ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఒత్తికి కారణంగా వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, తన నిర్ణయంపై తాజాగా ఈ ఆల్‌రౌండర్ వెనక్కి తగ్గే అవకాశాలు కనపడుతోన్నాయి. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో బెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను ఈ ఫార్మాట్లో తిరిగి ఆడించే ప్రయత్నాలు జరిగాయని అతడు తెలిపాడు.
పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం అద్భుతమైన విషయం. కానీ, ప్రస్తుతం నేను దాని గురించి ఆలోచించడం లేదు. నా దృష్టంతా పాకిస్థాన్‌తో మ్యాచ్ పైనే ఉంది. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ మ్యానేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీ నన్ను సంప్రదించాడు. వన్డేల్లోకి అడుగుపెట్టడంపై నాతో మాట్లాడాడు. అయితే, నేను మాత్రం ఆ మాట వినగానే అక్కడి నుంచి దూరంగా వెళ్లాను’’ అని తెలిపాడు. ఇంగ్లాండ్ 2019 ప్రపంచకప్ గెలవడంలో బెన్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే తన రిటైర్మెంట్ను ప్రకటించిన సందర్భంలో ఈ ఆటగాడు కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఈ నిర్ణయం ఆటగాళ్లు ఒకేసారి అన్ని ఫార్మట్లలో ఆడాలని ఒత్తిడి చేసే వారికి చెంపపెట్టు లాంటిదని అన్నాడు.