ETV Bharat / state

పీఆర్‌సీ కోసం 30వేల మంది ఉద్యోగుల ఎదురుచూపులు

author img

By

Published : Aug 23, 2021, 7:03 AM IST

తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లకు వేతన సవరణ అందని ద్రాక్షగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్థల్లో పీఆర్‌సీ అమలుకు అనుమతించినా వాటి పాలకమండళ్లు దానిపై నిర్ణయం తీసుకోవడానికి వెనకాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిలో పనిచేసే 30వేల మంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

30-thousand-psu-employees-waiting-for-prc
పీఆర్‌సీ కోసం 30వేల మంది ఉద్యోగుల ఎదురుచూపులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ పెంపుతో పీఆర్‌సీ అమలుకు గత జూన్‌ పదిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018 ఏప్రిల్‌ నుంచి 2021 ఏప్రిల్‌ వరకు వేతనాలను బకాయిల రూపంలో చెల్లించాలని సర్కారు సూచించింది. అదే పంథాలో పీఆర్‌సీ అమలు చేయమని కార్పొరేషన్లను ఆదేశించింది. నిబంధనల మేరకు పాలకమండళ్లు సమావేశమై పీఆర్‌సీ అమలు కోసం తీర్మానం చేసి ప్రభుత్వామోదానికి పంపించాలి.

పని సమానమే..అయినా

రాష్ట్రంలో ప్రస్తుతం 54 ప్రభుత్వ రంగ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అందులో 18వేల మంది శాశ్వత ఉద్యోగులు, మరో 12వేల మంది ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులున్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావడం లేదు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు సైతం లభించేదీ తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 30 శాతం ఫిట్‌మెంట్‌తో తమకు వేతనాలు పెరుగుతాయని ఉద్యోగులు భావించారు. ప్రభుత్వం కార్పొరేషన్లకు అనుమతి ఇచ్చాక రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ), బేవరేజెస్‌ కార్పొరేషన్‌, పౌరసరఫరాలు, పర్యాటక, ఖనిజాభివృద్ధి, విత్తనాభివృద్ధి సంస్థల పాలకమండళ్లు సమావేశమై తమ సంస్థల్లో పీఆర్‌సీ అమలుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. దానికి ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఇవన్నీ లాభాల బాటలో ఉన్నా పీఆర్‌సీ కోసం నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలు పీఆర్‌సీపై ముందుకు వెళ్లేందుకు సిద్ధం కావడం లేదు. ఆర్థికశాఖ ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, లాభనష్టాలను అంచనా వేస్తున్నట్లు తెలిసింది. దీంతో తమకు పీఆర్‌సీ వర్తింపజేస్తారో లేదోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

ఇప్పటికీ మాకు అరకొర వేతనాలు వస్తున్నాయి. కుటుంబ పోషణ భారంగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. వేతనాలు పెంచితే మాకు న్యాయం జరుగుతుంది. -కె.శ్రీనివాస్‌, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగి

వెంటనే వర్తింపజేయాలి..

జీటీ జీవన్‌, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యదర్శి

'తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వరంగ సంస్థల సిబ్బందీ పనిచేస్తున్నందున వారికి వెంటనే కొత్త పీఆర్‌సీ అమలుచేయాలి. లాభనష్టాలతో పోల్చకుండా దాన్ని వర్తింపజేయాలి. దీనిపై త్వరలో సీఎంను, మంత్రులను కలిసి మా ఆవేదనను తెలియజేస్తాం.'

- జీటీ జీవన్‌, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి: Vaccination: జంటనగరాల్లో నేటి నుంచి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్​​..

suicide: అన్న రాఖీ కట్టించుకోలేదని సోదరి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.