ETV Bharat / state

CM KCR fire on BJP: కేంద్రం వైఖరిపై ఈ నెల 20న నిరసనలు.. గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ

author img

By

Published : Dec 18, 2021, 4:30 AM IST

CM KCR fire on BJP: ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం వైఖరిపై ఈ నెల 20న నిరసనలు చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఊరూరా చావు డప్పు మోగిస్తామని తెలిపారు. ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని, కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో యథాతథంగా రైతుబంధు.. దశలవారీగా దళితబంధు అమలు చేస్తామన్నారు. హైదరాబాద్​లో జరిగిన తెరాస ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

CM KCR fire on BJP
కేంద్రం వైఖరిపై ఈ నెల 20న నిరసనలు

CM KCR fire on BJP: తెలంగాణకు అన్నింటా అన్యాయం చేస్తున్న భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఇకపై ప్రత్యక్షపోరాటం చేస్తామని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. ఆ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని, కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్ర వైఖరికి నిరసనగా ఈ నెల 20న తెరాస తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు.

అన్ని జిల్లాల్లో ఆందోళనలు

protests in districts: అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో గ్రామ స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భాజపా, కేంద్రం దిష్టి బొమ్మలు దహనం చేయాలని, చావు డప్పులు మోగించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు కోటి సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. కేంద్రం దిగొచ్చే వరకు వివిధ రకాల్లో నిరసనలు కొనసాగుతాయన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని, శనివారం దిల్లికి బయల్దేరి వెళ్లాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రిని కలిసి నిలదీయాలని, కేంద్ర మంత్రులు సమయం ఇవ్వకపోతే అక్కడే కూర్చుని తేల్చుకొని రావాలని సూచించారు. తాను కూడా 19, 20 తేదీల్లో జిల్లాల పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపారు. రైతువేదికల్లో సమావేశాలు పెట్టి,. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటంలేదన్న విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. వరికి బదులుగా ఇతర పంటలు వేసేలా చైతన్యం తేవాలన్నారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో తెరాస విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ధాన్యం కొనుగోళ్లు, గనుల ప్రైవేటీకరణ, ఇతర అంశాలపై చర్చించారు. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు జిల్లా కమిటీల సభ్యులు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేంద్రంపై నిప్పులు చెరిగారు.

రైతాంగం సమస్యలపై కేంద్రం పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. ప్రధానికి రైతులపై పట్టింపు లేదు. అన్నదాతలను ఇబ్బందుల పాలు చేస్తున్న భాజపాకు వారి ఉసురు తగులుతుంది. ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదు. దళితబంధు పథకం గురించి కొందరు అబద్ధాలు చెబుతున్నారు. చాలా గొప్పదైన ఈ పథకాన్ని దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో మొదట వందమందికి సాయం అందిస్తాం. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే. దీనిపై ఉత్తర్వులిస్తాం. దళితబంధు తర్వాత గిరిజన, బీసీ, మైనారిటీ, ఈబీసీబంధు పథకాలు సైతం చేపడతాం. దళితబంధుపై విపక్షాల ప్రచారాన్ని తెరాస నేతలు, కార్యకర్తలు తిప్పికొట్టాలి. నేను జీవించి ఉన్నంతవరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అమలు చేస్తాం. దానిపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు.

- సీఎం కేసీఆర్‌

ఏడేళ్లలో ఏదీ అభివృద్ధి?

