ETV Bharat / opinion

తెల్లదొరలపై గిరిజన సమరభేరి- స్ఫూర్తినింపిన పోరాటాలు

author img

By

Published : Nov 15, 2021, 7:03 AM IST

బ్రిటిష్‌ తుపాకుల ముందు ఆ సంప్రదాయ ఆయుధాలు నిలవలేకపోయినా గిరిపుత్రులు(tribal leaders) బెదరలేదు. సమర్థులైన నాయకుల సారథ్యంలో పోరాటాలు సాగించారు. అనేకమంది వీరులు అమరులయ్యారు. వారిలో కుమురం భీం(komaram bheem news), అల్లూరి సీతారామరాజు, తిల్కామాఝీ, టికేంద్రజీత్‌ సింగ్‌, వీర్‌ సురేంద్ర సాయె, వీర్‌ నారాయణ్‌ సింగ్‌, రూప్‌చంద్‌ కోన్వార్‌, లక్ష్మణ్‌నాయక్‌, రామ్‌జీ గోండ్‌ తదితరులు ఉన్నారు.

tribals
ట్రైబల్స్, గిరిజనులు

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం 700 గిరిజన తెగలకు(tribals) చిరకాల ఆవాసం. గిరిజనులు తమ కళలు, చేతివృత్తులతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేస్తున్నారు. తమ సంప్రదాయ జీవనశైలితో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతితో సహజీవనం చేస్తున్నారు. జాతి నిర్మాణంలో గిరిజనుల విశిష్ట పాత్రను గుర్తించిన రాజ్యాంగం వారి సంస్కృతి సంరక్షణకు, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రిటిష్‌ వారు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాక గిరిజనుల హక్కులు(tribal rights in india), సంప్రదాయాలు, స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే విధానాలను చేపట్టి దౌర్జన్యంగా అమలు చేశారు. గిరిజనులను బానిసత్వంలోకి నెట్టడమే పనిగా పెట్టుకున్నారు. చిరకాలం నుంచి స్వేచ్ఛగా, హుందాగా, ఆత్మాభిమానంతో జీవిస్తున్న వనపుత్రులు తెల్లవాళ్ల దాష్టీకాన్ని నిరసించారు. అడవులు, అక్కడి నీటి వనరులు తరతరాలుగా గిరిజనులకు దన్నుగా నిలుస్తున్నాయి. అటవీ భూములు వారికి జీవనాధారాలు. బ్రిటిష్‌ వారు వచ్చాక వేల ఏళ్ల నుంచి గిరిజనులు అనుభవిస్తున్న హక్కులను లాగేసుకుని జమీందార్లకు కట్టబెట్టారు. గిరిజనులను కౌలుదార్లుగా మార్చేసి ఎడాపెడా పన్నులు విధించారు. వాటిని తీర్చలేక వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లోకి వెళ్ళాల్సిన దుస్థితి దాపురించింది. వలస పాలకులు నియమించిన పోలీసులు- జమీందార్లకు, వడ్డీ వ్యాపారులకు అండగా నిలిచి గిరిజనులను బానిసత్వంలోకి నెట్టారు.

దేశవ్యాప్తంగా పోరు నగారా

బ్రిటిష్‌వారి దురాగతాలపై దేశంలో పలుచోట్ల గిరిజనుల తిరుగుబాట్లు ఎగశాయి. అడవులు, అక్కడి భూములపైన తమ హక్కులను కాపాడుకోవడానికి బ్రిటిషర్లపై, జమీందార్లపై పోరాటం సాగించారు. అందుకు వారు కత్తులు, బాణాలను ఉపయోగించారు.

బ్రిటిష్‌ తుపాకుల ముందు ఆ సంప్రదాయ ఆయుధాలు నిలవలేకపోయినా గిరిపుత్రులు బెదరలేదు. సమర్థులైన నాయకుల సారథ్యంలో పోరాటాలు సాగించారు. అనేకమంది వీరులు అమరులయ్యారు. వారిలో కుమురం భీం(komaram bheem news), అల్లూరి సీతారామరాజు(alluri sitarama raju death), తిల్కామాఝీ, టికేంద్రజీత్‌ సింగ్‌, వీర్‌ సురేంద్ర సాయె, వీర్‌ నారాయణ్‌ సింగ్‌, రూప్‌చంద్‌ కోన్వార్‌, లక్ష్మణ్‌నాయక్‌, రామ్‌జీ గోండ్‌ తదితరులు ఉన్నారు.

బిర్సా ముండా ఝార్ఖండ్‌లో జరిపిన ఉద్యమం- దేశంలో పలు గిరిజన తిరుగుబాట్లకు ప్రేరణ ఇచ్చింది. గిరిజనుల్లో సామాజిక సంస్కరణలు తీసుకురావడానికీ ఆయన కృషి చేశారు. మద్యపానాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఉద్యమించారు. దైవంపై విశ్వాసం ఉంచి, సత్ప్రవర్తనను అలవరచుకోవాలని బోధించారు. గిరిజనులు తమ మూలాలను తెలుసుకొని, ఐక్యంగా మెలగాలని పిలుపిచ్చారు. వనపుత్రుల్లో చైతన్యం తెచ్చి, వారిని ఏకతాటిపై నడిపారు కనుకనే బిర్సా ముండాను 'భగవాన్‌' అని సంబోధించేవారు.

భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల్లో బిర్సా ముండాకు విశిష్ట స్థానం ఉంది. కేవలం 25 ఏళ్ల వయసులో ఆయన చేసిన త్యాగాలు, సాధించిన విజయాలు అసామాన్యమైనవి. ఆయన జరిపిన పోరాటాల వల్లనే బ్రిటిష్‌ వలస పాలకులు గిరిజనుల భూ హక్కులను గుర్తిస్తూ చట్టాలు చేశారు. పిన్న వయసులోనే అమరులైనా- ఆయన తెచ్చిన సాంఘిక, సాంస్కృతిక విప్లవం గిరిజనుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. బ్రిటిష్‌ వారిపై గిరిజనులు జరిపిన సాయుధ పోరాటం వారి దేశభక్తికి తిరుగులేని నిదర్శనం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మనం జరుపుకొంటున్న ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో మాతృదేశం కోసం గిరిజన వీరులు చేసిన త్యాగాలను స్మరించుకొంటున్నాం.

స్వాతంత్య్రోద్యమానికి బీజం

గిరిజనులు 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ముందునుంచే బ్రిటిష్‌ వారిపై తిరగబడ్డారు. 1770ల్లో చువార్‌, హల్బా తెగలు తెల్లవాళ్లపై కత్తి ఎత్తాయి. అప్పటి నుంచి దేశం నలుమూలలా గిరిజనులు తమదైన పంథాలో వలస పాలకులపై పోరాటం సాగించారు. తూర్పు భారతంలో సంథాల్‌, ముండా, పహాడియా తదితర తెగలు, ఈశాన్య భారతంలో నాగా, అహోం, మిజో వంటి తెగలు, దక్షిణ భారతంలో గోండు, బేడ, పడయగర్‌, కుర్చియా, గ్రేట్‌ అండమాన్‌ తెగలు, మధ్య భారతంలో కోల్‌, మురియా వంటి తెగలు, పశ్చిమ భారతంలో భిల్లులు, కోలీ తదితర తెగలు బ్రిటిష్‌ వారిపై పోరాటాలకు దిగి వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఈ పోరాటాల్లో గిరిజన మాతలు, సోదరీమణులూ పాల్గొన్నారు. వారిలో రాణీ గైడిన్లియు, ఫూలో, ఝానో ముర్ము, హెలెన్‌ లెప్చా, పుటాలీ మాయాలు లబ్ధప్రతిష్ఠులు. వారి త్యాగాలను జాతి స్మృతిపథంలో చిరస్థాయిగా నిలపడం మన కర్తవ్యం. తదనుగుణంగా కేంద్రప్రభుత్వం ఈ నెల 15 నుంచి 22 వరకు గిరిజన నృత్య ప్రదర్శనలు, హస్తకళల మేళాలు, చిత్ర పట పోటీలు, కార్యశాలలు, రక్తదాన శిబిరాలు నిర్వహించనుంది. సమకాలీన గిరిజనుల్లో వివిధ రంగాల విజేతలను సన్మానించి, చరితార్థులైన గిరిజన స్వాతంత్య్ర యోధులకు ఘన నివాళులు అర్పిస్తోంది. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మహోత్సాహంతో పాల్గొంటున్నాయి. గిరిజన అమరవీరులను సదా స్మరించుకోవడానికి ఈ వారోత్సవం ఎంతగానో తోడ్పడనుంది!

స్వేచ్ఛాభారత నివాళి

భారత స్వాతంత్య్ర సమరంలో గిరిజనులు(tribals news) పోషించిన అద్వితీయ పాత్రను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతిస్తున్నారు. వారి అమూల్య సేవలు, త్యాగాలకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. గిరిజన స్వాతంత్య్ర యోధులను భావి తరాలూ ఆరాధించేందుకు వీలుగా దేశమంతటా మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నట్లు 2016 ఆగస్టు 15న ప్రధాని ప్రకటించారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ వివిధ ప్రాంతాల్లో గిరిజన స్వాతంత్య్ర యోధుల స్మారక శాలలను నిర్మిస్తోంది. వాటిలో మొదటిది స్వాతంత్య్ర సమర యోధుడు బిర్సా ముండా మ్యూజియం. రాంచీలో నిర్మించిన ఈ మ్యూజియాన్ని నేడు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గిరిజనుల త్యాగాలను, స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్రను గౌరవిస్తూ ఏటా నవంబరు 15వ తేదీని జనజాతీయ గౌరవ దినంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అది భగవాన్‌ బిర్సా ముండా జన్మదినం. గిరిజన స్వాతంత్య్ర యోధుల గాథలను ప్రపంచానికి తెలియజెప్పే నిర్ణయమది. వలస పాలకులపై హోరాహోరీగా పోరాడిన విస్మృత గిరిజన స్వాతంత్య్ర సమర యోధులను జాతి మనోపథంలో నిలపడం కోసం ఈనెల 15 నుంచి 22 వరకు వివిధ కార్యక్రమాలతో వారోత్సవాలనూ నిర్వహించనున్నారు.

--అర్జున్ ముండా, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి.

ఇదీ చదవండి:

మేలిమి విద్యే దేశానికి పెన్నిధి- నేటి బాలలే రేపటి నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.