ETV Bharat / state

జీవో-1పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

author img

By

Published : Jan 17, 2023, 6:10 PM IST

AP Govt petition in Supreme Court: జీవో-1పై హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో నం.1 తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

AP Govt petition in Supreme Court
AP Govt petition in Supreme Court

AP Govt petition in Supreme Court: జీవో-1పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పార్టీల రోడ్‌ షోలు, సభలపై ఆంక్షలు విధిస్తూ తెచ్చిన జీవో నంబరు 1ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా రాజకీయ పార్టీల గొంతు నొక్కడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2న జీవో నం.1 తీసుకొచ్చిందంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘స్వాతంత్య్రోద్యమ సమయంలో ర్యాలీలు, బహిరంగ సమావేశాలను అడ్డుకునేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం 144 సెక్షన్‌ విధించింది తప్ప.. ఇలాంటి ఉత్తర్వులివ్వలేదు. పోలీసు చట్టం సెక్షన్‌ 30, 30(ఎ)ని ఆధారంగా చూపుతూ బహిరంగ సమావేశాలను నిలువరించాలని ప్రభుత్వం చూస్తోంది. జీవోలో నిషేధం అనే పదం వినియోగించకుండా పరోక్షంగా ఆ పని చేసింది. అధికరణ 19(1) భావప్రకటన స్వేచ్ఛను కల్పిస్తోంది. శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమాలకు పోలీసుల అనుమతి అక్కర్లేదు. అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లోనే సమావేశాలకు అనుమతి ఇచ్చే అంశాన్ని పోలీసులు పరిశీలించాలని జీవో నం.1లో పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితులున్నాయని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది?

నిలుపు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి: నచ్చినవారికి అనుమతి ఇచ్చి, నచ్చనివారికి నిరాకరించాలనే ఇలాంటి షరతు పెట్టారు. పోలీసులను సంతృప్తిపరచాలని షరతు పెట్టడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించడమే. రహదారులపై నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, యాత్రల నియంత్రణకే పోలీసు చట్టం సెక్షన్‌ 30(2) పోలీసులకు అధికారం కల్పిస్తోంది. ఆ సెక్షన్‌ను ఆసరాగా చేసుకుని నిషేధం విధిస్తామంటే కుదరదు. రహదారులపై ఊరేగింపు శాంతికి విఘాతం కారణం కావొచ్చనే ఊహాగానాలతో ముందే నిర్ణయానికి వచ్చి అడ్డుకుంటామనడం సరికాదు. పోలీసులకు నియంత్రణ అధికారమే ఉంటుంది. బహిరంగ సమావేశాల నియంత్రణ ముసుగులో ప్రభుత్వం పూర్తి నిషేధం విధిస్తోంది. జీవో అమలును నిలుపు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వండి’ అని కోరారు.

ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘పిల్‌ విచారణార్హతపై అభ్యంతరం ఉంది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ కోసం పిటిషనర్‌ కృత్రిమ కారణాలను సృష్టించారు. పిల్‌పై వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపడానికి వీల్లేదు. పిటిషనర్‌ కోర్టు విచారణను దుర్వినియోగం చేస్తున్నారు. పది రోజుల కిందట ఇచ్చిన జీవో ఇది. ఏ పార్టీలూ అనుమతి కోసం దరఖాస్తులు చేయలేదు, వాటిని పోలీసులు తిరస్కరించలేదు. అపరిపక్వ దశలో పిల్‌ దాఖలుచేశారు’ అన్నారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. పోలీసు చట్టం సెక్షన్‌ 30కి విరుద్ధంగా జీవో నం. 1 ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. జీవో నం.1 అమలును ఈ నెల 23 వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఇవీ చదవండి:

ఖమ్మం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ పూర్తి షెడ్యూల్ ఇదే!

వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.