KCR on Modi: నరేంద్రమోదీ నాయకత్వంలోని ఏడేళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశంలోని ఏ రంగం కూడా బలపడింది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఏ పథకంలోనూ కేంద్ర ప్రభుత్వానిది అణా పైసా లేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని, పూర్తిగా రాష్ట్ర నిధులతో నిర్మించుకున్న ప్రాజెక్టు అని కేంద్రమంత్రే పార్లమెంటులో వెల్లడించారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది. ఏడేళ్లుగా అన్నదాతలకు ఏ కష్టం రాకుండా కాపాడుకుంటున్నాం. ఇప్పుడు కేంద్రం నిర్ణయం వల్ల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం సేకరణపై కేంద్రం ఇచ్చిన లక్ష్యం ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా ఉంది. ఇంకా సగం పంట కల్లాలు, పొలాల్లోనే ఉంది. మిగతా ధాన్యాన్ని ఏం చేయాలని కేంద్రాన్ని ప్రశ్నిస్తాం. పచ్చిబియ్యం ఎన్నైనా కొంటామన్న కేంద్రం.. ఇప్పుడు ఎందుకు కొనట్లేదు? మరోవైపు గోదాములు, వ్యాగన్లు ఖాళీ లేవంటూ ఎఫ్‌సీఐ బియ్యం తరలించట్లేదు. రాష్ట్రంలో 65 లక్షల హెక్టార్లలో పంట దిగుబడి వచ్చింది. కేంద్రం ఈసారి వానాకాలంలో ధాన్యం కొనుగోలు కోటాను భారీగా తగ్గించింది. దీనిపై మరోసారి కేంద్రాన్ని మరోసారి నిలదీస్తాం. శనివారం తెరాస ఎంపీలతో కలిసి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌లతో కూడిన బృందం దిల్లీకి వెళ్తుంది. ఇప్పటికే పార్లమెంట్‌ లోపలా.. బయటా తెరాస ఎంపీలు వీరోచితంగా, చిత్తశుద్ధితో పోరాడారు. వారిపట్ల కేంద్ర ప్రభుత్వం అమానుషంగా, అమర్యాదకరంగా మాట్లాడింది. వరివేస్తే దళితబంధు పెట్టుబడి ఇవ్వరని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మిల్లర్లతో ఒప్పందం చేసుకున్న రైతులే వరి వేస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఇతర పంటలు ఎక్కువగా వేస్తున్నారు.

ఎమ్మెల్యేలను మార్చే పరిస్థితి తేవద్దు.. ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం కావాలి

ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నాయని ఎమ్మెల్యేలు ఏమరుపాటుగా ఉండొద్దు. కొన్ని నియోజకవర్గాల్లో మౌనంగా ఉంటున్నారు. దాంతో మీకే నష్టం. మరింత చురుకుగా పనిచేయాలి. నిత్యం ప్రజల్లో ఉండాలి. వారి సమస్యలు తీర్చాలి. ప్రభుత్వ పథకాలు వివరించాలి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. మీరు ప్రజల్లో లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. వచ్చే ఎన్నికల్లోనూ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. గత ఎన్నికల సమయంలో వైఖరి మారని కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలను మార్చాను. మీరంతా బాగుంటే మార్చే పరిస్థితి ఉండదు. పార్టీలో నాయకులకు ఓపిక ఉండాలి. పార్టీ కోసం కష్టపడ్డవారికి పదవులు వస్తాయి. తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఉద్యమం నుంచి పార్టీకి పూర్తిస్థాయిలో సేవలందించారు. మధుసూదనాచారి నా వెంటే ఉన్నారు. ఎంసీ కోటిరెడ్డి ఓపికతో ఉన్నారు. అందువల్ల వారికి ఎమ్మెల్సీ పదవులు వచ్చాయి.

మంత్రులు విమర్శలను తిప్పికొట్టాలి

కేంద్రం వైఖరి, విపక్షాల విమర్శలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డిలు మినహా ఇతరులు స్పందించడం లేదు. అందరూ కలిసి భాజపా, కాంగ్రెస్‌లను తిప్పికొట్టాలి. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ ఛైర్మన్ల సేవలను వినియోగించుకోవాలి. బలమైన వాదనలు వినిపించాలి. మంత్రులు తమ సమావేశాలకు ఛైర్మన్లను పిలవాలి.

వారం రోజుల్లో తెరాస రాష్ట్ర కమిటీ ప్రకటన

తెరాసను మరింత బలోపేతం చేస్తాం. పనిచేసే వారితో వారం రోజుల్లో కొత్త రాష్ట్ర కమిటీని ప్రకటిస్తాం.ఇప్పటికే నియమిత పదవుల్లో అనుభవజ్ఞులతో పాటు యువతకు పెద్దపీట వేశాం. పార్టీ కొత్త కమిటీ అలానే ఉంటుంది. జిల్లా కమిటీలకు అధ్యక్షులను నియమించాలా? లేక కన్వీనర్లనా అనేది నిర్ణయం తీసుకోవలసి ఉంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పనిచేయాలి. తమిళనాడు పర్యటనలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో పార్టీ పటిష్ఠ కార్యాచరణ గురించి చర్చించాం. త్వరలో ఆ రాష్ట్రానికి ప్రతినిధుల బృందాన్ని పంపిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.