ETV Bharat / sports

2021లో టీమ్‌ఇండియాను ఆదుకున్నది ఈ ఇద్దరే!

author img

By

Published : Dec 31, 2021, 5:33 PM IST

Team India: టెస్టుల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేసింది టీమ్​ఇండియా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్​పై ఘన విజయాలు సాధించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలోనూ అదరగొడుతోంది. అయితే 2021 మొత్తంలో టీమ్​ఇండియాను విజయ తీరాలకు చేర్చడంలో ఇద్దరు క్రికెటర్లు క్రియాశీలక పాత్ర పోషించారు. వారు ఎవరంటే?

ravichandran ashwin
Rohit sharma

Team India: టెస్టుల్లో టీమ్‌ఇండియా ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మినహా దాదాపు అన్ని సిరీస్‌లు గెలుపొందింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో చారిత్రక బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ సాధించడం, ఆపై స్వదేశంలో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించడం మర్చిపోలేని అనుభూతులు. అలాగే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ను దాని సొంత గడ్డపైనే 2-1 తేడాతో ఓడించడం కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇక ఇటీవల టీ20 ప్రపంచకప్‌ అనంతరం భారత్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను సైతం కోహ్లీసేన కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనలో తొలి టెస్టులోనే ఆకట్టుకుంది. దీంతో 2021కి ఘనంగా వీడ్కోలు పలికింది.

Rohit sharma
రోహిత్‌ శర్మ

అయితే, ఈ విజయాల్లో ఇద్దరు క్రికెటర్లు కీలక పాత్ర పోషించారు. అందులో ఒకరు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ కాగా, మరొకరు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. రోహిత్‌ ఈ ఏడాది మొత్తం 11 టెస్టులు ఆడి 906 పరుగులు చేశాడు. అందులో రెండు 2 శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ఆ రెండు శతకాల్లో ఒకటి చెన్నైలో జరిగిన రెండో టెస్టులో 161 పరుగులు కాగా, రెండోది ఓవల్‌లో జరిగిన టెస్టులో 127 పరుగులు చేశాడు.

ఇక అశ్విన్‌ ఈ ఏడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో ఒక్క టెస్టూ ఆడకపోయినా టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు (54) తీశాడు. అశ్విన్‌ ఆడింది 9 టెస్టులే కావడం మరో విశేషం. దీంతో వీరిద్దరూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇకముందు కూడా ఇలాగే రాణిస్తూ మరింత మెరవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ravichandran ashwin
అశ్విన్‌

అక్కడా గుర్తింపు..

ఇక శుక్రవారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన 'ఎలెవెన్​ ఆఫ్ ది ఇయర్'​లోనూ భారత్​ నుంచి వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్​ స్పిన్నర్​ అశ్విన్​కు​ చోటుదక్కింది. వారితో పాటు రిషభ్​ పంత్, అక్షర్​ పటేల్​కూ స్థానం లభించింది. ఈ ఏడాది టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన క్రికెటర్లతో ఈ జట్టును రూపొందించింది క్రికెట్​ ఆస్ట్రేలియా.

ఇదీ క్రికెట్​ ఆస్ట్రేలియా టెస్టు జట్టు (2021): రోహిత్ శర్మ, దిముత్ కరుణరత్నె, మార్నస్ లబూషేన్, జో రూట్, ఫావద్​ అలాం, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవి అశ్విన్, కైలీ జేమిసన్, అక్షర్ పటేల్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిది

ఇదీ చూడండి: 'ద్రవిడ్​లా కనిపిస్తున్నాడు.. టీమ్​ఇండియా తర్వాతి కెప్టెన్ అతడే​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.