ETV Bharat / opinion

సీజనల్‌ వ్యాధుల ముప్పు- అవగాహనతోనే అడ్డుకట్ట

author img

By

Published : Jun 23, 2021, 8:02 AM IST

ఏటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి, పేదల జీవితాలు దర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, స్వైన్‌ ఫ్లూ, న్యూమోనియా వంటి వ్యాధులు గ్రామీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పరిశుభ్రత అందరి బాధ్యత అనే అవగాహనతో ముందుకు సాగితేనే అడ్డుకట్ట వేయొచ్చు.

seasonal diseases
సీజనల్ వ్యాధులు

ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాకు తోడు, వానాకాలంలో సీజనల్‌ వ్యాధులు చెలరేగితే కష్టాలు మరింతగా పెరుగుతాయి. ఏటా వానాకాలంలో వ్యాధుల ముప్పు పెరిగి, పేదల జీవితాలు దుర్భరమవుతున్నాయి. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు, ఫైలేరియా, అతిసారం, టైఫాయిడ్‌, శ్వాసకోశ వ్యాధులు/ ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్‌ ఫ్లూ, న్యూమోనియా వంటి వ్యాధులు గ్రామీణులను తీవ్రంగా వేధిస్తున్నాయి. మలేరియా వల్ల దేశంలో ఏటా పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాల్లో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాగునీరు, పారిశుద్ధ్య లేమి, పోషకాహార లోపం, ప్రాథమిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటివి శిశు మరణాలకు దారితీస్తున్నట్లు తేలింది.

ముందస్తుగా సన్నద్ధం..

దేశంలో అతిసారంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతుండటానికి- తాగునీరు, పారిశుద్ధ్యలోపమే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం వల్ల ఆహారం కలుషితమై నీళ్ల విరేచనాలు, కలరా, టైఫాయిడ్‌, పచ్చ కామెర్లు, ఏలికపాములు, జిగట విరేచనాలు వ్యాప్తి చెందుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి విస్తృత వ్యాప్తితో ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సీజనల్‌ వ్యాధులూ ముసురుకొంటే ప్రజల జీవితాలు మరింత దుర్భరమయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగాలు ముందస్తుగా సంసిద్ధం కావడం మేలు.

పర్యావరణ పరిశుభ్రత కమిటీ నాలుగు దశాబ్దాల్లో దేశ జనాభాలోని 90శాతానికి సురక్షిత తాగునీటిని అందించాలని 1949లోనే సూచించింది. కానీ ఆ సూచన అలంకార ప్రాయంగానే మిగిలింది. దేశంలో దాదాపు రెండులక్షల జనావాసాల్లో కలుషిత నీటితో ఏటా నాలుగుకోట్ల మంది వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందుబాటులో లేనివారు భారత్‌లోనే అధికంగా ఉన్నట్లు 'వాటర్‌ ఎయిడ్‌' సంస్థ గతంలోనే వెల్లడించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం గ్రామాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇచ్చి, గొట్టాల ద్వారా సురక్షిత తాగునీరు అందించే పనులు చేపడుతోంది.

వ్యర్థాల నిర్వహణ..

తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరు అందిస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ హర్‌ ఘర్‌ జల్‌ కార్యక్రమం ద్వారా నల్లా నీటిని అందించే పనులను వేగవంతం చేసి ప్రజల జీవితాలను మెరుగుపరచాలి. ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తే, తాగునీటి కొరతతో సంక్రమించే రోగాలకు అడ్డుకట్ట పడుతుంది. మరోవైపు- చెత్త, వ్యర్థాల నిర్వహణ సక్రమంగా సాగకపోతే మానవ ఆరోగ్యానికి హానికరం. ఈ సమస్య కొనసాగితే క్యాన్సర్‌, ఉబ్బసం లాంటి 22 రకాల వ్యాధులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు కలుగుతున్నాయి. చెత్తను శుద్ధిచేయకపోతే జలాశయాల్లో కలిసి, నీటిని కలుషితం చేస్తుంది. అందుకని, చెత్తను శాస్త్రీయ పద్ధతిలో, సమర్థంగా నిర్వహించి, అర్థవంతంగా మార్చి సంపదను సృష్టించాలి. స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ రెండో దశలో ఘన వ్యర్థాల నిర్వహణను చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలి. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 60శాతం పారిశుద్ధ్యానికి వెచ్చించే వెసులుబాటును ఉపయోగించుకొని గ్రామాల్లో పరిస్థితులను మెరుగుపరచాలి.

బహుముఖ విధానాలు

వానాకాలంలో వ్యాధుల నివారణకు ప్రభుత్వాలు బహుముఖ విధానాలను పాటించాలి. స్థానిక ప్రభుత్వాలను సంసిద్ధం చేయాలి. పంచాయతీ సభ్యుల సేవలనూ వినియోగించుకోవాలి. గ్రామాల్లో పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్య విభాగాల మధ్య సమన్వయం అవసరం. అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలతో పాటు మహిళా సంఘాలను సమీకృతం చేసి అవగాహన కలిగించాలి. దోమలు వ్యాపించకుండా నిమ్మగడ్డి, జీరేనియం, భూతులసి, దవనం, మరువం, స్పియర్మింట్‌, సిట్రోనెల్లా వంటి సుగంధ మొక్కలను పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దీనివల్ల పర్యావరణానికి మేలు కలగడంతోపాటు, దోమల సమస్యను తగ్గించవచ్చు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగేలా, వేడి ఆహార పదార్థాలనే తినేలా ప్రజలను చైతన్యపరచాలి. తాగునీటి నాణ్యతను పరీక్షించాలి. గ్రామంలో సర్వే చేసి, బాధితులకు సకాలంలో మందులు అందించాలి. తగిన వసతులతో కూడిన ఐసొలేషన్‌ వార్డులను సిద్ధం చేయాలి. తగినన్ని మందులు అందుబాటులో ఉంచాలి. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సేవలను అందించడానికి రెండు, నాలుగు చక్రాల వాహనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో సిద్ధంగా ఉంచాలి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించి, దోమ తెరలను అందించాలి.

పరిశుభ్రత అందరి బాధ్యత అనే అవగాహనతో ముందుకు సాగితేనే అనారోగ్యాన్ని అడ్డుకోవచ్చు. తద్వారా విలువైన మానవ వనరులు దేశ ఉత్పత్తిలో పాలుపంచుకోవడం వల్ల ఆర్థికాభివృద్ధితోపాటు, ఆరోగ్య భారతావని సాకారమవుతుంది.

- ఎ.శ్యామ్‌కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.