ETV Bharat / sports

U19 World Cup Squad: భారత యువ జట్టులో తెలుగుతేజాలు

author img

By

Published : Dec 20, 2021, 9:00 AM IST

U19 World Cup Squad: ఐసీసీ అండర్​-19 ప్రపంచకప్​ జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లకు చోటుదక్కింది. గుంటూరుకు చెందిన షేక్ రషీద్​ను బీసీసీఐ కమిటీ వైస్​కెప్టెన్​గా నియమించగా.. హైదరాబాద్​ ఆల్​రౌండర్​ నిర్వెట్ల రిషిత్‌రెడ్డి స్టాండ్​బై ప్లేయర్​గా ఎంపికయ్యాడు.

u19 world cup
భారత యువ జట్టులో తెలుగుతేజాలు

U19 World Cup Squad: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత యువ జట్టుకు గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ (ఆంధ్ర క్రికెట్‌ సంఘం) వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగనున్న ఈ టోర్నీ కోసం భారత అండర్‌-19 జట్టును బీసీసీఐ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఆదివారం ప్రకటించింది. యశ్‌ ధూల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ నిర్వెట్ల రిషిత్‌రెడ్డి (హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం) స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. 2000, 2008, 2012, 2018లలో భారత యువ జట్టు అండర్‌-19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. 2016, 2020లలో రన్నరప్‌ ట్రోఫీలు అందుకుంది.

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి..

అండర్‌-19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన గుంటూరుకు చెందిన రషీద్‌ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. తల్లిదండ్రులు బలీషా వలీ, జ్యోతిల ప్రోత్సాహంతో క్రికెట్లో ఎదిగిన ఈ బ్యాటర్‌.. మంగళగిరి క్రికెట్‌ అకాడమీలో శిక్షణలో నైపుణ్యాలకు పదును పెట్టుకున్నాడు. 9 ఏళ్లకే ఆంధ్ర అండర్‌-14 జట్టుకు ఆడిన రషీద్‌.. ఆ తర్వాత కెప్టెన్‌ కూడా అయ్యాడు. ప్రస్తుతం అతడు ఆంధ్ర అండర్‌-19 జట్టుకు మూడేళ్లుగా ఆడుతున్నాడు. సచిన్‌ను ఆరాధించే రషీద్‌.. ఈ ఏడాది వినూ మాన్కడ్‌ టోర్నీలో మూడు శతకాలు సాధించి సత్తా చాటాడు. అహ్మదాబాద్‌లో జరిగిన ఛాలెంజర్‌ ట్రోఫీ ఆంధ్ర జట్టు సారథిగా వ్యవహరించాడు. "సచిన్‌ ఆట అంటే చాలా ఇష్టం. భారత యువ జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మా నాన్న ప్రైవేటు ఉద్యోగి కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. నాన్న స్నేహితుడు ఇంద్రసేనారెడ్డి సాయం, మంగళగిరి అకాడమీలో కోచ్‌లు కృష్ణారావు, సీతాపతి, వినోద్‌, జ్ఞానేశ్వర్‌ శిక్షణ వల్ల ఈ స్థాయికి రాగలిగాను" అని రషీద్‌ చెప్పాడు.

u19 world cup
షేక్‌ రషీద్‌ (వైస్‌ కెప్టెన్‌)

అనుకోకుండా అరంగేట్రం

హైదరాబాద్‌ క్రికెట్‌పై తనదైన ముద్ర వేస్తున్న ఆటగాడు రిషిత్‌రెడ్డి. కుడిచేతి వాటం మీడియం పేసర్‌గా ఆకట్టుకుంటూనే.. మంచి బ్యాటింగ్‌ నైపుణ్యంతో అదరగొడుతున్నాడు. నిజానికి రిషిత్‌ భారత యువ జట్టు అరంగేట్రం అనుకోకుండా జరిగింది. అండర్‌-19 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా ఇటీవల ఇండియా-ఎ, ఇండియా-బి, బంగ్లాదేశ్‌ యువ జట్లతో ముక్కోణపు వన్డే సిరీస్‌ నిర్వహించారు. ఈ రెండు జట్లలో రిషిత్‌కు చోటు దక్కలేదు. దీంతో కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ తరఫున రిషిత్‌ బరిలో దిగాడు. త్రిపురతో మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే రిషిత్‌కు సెలెక్షన్‌ కమిటీ నుంచి పిలుపొచ్చింది. గాయపడిన ఆటగాడి స్థానంలో రిషిత్‌ను ఇండియా-బి జట్టుకు ఎంపిక చేశారు. చివరి మ్యాచ్‌లో రిషిత్‌కు ఆడే అవకాశం లభించగా.. బంగ్లాదేశ్‌పై అతను అయిదు వికెట్ల (5/53)తో మెరిశాడు. అంతే.. ఒక్కసారి అందరిని దృష్టిని ఆకర్షించాడు. దుబాయ్‌లో జరిగే అండర్‌-19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత యువ జట్టులో 18 ఏళ్ల రిషిత్‌ చోటు దక్కించుకున్నాడు. హైదరాబాద్‌ అండర్‌-14, అండర్‌-16, అండర్‌-19 జట్ల తరఫున రిషిత్‌ నిలకడగా రాణించిన రిషిత్‌కు సరైన సమయంలో అవకాశం లభించింది.

u19 world cup
రిషిత్‌రెడ్డి (స్టాండ్​బై ఆటగాడు)

భారత అండర్‌-19 జట్టు: యశ్‌ ధూల్‌ (కెప్టెన్‌- దిల్లీ), హర్‌నూర్‌సింగ్‌ (చండీగఢ్‌), ఆంగ్‌క్రిష్‌ రఘువంశీ (ముంబయి), షేక్‌ రషీద్‌ (వైస్‌ కెప్టెన్‌- ఆంధ్ర), నిశాంత్‌ సింధు (హరియాణా), సిద్ధార్థ్‌ యాదవ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), అనీశ్వర్‌ గౌతమ్‌ (కర్ణాటక), దినేశ్‌ బానా (వికెట్‌ కీపర్‌- హరియాణా), ఆరాధ్య యాదవ్‌ (వికెట్‌ కీపర్‌- ఉత్తర్‌ప్రదేశ్‌), రాజ్‌ అంగద్‌ బావా (చండీగఢ్‌), మానవ్‌ పారఖ్‌ (తమిళనాడు), కౌశల్‌ తంబె (మహారాష్ట్ర), ఆర్‌.ఎస్‌.హంగార్గేకర్‌ (మహారాష్ట్ర), వాసు వత్స్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), విక్కీ ఓస్త్‌వల్‌ (మహారాష్ట్ర), రవికుమార్‌ (బంగాల్‌), గర్వ్‌ సాంగ్వాన్‌ (హరియాణా)

స్టాండ్‌బై: రిషిత్‌రెడ్డి (హైదరాబాద్‌), ఉదయ్‌ సహరణ్‌ (పంజాబ్‌), అంష్‌ గోసాయ్‌ (సౌరాష్ట్ర), అమృత్‌ రాజ్‌ ఉపాధ్యాయ్‌ (బంగాల్‌), పి.ఎం.సింగ్‌ రాఠోడ్‌ (రాజస్థాన్‌)

ఇదీ చూడండి : హాకీ టోర్నీలో జపాన్​ను చిత్తుగా ఓడించిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.