధాల తయారీలో వేపది పెద్దన్నపాత్ర. అమ్మ లాంటి ఈ వేప వృక్షాలే ఇప్పుడు తెగుళ్ల బారిన పడ్డాయి. ఉగాదికి కొద్ది రోజులే ఉన్నా... కనీసం పూత రాకపోవడంతో షడ్రుచుల్లో చేదులేని ఏడాదిగా మిగిలిపోనుంది. సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రీయత జోడించి సామూహికంగా చర్యలు చేపడితే ఫలితం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Neem Tree Drying:
Neem Tree Drying:

తెలుగు రాష్ట్రాల్లో ఎండిపోతున్న వేపచెట్లు

Neem Tree Drying: ప్రకృతి, పచ్చదనం, పర్యావరణానికి అత్యంత మేలుచేయడంలో వేపచెట్టుది కీలకపాత్ర. వ్యవసాయం, ఆయుర్వేదంలో అత్యంత ప్రాధాన్యత గల వృక్షం వేప. వేరు, కాండం, ఆకులు, కొమ్మలు, బెరడు మెుదలుకొని అన్నింట్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాల నివారణకు ఉపయోగపడతాయి. కీటకనాశినిగా సేంద్రియ ఎరువుగా గుర్తింపు పొందింది. ఇండియన్‌ హెర్బల్‌ డాక్టర్‌గా పేరుగాంచిన వేపను 21శతాబ్ధపు చెట్టుగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అంతటి విశిష్ఠమైన వేపకు ఇప్పుడు ఆపద వచ్చింది. పచ్చని ఆకులతో కళకళలాడే చెట్లు నీర్జివంగా మారి నిలువునా ఎండిపోయాయి.

ఒక ఫంగల్ జీవి వల్ల... చెట్లు ఇలా ఎండి పోతున్నాయి. డెహ్రడూన్ నుంచి.. ఈ ఫంగల్ వచ్చింది. దీన్ని మనం నివారించడానికి అదే వేప మీద.. అంబలి, కలి, పులిసిన మజ్జిగ వంటివి.. వేప చేట్లపై స్ప్రై చేయగలిగితే... ఈ ఫంగల్​ను నివారించవచ్చు..

డాక్టర్ శ్రీనివాస్‌, ఆయుర్వేద వైద్యులు

సహజసిద్ధమైన మందులతో...

వేపచెట్లు ఆరేడు మాసాలుగా డై బ్యాక్ డిసీజ్‌, టీ మస్కిటోబగ్‌ తెగుళ్లు సోకి పూర్తిగా ఎండిపోతున్నాయి. మళ్లీ ఆ వృక్షాల్లో కొత్త చిగురు రావడం లేదు. 1997లోనే తెగుళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో పెద్దగా కనిపించకపోయినా గతేడాది నుంచి ఉద్ధృతి కనిపిస్తోంది. సహజసిద్ధమైన మందులతో తెగుళ్లను అరికట్టవచ్చని చెబుతున్నారు.

షడ్రుచుల్లో చేదును కోల్పోయినట్లేనా!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వేపచెట్లు ఎక్కువగా ఎండిపోతున్నాయి. రహదారికి ఇరువైపులా...పొలం గట్లపై ఎక్కడపడితే అక్కడ నీడనిచ్చే చెట్లు ఉన్నట్టుండి మోడుబారిపోతున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఒకదాని నుంచి మరొకదానికి సోకి నిర్వీర్యమవుతున్నాయి. కనీసం పూత కూడా పూయని స్థితికి వచ్చాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ ఉగాది షడ్రుచుల్లో చేదును కోల్పోయినట్లేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ఈ ఉగాదికి వేప పూవ్వు అరకోరే అని చెప్పవచ్చు... కొన్ని చోట్ల కనీసం పూత కూడా పూయని స్థితికి వచ్చాయి. వాతావరణ మార్పుల వల్ల వచ్చిన తెగుళ్లు... వేప ఒక్కటే కాదు... మామిడి, జామకు కూడా వచ్చాయి.

డాక్టర్ గాలి ఉమాదేవి, పీజేటీఎస్‌ఎయూ

వ్యాధి నిర్ధారణ శాస్త్ర విభాగం అధిపతి

సామూహికంగా చర్యలు

భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరందక ఎండిపోతున్నాయని తొలుత భావించినా...లక్షణాలు శాస్త్రీయంగా పరిశీలిస్తే డైబాక్‌ ఫంగల్‌ డిసీజ్‌గా శాస్త్రవేత్తలు నిర్ధరించారు. అధిక వర్షాలు పడిన తర్వాత కూడా తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నివారణ కోసం వేప చెట్టు కాండం చుట్టు తవ్వి ఎఫ్‌ఐఎం, ట్రైకోటెర్మా ఎరువు చల్లాలని శాస్త్రవేత్తలు సిఫారసు చేసినా ఫలితం లేదు. ఈ తెగులు నివారణ ఇప్పట్లో సాధ్యం కాదని.... దీర్ఘకాలంలో అదుపులోకి వస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ పద్ధతులతో పాటు శాస్త్రీయత జోడించి సామూహికంగా చర్యలు చేపడితే ఫలితం ఉండొచ్చని పేర్కొంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వేప వృక్షాలు ఎండిపోతుండటంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రోగ నిర్ధారణ విభాగం శాస్త్రవేత్తలు పరిశోధన వేగవంతం చేశారు. తెగుళ్ల నివారణకు ఏం చేయాలన్న అంశంపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.