ETV Bharat / opinion

ఛిద్రమవుతున్న రహదారి భద్రత

author img

By

Published : Feb 15, 2021, 8:08 AM IST

ఇంట్లోనుంచి బయటకు అడుగు పెట్టింది మొదలు తిరిగి ఇల్లు చేరేది నమ్మకం లేకుండా పోయింది. వాహనంపై బయలుదేరితే ఈ నమ్మకం మరింత సన్నగిల్లుతోంది. జనాభాకు అనుగుణంగా జరగని రహదారుల విస్తరణ.. నిబంధనలు పాటించని వాహన చోదకుల నిర్లక్ష్యం.. వెరసి చాలామంది ప్రయాణాలు విషాదంగా ముగుస్తున్నాయి. మరోవైపు మనం సరైన దారిలోనే వెళుతున్నా.. అవతలి వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారే అధికమని సర్వేలు నివేదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రహదారి భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

road safety in india is becoming myth many journeys becoming tragedic
ఛిద్రమవుతున్న రహదారి భద్రత

వరు ఎప్పుడు ఎక్కడ ఏ గమ్యం చేరడానికని గుమ్మం దాటినా, ఆహ్లాదకరంగా సాగాల్సిన ప్రయాణం హాహాకారాలతో అర్ధాంతరంగా ముగిసిపోవడానికి మించిన విషాదం ఉందా? దేశవ్యాప్తంగా రహదారి భద్రత అక్షరాలా దేవతావస్త్రమై ఏటా రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది కుటుంబాలు చితికిపోవడం- దశాబ్దాలుగా అంతులేని కథ! అరకునుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ పర్యాటకుల బస్సు లోయలోకి దూసుకుపోయి నలుగురు దుర్మరణం పాలైన ఘోరంనుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలూ తేరుకోకముందే- ఆదివారం తెల్లవారు ఝామున కర్నూలు జిల్లాలో జరిగిన ప్రమాదం 14మందిని కబళించింది.

ఏటా 1.50లక్షల ప్రాణాలు గాల్లోకి..

గతనెలలో మొట్టమొదటిసారి తలపెట్టిన రహదారి భద్రతా మాసోత్సవాల ముందు కర్ణాటకలో చోటు చేసుకున్న పెను ప్రమాదం 13మంది బాల్య స్నేహితురాళ్లను బలిగొనగా, పిమ్మట నాలుగు రోజులకే గుజరాత్‌లో రోడ్డు పక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై దూసుకెళ్ళిన మృత్యుశకటం 15మంది ఉసురు తీసేసింది. దాని వెన్నంటి పశ్చిమ్‌ బంగ జల్పాయి గుడిలో 14మంది, ఆ మర్నాడే నల్గొండ జిల్లాలో తొమ్మిది మంది రహదార్ల నెత్తుటి దాహానికి బలైపోయిన వైనం గుండెల్ని మెలిపెడుతోంది. రోజూ సగటున 415మంది మృత్యువాత పడి, ఏటా మూడున్నర లక్షలమంది వికలాంగులు కావడానికి రోడ్డు ప్రమాదాలే కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్త వాహన రాశిలో కేవలం ఒక్క శాతమే ఉన్న ఇండియా- ఆరు శాతం ప్రమాదాలకు, ఎకాయెకి 11శాతం మరణాలకు నెలవుగా భ్రష్టుపట్టింది. రోడ్డు ప్రమాదాల సంఖ్య పరంగా ఇండియా, జపాన్లు ఒకే స్థాయిలో ఉన్నా- దుర్ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్న జపానీయులు ఏటా అయిదు వేల మంది లోపు; అదే ఇండియాలో లక్షా 50 వేల పై చిలుకు!

మొక్కుబడి వారోత్సవాలు..

32 ఏళ్లక్రితం భద్రతా వారోత్సవాల్ని ప్రారంభించి నిష్ఠగా అమలు చేస్తున్నా- రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారి సంఖ్య దాదాపు అయిదింతలు పెరిగి పౌరుల జీవన హక్కునే కర్కశంగా చిదిమేస్తోంది. కొవిడ్‌ కంటే ప్రమాదకారిగా రోడ్డు ప్రమాదాల్ని కేంద్రం గుర్తిస్తే సరిపోదు- కార్యాచరణా అందుకు తగ్గట్లు పదునుతేలాలి! రహదారి భద్రతకోసం కార్యాచరణ దశాబ్దంగా 2011-20ని గుర్తించిన ఐక్యరాజ్య సమితి, ఆ పదేళ్లలో 50 లక్షలమంది ప్రాణాల్ని కాపాడాలని లక్షించింది. 2015 నాటి బ్రసీలియా ప్రకటన మేరకు 2020నాటికి ఇండియాలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను సగానికి తగ్గించాలన్న సంకల్పం నీరుగారిపోగా- పదేళ్లలో 13లక్షలమందిని మృత్యు పరిష్వంగానికి ఈడ్చిన రహదార్ల నరమేధం.. అరకోటి మందిని మంచాలకే పరిమితం చేసింది.

జాతీయ రహదారుల్లో మనమెక్కడ..

దేశవ్యాప్తంగా పట్టుమని అయిదు శాతం కూడా లేని జాతీయ, రాష్ట్ర రహదారులపైనే 61శాతం మరణాలు, మృతుల్లో 70శాతం 18-45 ఏళ్ల మధ్య వయస్కులే ఉండటం- దేశవ్యాప్తంగా సామాజికార్థిక సంక్షోభాల నెగళ్లను ఎగదోస్తోంది. భారతీయ సమాజంపై రోడ్డు ప్రమాదాల ప్రభావాన్ని మదింపు వేసిన ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక- 75శాతం పేద కుటుంబాలు అరకొర రాబడిలోనూ సమధికంగా కోతపడి అలమటిస్తున్నాయని వెల్లడించింది. స్థూల దేశీయోత్పత్తిలో ఏటా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయల నష్టానికి కారణమవుతున్న ఈ ప్రమాదాల్ని మరేమాత్రం ఉపేక్షించే వీల్లేదు. సాంకేతికత వినియోగం, అవగాహన పెంచడం, నిక్కచ్చిగా చట్టాల అమలు, అత్యవసర సంరక్షణ చర్యలపై ప్రధానంగా దృష్టిసారిస్తే తప్పక ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

రహదారి భద్రత-సామాజిక బాధ్యత..

అతి వేగమే అనర్థదాయకమవుతోందని రుజువైన దరిమిలా దాని కట్టడికి గట్టి చర్యలు, వాహన చోదకులకు శాస్త్రీయంగా కొత్త శిక్షణా పద్ధతులు, రహదార్ల నిర్మాణంలో ప్రమాదకర మలుపులను వెంటనే గుర్తించి సరిదిద్దడం ఎంత ముఖ్యమో- జాతీయ రహదార్ల వెంట మద్యం దుకాణాల మూసివేత అంతే ప్రధానం. రహదారి భద్రతను ఒక సామాజిక బాధ్యతగా మలచి, ప్రభుత్వాలు పౌరులు స్వచ్ఛంద సంస్థలు ఒక్క తాటిపై కదిలినప్పుడే సాకారమవుతుంది- సురక్షిత ప్రయాణం!

ఇవీ చదవండి: 'మీరు రోడ్డేస్తేనే.. మేము ఓటేస్తాం'

'భూతాపానికి' కళ్లెంతోనే భవితవ్యం

అపరిమిత వాడకంతో.. ప్రాణాలు తోడేస్తున్నారు!

వరి పొట్టుతో గంగా నది ప్రక్షాళన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.