ETV Bharat / state

జూపల్లి, పొంగులేటి.. 'చేతి'కి చిక్కుతారా? కమలం గూటికి చేరుతారా?

author img

By

Published : Apr 13, 2023, 1:29 PM IST

Opposition Parties Focus on Jupalli and Ponguleti: రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ చేరికలపై దృష్టి సారించాయి. అయితే కొంతకాలంగా బీఆర్ఎస్​ పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్, ఈటల రాజేందర్ పొంగులేటితో ఫోన్​లో మాట్లాడినట్లు తెలిసింది. అలాగే బీఆర్ఎస్​ నుంచి సస్పెండ్​ అయిన మరోనేత జూపల్లి కృష్ణారావుతోనూ ప్రతిపక్షాలు సంప్రదింపులు జరుపుతున్నాట్లు సమాచారం. మరి ఈ ఇద్దరు నేతలు చేతికి చిక్కుతారో.. లేక కమలం గూటికి చేరతారో తెలియాల్సి ఉంది.

Opposition Parties Focus on Jupalli and Ponguleti
Opposition Parties Focus on Jupalli and Ponguleti

Opposition Parties Focus on Jupalli and Ponguleti: రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగనున్న నేపథ్యంలోనే చేరికలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఊమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిపై రెండ్రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్​ వేటు వేసింది. అప్పటినుంచి రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు ఆయనతో టచ్​లో ఉన్నట్లు సమాచారం.

పొంగులేటితో కలిసి లోక్​సభ సభ్యులుగా వ్యవహరించిన కొందరు బీజీపీ నేతలు ఈ అంశంలో చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటిని బీజేపీలోకి తీసుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించడంతో పాటు నేరుగా పొంగులేటితో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ మంత్రి, చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ బుధవారం రోజున దిల్లీకి చేరుకున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలతో పొంగులేటి అంశంపై బండి సంజయ్ చర్చించినట్లు సమాచారం. పొంగులేటిని పార్టీలోకి తీసుకువచ్చే అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర ముఖ్యనేతలకు సూచించినట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ ముఖ్యనేత ఒకరు స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాల్లో టాక్. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి చేరితే వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశం ఉంటుందని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.

జూపల్లి కృష్ణారావుతో..: బీఆర్​ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మరో నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోనూ రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో బలమైన నేత కావడంతో ఈ రెండు పార్టీలు జూపల్లి చేరికపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ముఖ్యనేతలు జూపల్లిని కోరినట్లు సమాచారం. ఇదే సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బీజేపీ అగ్రనేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలు కూడా జూపల్లితో ఫోన్‌లో మాట్లాడి బీజేపీలో చేరాలని కోరినట్లు తెలిసింది.

పొంగులేటి, జూపల్లి సమాలోచనలు: రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన అడుగు కావడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇద్దరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే వారు ఇరువురు ఎవరికీ హామీ ఇవ్వకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని.. స్పష్టం చేసినట్లు సమాచారం. కింది స్థాయి నాయకులు, ప్రధాన అనుచరులతో చర్చలు జరిపిన తర్వాతే తమ అభిప్రాయం వెల్లడిస్తామని చెప్పినట్లు తెలిసింది.

గత కొన్ని నెలలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుచరులు, ముఖ్య నాయకులతో సమావేశమవుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్​ను బలంగా ఎదుర్కొనే పార్టీతో పాటు రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడే అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి తర్వాత బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీలో చేరాలనే అంశంపై జూపల్లి సన్నిహితులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.