ETV Bharat / sports

టీమ్​ ఇండియాను భయపెడుతున్న గాయాలు.. వరుసలో ఇంకెంత మంది?

author img

By

Published : Oct 1, 2022, 7:22 AM IST

ICC T20 World Cup 2022 : టీమ్ ఇండియా ఆటగాళ్లు వరుగగా గాయాల పాలవ్వడం అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇలా అయితే మెగా టోర్నీలో నెగ్గుకురావడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫిట్​నెస్​ పరీక్షల్లో రాజీ పడటమే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే మరికొందరు ఐపీఎల్​లో ఒత్తిడితో ఆడటమే గాాయాలకు కారణమని వాదిస్తున్నారు. టీమ్​ ఇండియా గాయాల పరంపరపై విశ్లేషణ.

icc t20 world cup 2022
icc t20 world cup 2022

ICC T20 World Cup 2022 : నిన్న రవీంద్ర జడేజా.. నేడు జస్‌ప్రీత్‌ బుమ్రా.. రేపు ఇంకెవరు? ఇప్పుడు భారత అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. టీ20 ప్రపంచకప్‌ మొదలయ్యే లోపు ఇంకా ఎవరెవరు గాయపడతారో.. టోర్నీకి దూరం అవుతారో అన్న ఆందోళన నెలకొంది అభిమానుల్లో. గత ఏడాది కాలంలో గాయపడని భారత ఆటగాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు

ప్రపంచకప్‌ ముంగిట మిగతా జట్లన్నీ తమ బలాబలాల్ని సమీక్షించుకుంటూ, జట్టు కూర్పుపై లెక్కలు వేసుకుంటూ, ప్రత్యర్థులను ఎలా దెబ్బ తీయాలో ప్రణాళికలు రచించుకుంటూ ఉంటే.. టీమ్‌ఇండియా మాత్రం ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సమస్యల గురించి కంగారు పడుతూ, గాయపడ్డ ఆటగాళ్ల స్థానంలో ఎవరిని ఎంచుకోవాలా అని కసరత్తు చేయాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఆల్‌రౌండర్‌ జడేజా దూరం కావడమే పెద్ద దెబ్బ అంటే.. ఇప్పుడు బౌలింగ్‌ దళపతి బుమ్రా ప్రపంచకప్‌కు దూరమవడం జట్టు అవకాశాలనే ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. గత ఏడాది ప్రపంచకప్‌ అనంతరం ఇలా చాలామంది ఆటగాళ్లు గాయాలతో మ్యాచ్‌లు, సిరీస్‌లకు దూరం అవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌లో కీలకం అవుతారనుకున్న ఆటగాళ్ల మీద పని భారం పెరగకుండా సమయానుకూలంగా వారికి విశ్రాంతినిస్తూ, ఆటగాళ్లను రొటేట్‌ చేస్తూ, వేర్వేరు సిరీస్‌ల్లో వేర్వేరు ఆటగాళ్లను ఆడిస్తూ ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ.. ఫలితం లేకపోయింది.

తరచుగా ఎవరో ఒకరు గాయపడుతూనే వచ్చారు. బుమ్రా ఇంతకుముందే గాయం కారణంగా కొన్ని సిరీస్‌లకు దూరం అయ్యాడు. ఇంకా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌, భువనేశ్వర్‌, రిషబ్‌ పంత్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌.. ఇలా చెప్పుకొంటూ పోతే గత ఏడాది కాలంలో గాయాలతో కొన్ని మ్యాచ్‌లు లేదా సిరీస్‌లకు దూరమైన ఆటగాళ్ల జాబితా చాలా పెద్దదే. ముందు జాగ్రత్తగా జట్టులోని ప్రతి ఆటగాడికీ కనీసం ఒక్క సిరీస్‌ నుంచి అయినా విశ్రాంతి కల్పించినా.. ఈ పరిస్థితి తలెత్తడం విడ్డూరం.

