ETV Bharat / state

'సెల్‌ఫోన్‌నే ఆయుధంగా మార్చండి... జగన్‌ వైఫల్యాలు, అక్రమాలను అందరికీ చెప్పండి'

author img

By

Published : Nov 18, 2022, 9:14 AM IST

Chandrababu is visit to Kurnool: సెల్‌ఫోన్‌ అనే ఆయుధంతో జగన్‌ ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను అందరికీ చెప్పాలని.. ప్రజలకు తెదేపా అధినేత సెల్‌ఫోన్‌ అనే ఆయుధమిచ్చారు. ఇందుకు అందరూ బాధ్యత తీసుకోవాలన్న ఆయన.. ఇది ప్రజాస్వామ్య పోరాటానికి నాంది కావాలన్నారు. సీఎం జగన్‌ రాయలసీమ ద్రోహి అని నిప్పులు చెరిగిన చంద్రబాబు.. వైకాపా గూండాలతో తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అరాచకాలు ఆపకపోతే ప్రజలే జగన్‌ను తరిమికొడతారన్న చంద్రబాబు.. అందుకు తాను బాధ్యుడిని కాదని స్పష్టంచేశారు.

Chandrababu is visit to Kurnool
Chandrababu is visit to Kurnool

మీ సెల్​ఫోనే మీ ఆయుధం:ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu is visit to Kurnool: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండో రోజు ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభలకు భారీ స్పందన వచ్చింది. ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో పత్తి రైతులతో మాట్లాడి, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో చేనేత కార్మికుడి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదని కార్మికుడు చెప్పగా, తాను అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ వైకాపా నేతల చేతుల్లోకే వెళ్తున్నాయన్న ఆయన.. రాజధాని పేరుతో విశాఖలో 40వేల కోట్ల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు.

జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరు బుర్రకథలు బాగా చెబుతారని ఎద్దేవా చేసిన చంద్రబాబు.. మరొకరు అక్రమ వ్యాపారాలతో నిత్యం తీరిక లేకుండా ఉంటారంటూ చురకలంటించారు. రాయలసీమకు జగన్‌ తీరని అన్యాయం చేస్తున్నారన్న చంద్రబాబు.. ఈ మూడున్నరేళ్లలో ఏం చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో చంద్రబాబు కాన్వాయ్‌పైకి కొందరు రాళ్లు విసిరారు.

పర్యటనలో తనను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తంచేసిన తెదేపా అధినేత, గూండాలతో రాళ్లు వేయించాలని చూస్తే ఖబర్దార్‌ అని హెచ్చరించారు. అవినీతి జగన్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకళించి వేయాలన్న చంద్రబాబు.. అందుకు సెల్‌ఫోన్‌ అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపిచ్చారు.

రాష్ట్రంతో పాటు యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలన్న చంద్రబాబు.. మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. శుక్రవారం చంద్రబాబు జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.