ETV Bharat / sports

ముంబయి టీమ్​లో సగం మంది వాళ్లే.. మ్యాజిక్ రిపీట్​ చేస్తారా?

author img

By

Published : Mar 15, 2022, 3:22 PM IST

Mumbai Indians Team 2022: ముంబయి ఇండియన్స్ జట్టు అనగానే మనకు రోహిత్ శర్మ, ఐదుసార్లు కప్పు కొట్టిన టీం, కీరన్ పొలార్డ్.. వంటివి గుర్తొస్తాయి. గతేడాది లీగ్ దశకే పరిమితమైన ఈ జట్టు ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి. కీలక ఆటగాళ్లు జట్టులోనే ఉండటం ముంబైకి కలిసొచ్చే అంశం.

mumbai indians team 2022
ముంబయి టీమ్​లో సగం మంది వాళ్లే

Mumbai Indians Team 2022: ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ముంబయి ఇండియన్స్‌ అనడంలో సందేహమే లేదు. ఈ జట్టు పేరు వినగానే మనకు కెప్టెన్​ రోహిత్​ శర్మ, విండీస్​ విధ్వంసకర ఆటగాడు కీరన్​ పొలార్డ్​, భారత స్టార్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా, యువఆటగాడు సూర్యకుమార్​ యాదవ్​ గుర్తొస్తారు. అయితే గతేడాది లీగ్ దశకే పరిమితమైంది ముంబయి. మరి ఈ సారి తనదైన ఆట ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.

ఐపీఎల్​లో జట్లు ఎన్ని ఉన్నా.. కొత్త జట్లు ఎన్ని వచ్చినా చాలాసార్లు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌ కింగ్స్ మధ్యే ప్రధాన పోటీ నెలకొంటోంది. 2018 నుంచి పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనేలా ఉన్నాయి గణాంకాలు. గత నాలుగు సీజన్లలో రెండేసి సార్లు ముంబయి (2019,2020), చెన్నై (2018,2021) టైటిల్స్‌ నెగ్గాయి. ఐపీఎల్ 2022 సీజన్‌కు వచ్చేసరికి ముంబయి జట్టులో మార్పులు చోటు చేసుకున్నా.. కీలక ఆటగాళ్లు ఉండటం, ఐపీఎల్‌ పోటీలు జరిగేది ముంబయి, పుణెలోనే కావడం కలిసొచ్చే అంశమే.

జట్టులో కీలక ప్లేయర్లు వీరే..

Mumbai Indians Key Players: ముంబయి ఇండియన్స్‌ అనగానే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు. కీరన్‌ పొలార్డ్, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఇతర కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను భారీ ధరకు దక్కించుకుంది జట్టు యాజమాన్యం. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్‌దేవ్‌ ఉనద్కత్ ఉన్నారు. బ్యాటింగ్‌పరంగా చూసుకుంటే.. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్‌, టిమ్‌ డేవిడ్, కీరన్‌ పొలార్డ్, ఫాబియన్‌ అలెన్‌ వేగంగా పరుగులు చేయగలరు. అయితే వీరిలో తొలి ముగ్గురు తప్పితే మిగతావారిపై పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడం వల్ల ముంబయి వారిని కొనుగోలు చేసింది.

mumbai indians team 2022
.

ఓపెనర్లు సరే.. మరి ఆల్‌ రౌండర్లు?

Mumbai Indians Openers: ముంబయికి ఓపెనింగ్‌ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. అయితే బ్యాకప్‌ ఓపెనర్ ఎవరనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో ఆల్‌రౌండర్లు రాణించకపోవడం కారణంగా లీగ్ దశకే ముంబయి పరిమితం కావాల్సి వచ్చింది. పాండ్య సోదరులు, కీరన్‌ పొలార్డ్‌ విఫలం కావడం వల్ల ముంబయికి దెబ్బ పడింది. అయితే ఈసారి పాండ్య బ్రదర్స్ లేరు. కీరన్‌ పొలార్డ్‌ కూడానూ పెద్దగా రాణించిందేమీ లేదు. అయితే ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా పొలార్డ్‌కు ఉంది. చివర్లో జోఫ్రా ఆర్చర్‌ కూడా విలువైన పరుగులు చేయగలడు. అలానే ఫాబియన్‌ అలెన్ హార్డ్‌ హిట్టరే. ఇక ఆసీస్‌ ఆటగాడు డానియల్ సామ్స్‌ ఫాస్ట్‌ మీడియంతోపాటు బ్యాటింగ్‌ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.

mumbai indians team 2022
.

బుమ్రా నేతృత్వంలో

mumbai indians team 2022
.

Mumbai Indians Bumrah: టీమ్‌ఇండియా ప్రధాన పేస్‌ బౌలర్‌ బుమ్రా నేతృత్వంలోనే ముంబయి ఇండియన్స్‌ పేస్‌ బౌలింగ్‌ దళం ఉండబోతోంది. బుమ్రా కాకుండా జోఫ్రా ఆర్చర్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్‌, బసిల్ థంపి ఉన్నారు. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మురుగన్‌ అశ్విన్‌, అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్, డేవాల్డ్‌ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీ అంతర్జాతీయ అనుభవం లేకపోవడం గమనార్హం. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే మరి.

అర్జున్ అవకాశం వచ్చేనా..?

mumbai indians team 2022
.

Arjun Tendulkar Mumbai T20: గత సీజన్‌లో రూ. 20లక్షలకు, ఈ సారి రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందుల్కర్‌కు ఈ సారైనా మ్యాచ్‌ ఆడేందుకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. 2020-21 సీజన్‌లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ముంబయి తరఫున హరియాణా మీద అరంగేట్రం చేసిన అర్జున్.. మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. ఐపీఎల్‌ 14వ సీజన్‌ మొత్తం రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమై నెట్స్‌లోనే బౌలింగ్ చేశాడు. అయితే గాయం కారణంగా మధ్యలోనే ఐపీఎల్‌ నుంచి తప్పుకొన్నాడు. ఇప్పుడు యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అర్జున్‌కు అవకాశం దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ముంబయి ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, అన్‌మోల్‌ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, రాహుల్ బుద్ది, సూర్యకుమార్‌ యాదవ్‌, ఆర్యన్ జుయల్, ఇషాన్‌ కిషన్‌, అర్జున్ తెందుల్కర్, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, హృతిక్‌ షోకీన్‌, జోఫ్రా ఆర్చర్, కీరన్‌ పొలార్డ్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్, తిలక్‌ వర్మ, రమణ్‌దీప్‌ సింగ్, సంజయ్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్, బసిల్‌ థంపి, బుమ్రా, జయ్‌దేవ్‌ ఉనద్కట్​, మయాంక్‌ మార్కండే, మురుగన్‌ అశ్విన్‌, రిలే మెరెడిత్, మిల్స్‌.

ఇదీ చూడండి: IPL 2022: ఐపీఎల్​లో 'మెయిడిన్ మాస్టర్స్​​' వీళ్లే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.