ETV Bharat / state

65 ఏళ్ల కిందటి ఖైరతాబాద్ గణేశ్​.. ఇప్పుడు మళ్లీ 2020లో..

author img

By

Published : May 13, 2020, 5:50 AM IST

ఖైరతాబాద్ మహాగణపతిపై కరోనా మబ్బులు కమ్ముకున్నాయి.. నగరంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది భారీ స్థాయిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్ల కిందటి తరహాలోనే ఒక్క అడుగుతోనే మళ్లీ ఆ గణనాథున్ని ప్రతిష్టించాలని భావిస్తున్నారు.

1954 Khairatabad Ganesh Now again in 2020 maybe chance in hyderabad
65 ఏళ్ల కిందటి ఖైరతాబాద్ గణేశ్​.. ఇప్పుడు మళ్లీ 2020లో

ఆరున్నర దశాబ్దాలుగా భాగ్యనగర చరిత్రలో భక్తజనం మహిమాన్వితంగా కొలుస్తున్న ఖైరతాబాద్ గణేశుడిపై కరోనా వైరస్ ప్రభావం పడింది. కోవిడ్ వల్ల ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని భారీ స్థాయిలో ప్రతిష్టంచలేకపోతున్నామని గణేశ్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమావేశమైన కమిటి తొలుత ఈనెల 18న కర్రపూజ చేయాలని నిర్ణయించారు. లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ గణేశుడి విగ్రహ ప్రతిష్టాపనకు అంకురార్పణ చేయాలని భావించారు. కానీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఉత్సవ సమితి.. కర్రపూజను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

భక్తుల ఆరోగ్యం దృష్ట్యా

విగ్రహా ప్రతిష్ఠాపనకు మూడు నెలల ముందే ఈ పనులు మొదలుపెడతారు. కానీ అవేవీ చేయడం లేదని ప్రకటించారు. అంతేకాకుండా గతేడాది తరహాలో 65 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించబోమని స్పష్టం చేసింది. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని కమిటీ తీసుకున్నట్లు ఉత్సవ సమితి కన్వీనర్ సందీప్ తెలిపారు. 1954 తరహాలోనే ఒక్క అడుగుతో మళ్లీ ఖైరతాబాద్ గణేశుడిని కొలువుదీర్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

1954లో ఒక్క అడుగుతో గణేశుడు

1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో ఖైరతాబాద్​లో ఒక్క అడుగుతో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ ఒక్కో రూపంలో ఖైరతాబాద్ గణేశుడు దర్శనమిస్తున్నాడు. గతేడాది 65 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చాడు. శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో గణేశుడి విగ్రహాన్ని భారీ ఎత్తున తీర్చిదిద్ది.. 11 రోజులపాటు అంగరంగవైభవంగా పూజలు నిర్వహించేవారు. కానీ ఈసారి అవేవీ నిర్వహించకూడదని ఉత్సవ సమితి నిర్ణయించింది. భారీ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో.. వైరస్ వ్యాప్తి జరిగే ప్రమాదం ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు గణేశ్ ఉత్సవ సమితి పేర్కొంది.

మరోవైపు శిల్పి రాజేంద్రన్ నుంచి భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆలయ నిర్మాణం మొదలుపెడతామని, అందులో11 అడుగుల రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ దాకా తీసుకెళ్లి మళ్లీ గుడికే తీసుకోస్తామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఈనెల 18న వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

ఇదీ చూడండి : ఈ ఏడాది ఖైరతాబాద్​ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.