యోయో ఉందా..?
కొన్నేళ్ల ముందు జట్టులో స్థానం సంపాదించాలంటే యో-యో అనే ఫిట్‌నెస్‌ పరీక్ష పాసవ్వాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. స్వయంగా ఉత్తమ ఫిట్‌నెస్‌ ప్రమాణాలు నెలకొల్పిన అప్పటి కెప్టెన్‌ కోహ్లి.. ఈ యో-యో విషయంలో పట్టుదలతో ఉండేవాడు. కానీ తర్వాత ఏమైందో ఏమో. ఇప్పుడా పరీక్షను పక్కన పెట్టేసినట్లుగా తెలుస్తోంది. దాని గురించి చర్చే లేదు. ఫిట్‌నెస్‌ పరీక్షల విషయంలో రాజీ పడ్డ ఫలితమే.. ప్రస్తుతం వరుసగా గాయాల దెబ్బలు అన్నది విశ్లేషకుల మాట.
ఐపీఎల్‌లో మాత్రం..:
అంతర్జాతీయ మ్యాచ్‌లు, సిరీస్‌లకు గాయాల వల్ల, విశ్రాంతి పేరుతో దూరం అయ్యే ఆటగాళ్లు.. ఐపీఎల్‌లో మాత్రం అన్ని మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండడంపై ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే ఫ్రాంఛైజీ క్రికెట్‌కే ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఐపీఎల్‌లో నెలన్నర పాటు వరుసగా తీవ్ర ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లు ఆడడం వల్లే ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు గాయాలను దాచి పెట్టి మరీ లీగ్‌లో ఆడుతున్నారని, ఆ తర్వాత అంతర్జాతీయ సిరీస్‌లకు దూరం అవుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌కు కొన్ని నెలల ముందు, ఆ టోర్నీ తర్వాత మాత్రమే శస్త్ర చికిత్సలు చేయించుకోవడం.. లీగ్‌కు మాత్రం అందుబాటులోకి రావడం మామూలే. ఇప్పుడు గాయాలతో ప్రపంచకప్‌కు దూరమైన జడేజా, బుమ్రా సైతం వచ్చే ఐపీఎల్‌లో పూర్తి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారంటూ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు వ్యంగ్యాస్త్రాలు విసురుతుండడం గమనార్హం.

ఏమయ్యాయి ఆ ప్రమాణాలు?
జడేజా, బుమ్రాల విషయంలో జరిగిందేదో జరిగిపోయిందని, అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో అయినా ప్రపంచకప్‌ దిశగా టీమ్‌ఇండియా సరిగ్గా సన్నద్ధం అవుతుందేమో అనుకుంటే.. ఒక ఆందోళన వెంటాడుతోంది. ప్రపంచకప్‌ లోపు, టోర్నీ ఆరంభం అయ్యాక ఇంకా ఎంతమంది గాయపడతారో అన్నదే ఆ ఆందోళన. హర్షల్‌ పటేల్‌ సైతం బుమ్రా లాగే గాయం నుంచి కోలుకుని ఇటీవలే పునరాగమనం చేశాడు.

అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో కనిపించడం లేదు. లయ అందుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. మరో పేసర్‌ భువనేశ్వర్‌ గాయాల చరిత్ర పెద్దదే. ఇటీవల వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న అతడిపై పని భారం పెరిగే ఉంటుంది. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ సమస్యల గురించి అందరికీ తెలిసిందే. జట్టులో మరికొందరి ఫిట్‌నెస్‌ మీద సందేహాలున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకెవరైనా షాకిస్తారేమో చూడాలి.

అసలు మొత్తంగా జట్టు ఫిట్‌నెస్‌ ఏ స్థాయిలో ఉంది అనే విషయమై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత జట్టులో ఒక్క కోహ్లీని మినహాయిస్తే ఎవ్వరూ అంత దృఢంగా కనిపించడం లేదు. కాస్త పని ఒత్తిడి పెరగ్గానే గాయాల పాలయ్యేంత సున్నితంగా తయారవుతున్నారు. కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో గాయపడి నెలలు నెలలు ఆటకు దూరం అవుతుండడం ఆందోళనకరం.

ఒకప్పుడు పెద్ద సంఖ్యలో టెస్టులు, వన్డేలు ఆడుతూ.. గంటలు గంటలు బ్యాటింగ్‌ చేసినా, సుదీర్ఘ స్పెల్స్‌ వేసినా ఇంత తరచుగా ఆటగాళ్లు గాయాల పాలయ్యేవారు కాదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పెరిగింది టీ20 మ్యాచ్‌లు మాత్రమే. ఈ ఫార్మాట్లో సిరీస్‌ల సంఖ్య పెరిగింది. పర్యటనలు, ప్రయాణాలు పెరిగాయి. అదే సమయంలో ఆటగాళ్లకు పనిభారం పెరగకుండా తరచుగా విశ్రాంతి ఇస్తున్నారు.

అయినా సరే.. ఆటగాళ్లు పదే పదే గాయాల పాలవుతున్నారు. మరి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ప్రమాణాలు పడిపోవడానికి కారణాలేంటి? ఈ విషయంలో సహాయ సిబ్బంది పర్యవేక్షణ జరగట్లేదా? ఒకసారి గాయపడ్డ ఆటగాళ్లు కొంత కాలానికే మళ్లీ ఎందుకు గాయపడుతున్నారు? ఫిట్‌నెస్‌ సమస్యలతో జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్తున్న ఆటగాళ్లు సంపూర్ణ ఫిట్‌నెస్‌ సంతరించుకోకుండా ఎలా బయటికి వస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కనిపించడం లేదు.

ఇవీ చదవండి: వైరల్​గా మారిన రోజర్ ఫెదరర్‌ పోస్ట్​.. అది ఎప్పుడూ ఉత్తమంగా ఉండాలంటూ..

వరల్డ్​కప్ విన్నర్​కు​ ప్రైజ్​మనీ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.