ETV Bharat / priya

Chicken Snacks Recipes : సండే స్పెషల్.. చికెన్ స్నాక్స్ చేసేద్దామా..?

author img

By

Published : Jan 23, 2022, 12:01 PM IST

Chicken Snacks Recipes: సండే వచ్చిందంటే.. ఇంట్లో నాన్​వెజ్ ఉండాల్సిందే. మటన్​కు ప్రియులు ఎక్కువగా ఉన్నా.. దాని ధర వల్ల చాలా మంది చికెన్​వైపే మొగ్గుచూపుతారు. మరి ప్రతి సండే చికెన్ కర్రీ అంటే చిరాకేగా. అందుకే చికెన్​లో రకరకాల వెరైటీలు చేస్తూ ఆస్వాదిస్తుంటారు. ఎప్పుడూ చికెన్​తో కర్రీసే చేసుకుంటున్నారా? కాస్త డిఫరెంట్​గా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సండే.. చికెన్​ స్నాక్స్ చేసేయండి ఇలా..

Chicken Snacks Recipes
Chicken Snacks Recipes

Chicken Snacks Recipes : చికెన్‌ తెచ్చుకోగానే.. కూర/పులావ్‌/పులుసు/వేపుడు.. ఇలా ఏం చేసుకోవాలా అనే కోణంలోనే ఆలోచిస్తాం కదా... ఈసారి అవన్నీ పక్కన పెట్టేసి చికెన్‌తో ఇలాంటి స్నాక్స్‌ని తయారు చేసుకుంటే సరి.

స్పైసీ చికెన్‌ వింగ్స్‌

Spicy Chicken Wings : కావలసినవి: చికెన్‌ వింగ్స్‌: పావుకేజీ, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను, గుడ్డు: ఒకటి, కారం: రెండు చెంచాలు, దనియాలపొడి: చెంచా, జీలకర్రపొడి: రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, నూనె: వేయించేందుకు సరిపడా, కరివేపాకు రెబ్బలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: అయిదు, ఉల్లిపాయ: ఒకటి, సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, కొబ్బరిపొడి: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు.

తయారీ విధానం: చికెన్‌ ముక్కలపైన మొక్కజొన్నపిండి, గుడ్డుసొన, సగం కారం, దనియాలపొడి, కొద్దిగా ఉప్పు, సగం జీలకర్రపొడి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి అన్నింటినీ బాగా కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఈ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. మరో బాణలిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి కరివేపాకు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి వేయించాలి. తరువాత చికెన్‌ ముక్కలు, మిగిలిన కారం, జీలకర్రపొడి, మరికొంచెం ఉప్పు, కొబ్బరిపొడి, సెనగపిండి వేసి బాగా కలిపి... అయిదు నిమిషా లయ్యాక దింపేయాలి.

కారంచిప్స్‌

కారంచిప్స్‌

Chicken Chips : కావలసినవి: చికెన్‌: పావుకేజీ (పల్చని ముక్కల్లా కోసుకోవాలి), మొక్కజొన్నపిండి: పావుకప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, కారం: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, జీలకర్రపొడి: మూడు చెంచాలు, చాట్‌మసాలా: రెండు చెంచాలు, దనియాలపొడి: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో మొక్కజొన్నపిండి, అల్లంవెల్లుల్లిముద్ద, చెంచా కారం, గరంమసాలా, చెంచా జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపాలి. అందులో చికెన్‌ ముక్కలు వేసి మరోసారి కలిపి కనీసం రెండు గంటలసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత బయటకు తీసి కాగుతున్న నూనెలో ఈ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కారం, జీలకర్రపొడి, కొద్దిగా ఉప్పు, చాట్‌మసాలా, దనియాలపొడి ఓ గిన్నెలో వేసి కలిపి... ఈ మసాలాను వేడిగా ఉన్న చిప్స్‌పైన చల్లితే కారంచిప్స్‌ రెడీ.

అపోలో చికెన్‌

అపోలో చికెన్‌


Apollo Chicken : కావలసినవి: చికెన్‌: అరకేజీ, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: చెంచా, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, మైదా: రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద: టేబుల్‌స్పూను, గుడ్డు: ఒకటి, పెరుగు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా, కరివేపాకు రెబ్బలు: రెండు, కారం: టేబుల్‌స్పూను, క్యాప్సికం: ఒకటి, కొత్తిమీర: కట్ట, పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: రెండు, అల్లంతరుగు: చెంచా.

తయారీ విధానం: ఓ గిన్నెలో చికెన్‌ముక్కలు, కొద్దిగా ఉప్పు, మిరియాలపొడి, మొక్కజొన్నపిండి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, గుడ్డుసొన వేసుకుని బాగా కలిపి అరగంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత ఈ ముక్కల్ని నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో రెండు చెంచాల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయించుకుని తరువాత క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక గిలకొట్టిన పెరుగు, కారం, తగినంత ఉప్పు, అల్లంతరుగు వేసి చికెన్‌ ముక్కల్ని బాగా వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.