ETV Bharat / state

Chain Snatchers in Hyderabad: ఆ చైన్​ స్నాచర్స్ వీరే...​ సీసీ కెమెరాల్లో రికార్డ్..

author img

By

Published : Jan 8, 2023, 6:48 AM IST

Chain Snatchings in Hyderabad: హైదరాబాద్‌లో వరస గొలుసు దొంగతనాలతో రెచ్చిపోయిన చోరులను పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను.. ఉత్తరప్రదేశ్‌ శామ్లీ జిల్లాకు చెందిన పింకు, అశోక్‌గా నిర్ధరించారు. వీరిద్దరు హైదరాబాద్‌నే కాకుండా.. అంతకముందే బెంగళూర్‌లోనూ గొలుసు దొంగతనాలకు పాల్పడ్డినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పింకు, అశోక్‌ను పట్టుకోవడానికి 20 బృందాలు గాలిస్తున్నాయి.

chain
చైన్​ దొంగలు అరెస్టు

గొలుసు దొంగలను గుర్తించిన పోలీసులు

Chain Snatchings in Hyderabad: ఏడాది తర్వాత హైదరాబాద్‌లో మరోమారు గొలుసుదొంగలు బరితెగించారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. కేవలం రెండు గంటల్లోనే ఏడు చోట్ల బంగారు గొలుసుల్ని తెంచుకుపోయారు. చోరీలకు పాల్పడిన వారిని ఉత్తరప్రదేశ్‌ శామ్లీ జిల్లాకు చెందిన పింకు, అశోక్‌గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శుక్రవారం బెంగళూరులో 10 గొలుసు చోరీలు చేశారు. శుక్రవారం ఉదయం 7గంటల నుంచి 9 గంటల మధ్య బెంగళూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో 10 చైన్‌ స్నాచింగ్‌లు చేసిన వీరిద్దరూ.. అక్కడి నుంచి తప్పించుకున్నారు.

శుక్రవారం రాత్రి బెంగళూరులో బయల్దేరి శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకున్నారు. నాంపల్లిలో పల్సర్‌ బైక్‌ చోరీ చేశారు. ఉప్పల్‌ రాజునగర్‌ నుంచి మొదలుపెట్టి రాంగోపాల్‌పేట్‌ పరిధిలోని కృష్ణానగర్‌ కాలనీ వరకూ.. వృద్ధ మహిళలే లక్ష్యంగా చోరీలు చేశారు. మొత్తం 21 తులాల బంగారు గొలుసులు దొంగిలించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరి వరంగల్‌ వైపు వెళ్లే రైల్లో పారిపోయినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.

ఒంటరి మహిళలే టార్గెట్​: యూపీ శామ్లీ జిల్లాకు చెందిన పింకు, అశోక్‌ కరుడుగట్టిన దొంగలు. దొంగతనాలకు ఎంచుకున్న ప్రాంతానికి రైలు, విమానమార్గాల్లో చేరుకుంటారు. ద్విచక్రవాహనం చోరీ చేసి.. వరుసగా గొలుసు దొంగతనాలు చేస్తారు. నాలుగైదు గంటల్లోనే మకాం మార్చుతారు. అశోక్‌ బైక్‌ నడుపుతుంటే వెనుక కూర్చున్న పింకు క్షణాల్లో మహిళల మెడల్లో గొలుసులు లాగుతాడు. ఇంటి వద్ద, తోపుడు బండ్ల వద్ద ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.

వీరు వెళ్లే మార్గంలో వృద్ధ మహిళలను గుర్తిస్తే.. వారిని వెంబడించి ఇంట్లోకి చొరబడతారు. చిరునామా అడుగుతున్నట్టు నటించి.. వారు ఏమరపాటులో ఉన్నపుడు గొలుసు లాక్కొని పారిపోవడం వీరి ప్రత్యేకత. 2017లో వీరిద్దరినీ బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. జైలు నుంచి వచ్చాక మళ్లీ అదే చోట వరుస చోరీలతో పోలీసులకు సవాల్‌ విసిరారు. పింకు, అశోక్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్‌ పోలీసులు 20 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. త్వరలోనే వారిని అరెస్ట్‌ చేస్తామని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.