ETV Bharat / sitara

Chiranjeevi X Mohan Babu: రసవత్తరంగా 'మా' అధ్యక్ష పోరు!

author img

By

Published : Jun 22, 2021, 3:23 PM IST

Updated : Jun 22, 2021, 5:33 PM IST

టాలీవుడ్​లో త్వరలోనే జరగనున్న మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​(MAA) ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఈ పోటీలో ప్రకాశ్​ రాజ్​(Prakash Raj), శివాజీ రాజా(Sivaji Raja), హీరో మంచు విష్ణు(Manchu Vishnu) అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నారు. ప్రకాశ్​రాజ్​కు మెగాస్టార్​ చిరంజీవి(Chiranjeevi) మద్దతుగా నిలవగా.. మోహన్​బాబు(Mohan Babu) తన కుమారుడైన విష్ణును స్వయంగా పోటీలో దించారు. దీంతో స్నేహితుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Movie Artist Association (MAA) Election
చిరంజీవి X మోహన్​బాబు: 'మా' ఎన్నికల్లో రసవత్తర పోరు!

టాలీవుడ్​లో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. రెండేళ్లకోసారి జరిగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA Elections) అధ్యక్ష ఎన్నికలు ఈ సెప్టెంబర్​లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలోనే ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్​ పదవీ కాలం ముగియగా కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో తాత్కాలికంగానే ఇన్నిరోజులు నరేశ్​ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పీఠంపై సినీ పెద్దలు దృష్టి సారించారు.

ఈసారి రసవత్తరం!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కూడా అధ్యక్ష ఎన్నికను రసవత్తరంగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్​(Prakash Raj)ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. మెగాస్టార్ మద్దతుతో ప్రకాశ్​రాజ్​ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మాజీ అధ్యక్షుడు శివాజీరాజా కూడా మరోసారి మా అధ్యక్ష పీఠం కోసం పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రకాశ్ రాజ్, శివాజీ రాజా మధ్య పోటీ ఉంటుందనుకున్న క్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా మా ఎన్నికలపై కన్నేశారు. తమ కుమారుడు, నటుడు మంచు విష్ణు(Manchu Vishnu)ను బరిలోకి దింపారు.

పెద్దల ఆశీర్వాదంతో..

ఎన్నికలకు రెండు నెలల ముందుగానే ప్రచారం మొదలుపెట్టిన మంచు విష్ణు.. కృష్ణ, కృష్ణంరాజు లాంటి సీనియర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. స్వయంగా మోహన్ బాబు కుమారుడ్ని వెంట పెట్టుకొని సీనియర్ల ఇళ్లకు వెళ్లి మద్దతు కోరడం 'మా' ఎన్నికలపై పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పుడు 'మా' అధ్యక్ష పదవికి తెలుగు సినీ పరిశ్రమలో త్రిముఖ పోరు నెలకొంది.

అయితే ఈ పోరు ఇద్దరు మిత్రుల మధ్య జరగబోతుంది. చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున తన కార్యాచరణ ఏమిటో మంచు విష్ణు సినీ ప్రముఖులకు లేఖలు రాస్తున్నాడు. రేపు మా ఎన్నికలపై అధికారికంగా మంచు విష్ణు ప్రకటన విడుదల చేయనున్నాడు.

చిరు మద్దతుతో?

త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash raj) ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా ఎవరు బరిలోకి దిగుతారు? ఆయనకు ఎవరి మద్దతు ఉంటుంది? ఇలా అనేక అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

చిరంజీవి మద్దతు మీకు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి? మీరేమంటారు? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్‌ సమాధానం ఇస్తూ.. "చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీని కోసం వినియోగించుకోను" అని సమాధానం ఇచ్చారు.

అసోసియేషన్​ ఏంటంటే?

926 మంది సభ్యులున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పడి ఇప్పటికి 26 ఏళ్లవుతుంది. తొలిసారిగా ఈ అసోసియేషన్ కు మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షుడిగా పనిచేయగా ఆ తర్వాత కాలంలో సీనియర్ నటులు మోహన్ బాబు, నాగార్జున, మురళీమోహన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్ పనిచేశారు.

రాజేంద్రప్రసాద్, జయసుధ మధ్య పోటీతో రసవత్తరంగా మారి సాధారణ ఎన్నికలను తలపించిన మా అసోసియేషన్ ఎన్నికలు.. ఆ తర్వాత పాలకవర్గం సీనియర్ నటులు నరేశ్​, శివాజీ రాజాలతో తారస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో నరేశ్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గడిచిన నాలుగేళ్ల నుంచి ఎంతో ఉత్కంఠగా మారిన మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈ దఫా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేయనుండటం వల్ల ముచ్చటగా మూడోసారి రసవత్తరంగా మారనున్నాయి.

ఇదీ చూడండి.. Prakash raj: 'మా' అధ్యక్ష పదవి రేసులో ప్రకాశ్​రాజ్​

Last Updated : Jun 22, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.