ETV Bharat / sitara

బుల్లితెరపై మరోసారి వ్యాఖ్యాతగా తారక్‌?

author img

By

Published : Dec 12, 2020, 2:30 PM IST

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ మరోసారి బుల్లితెరపై ఓ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. ఇప్పటికే దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్​లో భారీ సెట్​ వేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తారక్​ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jr.Ntr
తారక్

వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. గతంలో ఓ రియాల్టీ షో కోసం వ్యాఖ్యాతగా మారి బుల్లితెర అభిమానులను అలరించారు. ఆ షోలో డైలాగులు, పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో ప్రసారం కానున్న ఓ రియాల్టీ షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని చిత్రపరిశ్రమలో టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పటికే ఈ రియాల్టీ షో కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్‌ వేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు విన్న తారక్‌ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. తమ అభిమాన నటుడ్ని మరోసారి బుల్లితెరపై చూడడం కోసం తాము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమురం భీమ్‌గా తారక్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ మహాబలేశ్వర్‌లో జరిగింది. ఇందులో తారక్‌-చెర్రీలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. 'ఆర్‌ఆర్‌ఆర్'‌ తర్వాత తారక్‌.. త్రివిక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్‌కు సంతకం చేశారు.

ఇదీ చూడండి : తారక్ వైల్డ్​గా ఉన్నాడు.. సీన్లు దుమ్మురేపుతున్నాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.