ETV Bharat / science-and-technology

ఆరోగ్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. టింటో ర్యాంగ్

author img

By

Published : Mar 5, 2021, 12:12 PM IST

సాధారణంగా శాస్త్రవేత్తలకు ల్యాబ్‌లు... పరిశోధనలు ఇవే లోకమవుతాయి. డాక్టర్‌ ఫాతిమా బెనజీర్‌ మాత్రం అక్కడ నుంచి మరో అడుగుముందుకేశారు. ‘అజూకా లైఫ్‌ సైన్సెస్‌’ సంస్థను ప్రారంభించి ‘టింటో ర్యాంగ్‌’ పేరుతో ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టే ఆ ఆవిష్కరణ మనకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

doctor fathima benazir invented tinto rang in health sector
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణ.. టింటో ర్యాంగ్

మీరెప్పుడైనా గమనించారా?... రక్తపరీక్ష కోసం డయాగ్నస్టిక్‌ సెంటర్లకు వెళ్లినప్పుడు మన దగ్గర్నుంచి సేకరించిన శాంపిళ్లని వేరే రసాయనంలో వేసి కలుపుతారు. ఆ తర్వాతే మన వ్యాధిని ఏంటో నిర్ధరిస్తారు. అయితే ఇలా కలిపే రసాయనాలు చాలావరకూ హానికారకాలే ఉంటాయి. అందుకే వాటిని సరైన చర్యలు తీసుకోకుండా భూమిలో కలిపినా ప్రమాదమే. పైగా వీటిని తయారుచేసే సంస్థలు చాలామటుకు విదేశాల్లోనే ఉన్నాయి. అక్కడ నుంచి తెప్పించుకోవడం కూడా ఖరీదైన వ్యవహారమే. బెంగళూరుకు చెందిన డాక్టర్‌ ఫాతిమా ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు ‘టింటో ర్యాంగ్‌’ అనే ఆవిష్కరణ చేశారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా వంటింట్లో దొరికే దినుసులతోనే తయారుచేసి సంచలనం సృష్టించారు.

మాలిక్యులర్‌ బయాలజిస్ట్‌ అయిన డాక్టర్‌ ఫాతిమా మొదట లెక్చరర్‌గా తన కెరీర్‌ని మొదలుపెట్టారు. తర్వాత పరిశోధనలపై ప్రేమతో బెంగళూరులోని ‘ది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్సీ)’లో పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చర్‌గా తన పరిశోధనలు మొదలుపెట్టారు. పరిశోధనాంశంగా ల్యాబుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే ‘ఫ్లోరోసెంట్‌ డై’కు ప్రత్యామ్నాయం కనిపెట్టాలనుకున్నారు. కారణం ఈ డైలో ఉండే రసాయనాల్లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు గుర్తించారామె. సహజసిద్ధమైన పదార్థాలతో రీ ఏజెంట్‌ను రూపొందించాలనుకున్నారు. అందుకు వంటింటి పదార్థాలనే ముడిసరకులుగా మార్చుకున్నారు.

‘నా పరిశోధనకు పూర్తిగా మనం వంటింట్లో వాడే పదార్థాలనే వినియోగించా. మొదట్లో ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయి. ప్రతిసారీ నిరాశే! ఆ పరిస్థితి నుంచి బయటపడి ఆత్మవిశ్వాసంతో విజయం వైపు నడిచా. చివరకు అనుకున్న ఫలితాన్ని సాధించగలిగా. కచ్చితమైన ఫలితాలు ఇవ్వడంతో... నేను కనిపెట్టిన జెల్‌ లాంటి పదార్థాన్ని ‘టింటో ర్యాంగ్‌’ అని పేరు పెట్టా. దీన్ని పూర్తిగా ఫుడ్‌ గ్రేడ్‌ డై అనొచ్చు. దీన్ని డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్‌, సెల్‌ టెస్టింగ్‌ లాంటి పలురకాల పరీక్షల్లో ఉపయోగించవచ్చు. దీన్ని ఐఐఎస్‌సీ, సీసీఎంబీల్లో సైతం వినియోగిస్తున్నారు’ అంటూ వివరించారు డాక్టర్‌ ఫాతిమా.

గతేడాది కరోనా వ్యాప్తి చెందిన సమయంలో ఐఐఎస్‌సీ తరఫున కొవిడ్‌ -19 రెస్పాన్స్‌ టీమ్‌గా డాక్టర్‌ ఫాతిమా బృందం ఎంపికైంది. ఇందులో భాగంగా ఆమె చేసిన పరిశోధనలు ఎంతో కీలకంగా మారాయి. కరోనా రోగి నుంచి సేకరించిన స్వాబ్‌ ల్యాబ్‌కు చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటప్పుడు నమూనాలు మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే పరీక్షలు చేసిన తర్వాత కచ్చితమైన ఫలితాలు రాకపోవచ్చు కూడా. అలా కాకుండా స్వాబ్‌కు సరైన రక్షణనందించే ప్రత్యేక గాజునాళాన్ని ‘ఆర్‌ఎన్‌ఏ రేపర్‌’ పేరుతో డాక్టర్‌ ఫాతిమా బృందం రూపొందించింది. ఈ గాజునాళంలో స్వాబ్‌ సాధారణ వాతావరణంలో కూడా వారంరోజులపాటు ఎలాంటి మార్పునకు గురికాకుండా భద్రంగా ఉంటుంది. ఈ రేపర్‌ ఆమెకు ఎన్నో ప్రశంసలను తెచ్చిపెట్టింది. త్వరలో ఎవరికివారు ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలుగా ఒక కిట్‌ని తయారుచేస్తానని చెబుతున్నారు ఫాతిమా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.