ETV Bharat / opinion

అడగ్గానే విడాకులు ఇచ్చేస్తారా? ఆరు నెలల రూల్​పై సుప్రీం తీర్పు అర్థమేంటి?

author img

By

Published : May 1, 2023, 8:31 PM IST

Updated : May 2, 2023, 8:30 AM IST

పరస్పర ఇష్టపూర్వకంగా విడాకులు కోరే జంటల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. ఆరు నెలలు వేచి చూసే అవసరం లేకుండానే విడాకులు ఇవ్వొచ్చనే అంశంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విడాకులు వెంటనే ఇచ్చేస్తారా? ఇందుకోసం నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లొచ్చా? వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు మీకోసం.

Supreme Court verdict on dissolution of marriage
Supreme Court verdict on dissolution of marriage

వివాహాల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో.. అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విడాకులు కావాల్సిన వారు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చా? వెళ్తే వెంటనే విడాకులు మంజూరు అవుతాయా? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. విడాకులు కావాల్సిన వారు ఆరు నెలలు ఆగాల్సిన పని లేదా? కుటుంబ కోర్టులకు వెళ్లాల్సిన పని ఉండదా? వంటి అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏంటి? దీని వల్ల వచ్చే మార్పులు ఏంటో చూద్దాం.

సుప్రీం తీర్పు ఇదే..
భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది. ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సర్వోన్నత న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేయొచ్చని వ్యాఖ్యానించింది. విడాకులు కోరే జంట నడుమ కోలుకోలేని విభేధాలు, సమస్యలు పరిష్కారం కానీ స్థితి తలెత్తినప్పుడు.. ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద తమకు ఉంటుందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం విడాకులు ఎలా మంజూరు చేస్తున్నారు?
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13-బీ అనే నిబంధన ప్రకారం పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునే జంట.. న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్షన్ 13-బీలోని సబ్​ సెక్షన్ (2) ప్రకారం తొలుత ఫస్ట్ మోషన్​ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. విడాకుల విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంటే.. సెకండ్ మోషన్​ను దాఖలు చేయాలి. అనంతరం దంపతులకు కూలింగ్ టైమ్ ఇస్తారు. ఈ గ్యాప్​లో విడాకుల విషయంలో మనసు మార్చుకుంటారనే ఉద్దేశంతో ఆరు నెలలు గడువు ఇస్తారు. అప్పటికీ పిటిషన్ విత్​డ్రా చేసుకోకుంటే విచారణ జరిపి విడాకులు మంజూరు చేస్తారు. ఫస్ట్ మోషన్ దాఖలు చేసిన 18 నెలల లోపే విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే, విడాకులకు దాఖలు చేసుకునే జంటకు వివాహం జరిగి ఏడాది పూర్తై ఉండాలి.

ఏడాది కాకముందే రద్దు చేసుకోవాలంటే?
కొన్ని పరిస్థితుల్లో వివాహం జరిగి ఏడాది పూర్తి కాక ముందే విడాకులు కోరవచ్చు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14లో పేర్కొన్న పలు మినహాయింపులను ఉపయోగించుకొని కుటుంబ కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చు. అసాధారణ వేదన, దుర్భర పరిస్థితులను కారణంగా చూపించి విడాకులు కోరవచ్చు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆరు నెలలు వేచి చూడకుండానే విడాకులు పొందవచ్చు. సెకండ్ మోషన్ దాఖలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే, వివాహ బంధం కోలుకోని విధంగా ఉందనేందుకు సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.

బంధం దెబ్బతిందని నిరూపించాలంటే ఎలా?
వివాహం పునరుద్ధరించలేని విధంగా మారిందని విడాకులు కోరడం హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యంత జాగ్రత్తతో ఈ ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. ఇరు పక్షాలకు పూర్తి న్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలని పేర్కొంది. వివాహం పూర్తిగా దెబ్బతిందని నిర్ధరించడం ఎలాగనే విషయాన్ని సైతం సుప్రీంకోర్టు తన తీర్పులో వివరించింది. పలు అంశాలను తీర్పులో పొందుపర్చింది. అవేంటంటే?

  • వివాహం తర్వాత ఇరుపక్షాలు ఎంత కాలం నుంచి వేర్వేరుగా ఉంటున్నాయి?
  • చివరిసారిగా ఇరు పార్టీలు ఎప్పుడు కలిసి ఉన్నాయి?
  • వ్యక్తిగతంగా, కుటుంబాలపై చేసుకున్న ఆరోపణల తీవ్రత
  • న్యాయ ప్రక్రియలో జారీ అయిన ఆదేశాలు, వ్యక్తిగత అనుబంధం​పై వాటి ప్రభావం
  • సమస్యను పరిష్కరించేందుకు న్యాయపరంగా ఎన్ని ప్రయత్నాలు జరిగాయి? చివరిసారిగా జరిగిన ప్రయత్నం ఎప్పుడు?

ఈ అంశాలన్నింటినీ ఇరుపార్టీల ఆర్థిక, సామాజిక స్థితిగతులు, విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని పరిశీలించాలి. వీరికి సంతానం ఉందా? ఉంటే వారి వయసు, చిన్నారులు ఎవరిపై ఆధారపడి ఉన్నారు?, భరణం వంటి విషయాలన్నింటినీ న్యాయస్థానాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చా?
పునరుద్ధరించలేని విధంగా వివాహం విచ్ఛిన్నమైందని పేర్కొంటూ విడాకుల కోసం సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించరాదని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ దాఖలు చేసి విడాకులు కోరలేరని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 32 లేదా 226 (హక్కుల ఉల్లంఘన) ప్రకారం విడాకులు కోరలేరని తెలిపింది. న్యాయస్థానంలో ప్రతికూల తీర్పు వచ్చిన వారు.. సంబంధిత పైకోర్టులనే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియను తప్పించుకునే ఉద్దేశంతో సుప్రీంను ఆశ్రయించడం కుదరదని వివరించింది.

Last Updated : May 2, 2023, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.