ETV Bharat / science-and-technology

అమ్మవారు వారికి ఇంటి ఆడపడుచు!

author img

By

Published : May 30, 2021, 7:56 PM IST

ఆ ఊళ్లో కొలువైన అమ్మవారిని ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. అందుకే తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. సస్యలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, పంటల లక్ష్మిగా పూజలు అందుకుంటూ... భక్తులకు సర్వశుభాలనూ ప్రసాదించే ఆ అమ్మవారే దువ్వలోని దానేశ్వరి దేవి.

అమ్మవారు వారికి ఇంటి ఆడపడుచు!
అమ్మవారు వారికి ఇంటి ఆడపడుచు!

పచ్చని పొలాల మధ్య వర్ణరంజితంగా నిర్మించిన ఆలయంలో జువ్వి చెట్టుకింద ధాన్యేశ్వరిగా విలసిల్లే దానేశ్వరిని కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తారు భక్తులు. ఈ జగన్మాత ఆలయం ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ నుంచి అత్తిలి వరిగేడు వెళ్లే మార్గంలో ఉంటుంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో దుర్వాసముని చేసిన యాగం వల్లే అమ్మవారు వెలసిందని అంటారు భక్తులు.

స్థల పురాణం..
దుర్వాస మునివల్లే ఈ ఊరికి దువ్వ అనే పేరు వచ్చిందని అంటారు. ఒకప్పుడు దువ్వను దుర్వాసపురి అని పిలిచేవారు. క్రమంగా అదే దూర్వ అయ్యిందనీ, దాన్నే ఇప్పుడు దువ్వగా పిలుస్తున్నారనీ ప్రతీతి. ఓ సారి దుర్వాస ముని ఈ ప్రాంతంలో అఖండ యజ్ఞం చేశాడట. ఆ సమయంలో యజ్ఞ గుండం నుంచి దానేశ్వరితోపాటూ ఇతర దేవతలు ఉద్భవించారట. అప్పటినుంచీ దానేశ్వరిని కొలుస్తున్నారని చెబుతారు. అయితే... 1967 ముందు వరకూ ఇక్కడ దేవి విగ్రహం స్థానంలో ఓ వృక్షం మాత్రమే ఉండేదట. దాన్నే వనదేవత దానమ్మగా కొలిచేవారట. తరువాత ఆ చెట్టు కూలిపోవడంతో స్థానికులు అక్కడే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిన్న ఆలయాన్ని నిర్మించారట. అది జరిగిన కొంతకాలానికి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా పోతవరం గ్రామానికి చెందిన వద్ది గునేశ్వరరావు అనే భక్తుడు తన మేనమామ ఊరికి వెళ్లి వస్తుండగా దువ్వ పొలిమేరలో చెట్ల మధ్య ఓ చిన్న పురాతన ఆలయం కనిపించిందట. దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశాడట. అప్పటినుంచీ ఆలయం గురించి అందరికీ తెలియడంతో భక్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగింది. ఇది తెలిసిన దేవాదాయ శాఖ ఆలయాన్ని పునర్నిర్మించిందని చెబుతారు.

స్థలపురాణం..

అమ్మ దర్శనం తరవాతే...
ఉభయగోదావరి జిల్లాలకు చెందిన రైతులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా కొలుస్తారు. అందుకే పంట చేతికొచ్చాక కొంత భాగాన్ని అమ్మవారికి సమర్పించడాన్ని ఓ ఆనవాయితీగా పాటిస్తారు. అంతేకాదు ఏదయినా ఓ పని ప్రారంభించే ముందూ, ఎక్కడికైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడూ అమ్మవారిని దర్శించుకుంటే ఏ ఆటంకాలూ ఉండవని నమ్ముతారు భక్తులు. ఈ ఆలయంలో శుక్రవారం పూట తొమ్మిది ప్రదక్షిణల చొప్పున తొమ్మిది వారాలు చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పౌర్ణమి రోజుల్లో అమ్మవారికి జరిగే విశేష పూజలు చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని అంటారు. అదే విధంగా ఏటా వైశాఖ శుద్ద ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ అయిదు రోజులపాటు అమ్మవారికి వైభవంగా జాతరను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలోనూ ఆదివారాలు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇవన్నీ కాకుండా ఏడాది పొడవునా కూడా పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో సరస్వతీ పూజ, నిప్పుల గుండం, వయ్యేరులో తెప్పోత్సవం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల భక్తులూ తరలిరావడం విశేషం.

స్థలపురాణం

ఎలా చేరుకోవచ్చు..
తణుకు మండలం దువ్వ గ్రామంలో కొలువైన దానేశ్వరి ఆలయం 216 ఏ జాతీయ రహదారికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి తణుకు వచ్చే బస్సులు నేరుగా దువ్వ బస్టాండులో ఆగుతాయి. అక్కడి నుంచి ఆలయానికి పది నిమిషాల దూరం ఉంటుంది. రాజమహేంద్రవరం నుంచి తణుకుకు బస్సుల్లో వస్తే...అక్కడి నుంచి అరగంట దూరంలో ఉండే ఆలయానికి చేరుకునేందుకు ఆటోలూ, క్యాబ్‌లూ అందుబాటులో ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.