ETV Bharat / opinion

నడిరోడ్డు మీద నెత్తురోడుతున్న బతుకులు!

author img

By

Published : Sep 8, 2020, 9:05 AM IST

భారతదేశంలో రోడ్డుపై తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మలుపులు, గతుకుల రహదారులు సరాసరి యమపురికి బాటలుగా మారాయి. దీనికి తోడు కన్నూమిన్నూ కానరాని అతివేగం, నిర్లక్ష్యంతో.. ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో మత్యుఒడికి చేరుతున్నారు.

reasons-for-road-accidents-in-india-and-actions-needed
నడిరోడ్డు మీద నెత్తురోడుతున్న బతుకులు!

భారత పౌరులందరికీ రాజ్యాంగం ప్రసాదించిన జీవనహక్కు ఎప్పటి మాదిరిగానే నడిరోడ్ల మీద ఎలా నెత్తురోడుతోందో జాతీయ నేరనమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తాజా గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 37 వేల పైచిలుకు రోడ్డు ప్రమాదాల్లో దాదాపు లక్షా 55 వేల మంది మృత్యువాత పడిన ఘోరం గుండెల్ని పిండేస్తోంది. అతివేగం అనర్థదాయకమని చెవినిల్లు కట్టుకుపోరుతున్నా మొత్తం ప్రమాదాల్లో 60శాతానికి; 86,241మంది మరణానికి కన్నూమిన్నూ కానని వేగమే కారణమని ఎన్‌సీఆర్‌బీ నివేదిక చాటుతోంది. నిర్లక్ష్యపూరితంగా వాహనాలు నడపడం 25.7 శాతం ప్రమాదాలకు, 42,557 మంది అర్ధాంతర చావులకు కారణమైంది.

బహుముఖ కార్యాచరణేది..?

మొత్తం మీద అతివేగం నిర్లక్ష్యం రెండూ మృత్యుపాశాలుగా మారి 85 శాతానికి పైగా ప్రమాదాలకు, వేల కుటుంబాల్లో ఆరని చిచ్చుకు పుణ్యం కట్టుకొన్నాయి. రోడ్డు ప్రమాద మృతుల్లో ఎకాయెకి 65శాతం 18-35 ఏళ్ల మధ్య వయస్కులేనన్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ- ఈ ఘోరకలి వల్ల ఇండియా ఏటా తన జీడీపీలో 3-5 శాతం కోల్పోతున్నదనీ లోగడ వాపోయారు. దేశీయంగా రహదారి ప్రమాదాల సంఖ్యను 2018నాటికే సగానికి తగ్గించేలా బహుముఖ కార్యాచరణను చేపట్టనున్నట్లు యూపీఏ తొలిజమానాలోనే ప్రకటించిన గడ్కరీ- మొన్న ఫిబ్రవరినాటి స్టాక్‌హోమ్‌ సదస్సులో తన మంత్రిత్వ శాఖ వైఫల్యాల్ని అంగీకరించారు. కేంద్రం పట్టుపట్టి తెచ్చిన మోటారు వాహనాల చట్టం ఇంకా అమలులో బాలారిష్టాల్ని ఎదుర్కొంటూనే ఉంది.

ఎప్పుడెక్కడ ప్రమాదం జరిగినా అతివేగం నిర్లక్ష్యాలపై నెపాన్ని నెట్టేసే హ్రస్వదృష్టి- అసలు మూలకారణాల్ని మరుగుపరచి రహదారులపై నెత్తుటేళ్ల భ్రష్టరికార్డును కొనసాగిస్తోంది. ‘పెద్ద దిక్కును కోల్పోయి ఏటా లక్షల కుటుంబాలు నిస్సహాయంగా వీధిన పడి కుమిలే దయనీయావస్థ ఇంకెంతకాలం?’ అన్న ప్రశ్నకు ఎవరు జవాబుదారీ?

సరిచేయాలి..

డిజైన్‌ రూపకల్పన దశలోనే రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి, ప్రమాదకర రహదారుల మరమ్మతు, వాహనాల తయారీలో భద్రతాంశాలకు పెద్దపీట, వాహనాలు నడిపేవారికి సరైన శిక్షణ, చట్టాల్ని పునస్సమీక్షించి పటిష్ఠంగా అమలుచేయడం వంటి చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాల్ని నియంత్రించదలచినట్లు కేంద్ర సచివులు అయిదేళ్ల క్రితం ప్రకటించారు. జర్మనీ అమెరికా హైవేలపై ఇక్కడికంటే అధికవేగంతో వాహనాలు దూసుకుపోతున్నా ప్రమాద మృతుల సంఖ్య స్వల్పంగానే ఉంటోందన్న గడ్కరీ- అతి వేగమొక్కటే ప్రమాదాలకు కారణమనడం సరికాదని ఆర్నెల్ల క్రితం వెల్లడించారు.

ఇంజినీరింగ్‌ తప్పిదాలు, విపుల ప్రాజెక్టు నివేదికల్లో లొసుగులు, రహదారులపై తగినన్ని సూచికలు లేకపోవడం... ఇలా ఎన్నో రహదారి సంక్షోభాన్ని ప్రజ్వరిల్లచేస్తున్నాయంటున్నవారు- యుద్ధప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? జాతీయ రహదారుల్లో అత్యంత ప్రమాదకరమైనవిగా 786 ప్రాంతాల్ని గుర్తించామని, రెండేళ్లలో రూ.11 వేలకోట్లు వ్యయీకరించి వాటిని సుభద్రంగా తీర్చిదిద్దుతామన్నది నాలుగేళ్లనాటి మాట! అత్యంత ప్రమాదకర బ్లాక్‌స్పాట్స్‌ ఇప్పుడు మూడువేలున్నట్లు గడ్కరీ తాజా ప్రకటన చాటుతోంది.

వచ్చే పదేళ్లలో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను సగానికి తగ్గించాలంటే- ఇండియా అదనంగా 10,900 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,17,000 కోట్లు) రహదారి భద్రత నిమిత్తం వ్యయీకరించాలని ప్రపంచబ్యాంకు నివేదిక ఉద్బోధించింది. అంత భూరి వ్యయానికి సిద్ధపడితే ఏటా జీడీపీలో 3.7 శాతం మేరకు ఆర్థిక ప్రయోజనాలూ సమకూరుతాయన్న నివేదికాంశాలు వీనులవిందుగా ఉన్నా- కొరివిగా మారిన కొవిడ్‌ సంక్షోభంలో ఆ వెసులుబాటు ఏదీ? అయిదు సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అంటూ యువతను ఊరించే వాహన పరిశ్రమ ‘స్పీడు’ తగ్గించి, దేశీయ రోడ్ల స్థాయికి తగ్గ నియంత్రణల్ని గట్టిగా అమలుచేస్తే- రహదారి భద్రత కొంతైనా మెరుగవుతుంది!

ఇదీ చదవండి: పిల్లలనే కనికరం లేకుండా మత్తుపదార్థాలిచ్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.