ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఆర్థిక అంచనాల్లో సవరణలు అనివార్యం

author img

By

Published : Nov 7, 2020, 2:33 PM IST

Updated : Nov 7, 2020, 8:49 PM IST

అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​
అందుకనుగుణంగా ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలి: కేసీఆర్​

14:32 November 07

కరోనా ఎఫెక్ట్: ఆర్థిక అంచనాల్లో సవరణలు అనివార్యం

కరోనా ప్రభావంతో రాష్ట్రానికి రూ. 52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున అందుకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్​లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్​పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు.  

  పరిస్థితిని వివరించిన ఆర్థికశాఖ అధికారులు.. ప్రస్తుత ఆర్థికసంవతర్సంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా రూ. 52,750 కోట్లు తగ్గనుందని వెల్లడించారు. పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా అక్టోబర్ వరకు 33,704 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని.. వృద్ధి రేటు అంచనా 15 శాతం పెరగకపోగా.. గతంలో కంటే తగ్గిందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ. 67,608 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయని, కేవలం 33,704 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరే అవకాశాలున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ. 33,904 కోట్ల మేర తగ్గనుందని అధికారులు వివరించారు.  

  కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 16,727 కోట్లను చెల్లిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నారని తెలిపారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల్లో వాటా కింద కేంద్రం నుంచి రూ. 8,363 కోట్లు రావాల్సి ఉండగా.. కేవలం రూ. 6,339 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. పన్నుల్లో వాటా ఇప్పటికే 2,025 కోట్లు తగ్గాయని.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 16,727 కోట్లకు గాను కేవలం 11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా పన్నుల్లో వాటా 4,829 కోట్ల రూపాయల కోత తప్పదని వెల్లడించారు.  

  కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 9,725 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. అక్టోబర్ నెల వరకు రూ. 5,673 కోట్లు రావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం రూ. 4,592 కోట్లు మాత్రమే వచ్చినట్లు వివరించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 9,725 కోట్ల రూపాయలకు గాను, 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. అక్టోబర్ వరకే రావాల్సిన నిధుల్లో 1,081 కోట్లు కోత పడగా చివరి వరకు కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ. 802 కోట్లు కోత పడే అవకాశం ఉందని తెలిపారు. ఆదాయంలో భారీ తగ్గుదల నేపథ్యంలో బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని ఆర్థికశాఖ అధికారులు ప్రభుత్వానికి సూచించారు.  

ఇదీ చదవండి: వ్యర్థాల నుంచి సంపద సృష్టిలో హైదరాబాద్ ఆదర్శం: కేటీఆర్

Last Updated : Nov 7, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.