ETV Bharat / opinion

ని'బంధనాల్లో' డిజిటల్‌ మీడియా!

author img

By

Published : Mar 8, 2021, 7:36 AM IST

దేశంలో డిజిటల్‌ మీడియా పూర్తిగా అదుపు తప్పిందని, మొదట ఆ మాధ్యమాన్నే నియంత్రించాలనీ గత సెప్టెంబరులో 'గోడు' వెళ్ళబోసుకొన్న కేంద్ర ప్రభుత్వం రెండువారాలనాడు అన్నంత పనీ చేసింది. ఐటీ చట్టంలోని 69ఏకి కఠిన నిబంధనల కోరలు తొడిగి 'సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం' నెలకొల్పుతున్నామంటూ డిజిటల్‌ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛకు బంధనాలు బిగించేసింది.

new rules of digital media
ని'బంధనాల్లో' డిజిటల్‌ మీడియా!

స్వేచ్ఛాయుత ఆలోచన భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కులని, తెలుసుకొనేందుకు ప్రజలకుగల హక్కును ఐటీ చట్టంలోని 66ఏ నేరుగా ప్రభావితం చేస్తోందంటూ ఆ నిబంధనను సుప్రీంకోర్టు ఆరేళ్లనాడు అడ్డంగా కొట్టేసింది. ఏదైనా సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం, కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి సంబంధించిన ఐటీ చట్టంలోని 69ఏ, 79 సెక్షన్లను కొట్టేయకుండా, కొన్ని నియంత్రణలతో వాటిని అమలు చేయవచ్చనీ ఆనాడు న్యాయపాలిక ప్రకటించింది.

భావప్రకటన స్వేచ్ఛకు బంధనాలు..

ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమైన వివాదాస్పద కార్యక్రమంపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా- దేశంలో డిజిటల్‌ మీడియా పూర్తిగా అదుపు తప్పిందని, మొదట ఆ మాధ్యమాన్నే నియంత్రించాలనీ గత సెప్టెంబరులో 'గోడు' వెళ్ళబోసుకొన్న కేంద్ర ప్రభుత్వం రెండువారాలనాడు అన్నంత పనీ చేసింది. ఐటీ చట్టంలోని 69ఏకి కఠిన నిబంధనల కోరలు తొడిగి- 'సుతిమెత్తనైన పర్యవేక్షక యంత్రాంగం' నెలకొల్పుతున్నామంటూ డిజిటల్‌ మీడియాలో భావప్రకటన స్వేచ్ఛకు బంధనాలు బిగించేసింది. సామాజిక మాధ్యమాల్లో విశృంఖలత్వాన్ని అదుపు చేసే పేరిట మీడియా స్వేచ్ఛకు గల రాజ్యాంగ రక్షణల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చజాలదని తాజాగా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆక్షేపించింది. అంతర్జాల వేదికపై వార్తాప్రచురణకర్తల పనిపోకడల్ని మౌలికంగా మార్చేసేలా కొత్త నిబంధనలున్నాయన్న గిల్డ్‌- డిజిటల్‌ వార్తా మాధ్యమాన్ని అహేతుక ఆంక్షల చట్రంలో కొత్త నిబంధనలు ఇరికిస్తున్నాయని గళమెత్తింది.

కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుకను ఊడ్చేసేలా రూపొందించిన నిబంధనల్ని అమలు చేసే అధికారం తమకు మాత్రమే ఉందని కేంద్రం అంటోంది. మొట్టమొదటి సారిగా సర్కారీ నియంత్రణలోకి తెచ్చి, కఠిన ఆంక్షల కత్తుల బోనులో డిజిటల్‌ మీడియాను బంధించే అప్రజాస్వామిక నిబంధనల్ని ఉపసంహరించడమే సరైనది!
ఏ పార్టీ ప్రభుత్వాలన్న దానితో నిమిత్తం లేకుండా, నిక్కచ్చిగా నిజాల్ని ప్రచురించే/ప్రసారం చేసే మీడియా వేదికల్ని స్వీయ నియంత్రణలో ఉంచుకోవాలన్నదే తరతమ భేదాలతో అందరి బాణీ! పన్నెండేళ్ల క్రితం వార్తా ఛానళ్లలో ప్రసారాలకు కంటెంట్‌ కోడ్‌ పేరిట లక్ష్మణ రేఖలు గీయడానికి ప్రయత్నించి నాటి యూపీఏ సర్కారు భంగపడింది.

ఎలాంటి సంప్రతింపులూ జరపకుండా..

'వెబ్‌ ఆధారిత డిజిటల్‌ మీడియాలో జరుగుతున్న విష ప్రచారాలు హింసకు దారితీస్తున్నాయి... వ్యక్తులు, సంస్థల ప్రతిష్ఠ దెబ్బతింటోంది' అని 'సుప్రీం'కు సమర్పించిన ప్రమాణ పత్రంలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం- ఎవరితో ఏ దశలోనూ ఎలాంటి సంప్రతింపులూ జరపకుండా ఎథిక్స్‌ కోడ్‌ రూపొందించింది. సృజనశీలత, భావ ప్రకటన స్వేచ్ఛల్ని కట్టడి చేస్తారన్న అపోహలకు తావులేకుండా ప్రజల భిన్న ఆందోళనల్ని పరిష్కరిస్తున్నామంటూ తెచ్చిన నిబంధనలు- మూడంచెల క్రమబద్ధీకరణ యంత్రాంగం ఏర్పాటును ప్రతిపాదిస్తున్నాయి. పైఎత్తున భిన్న మంత్రిత్వశాఖల ప్రతినిధులతో ఏర్పాటయ్యే సర్కారీ కమిటీ సర్వాధికారాలూ చలాయిస్తుందంటే- డిజిటల్‌ మీడియా పరిస్థితి పాముపడగ నీడన మండూకంలా మారుతుందన్న మాట.

ఒంటికాలి పోకడ తగని పని.

యువ శక్తుల ఆలోచనలు, అభిప్రాయాల కలబోతకు భవిష్యత్‌ వేదికగా చిలవలు పలవలు వేసుకుపోతున్న డిజిటల్‌ మీడియా నేరుగా సర్కారీ నియంత్రణలోకి జారిపోవడాన్ని మించిన అనర్థం ఉందా? అంతకు మించి, స్వయం క్రమబద్ధీకరణ యంత్రాంగంతో దశాబ్దాల తరబడి రాజ్యాంగబద్ధ భావ ప్రకటన పరిధులకు లోబడి పని చేస్తున్న వార్తా మాధ్యమాలకు అంతర్జాలంలో సర్కారీ నియంత్రణల ఉచ్చు దేశ విశాల హితానికే చెరుపు చేస్తుంది. అసాంఘిక శక్తుల అరాచక క్షేత్రంగా అంతర్జాలం దిగజారకుండా కాచుకొనే చట్టాలు ఇప్పటికే పోగుపడి ఉండగా- పూర్తిగా అదుపు తప్పిందంటూ డిజిటల్‌ మీడియాపై ఒంటికాలి మీద పోవడం తగని పని. కీలక నిబంధనల కూర్పు రాజ్యాంగ బద్ధం కాదని న్యాయ నిపుణులు అంటున్న నేపథ్యంలో- ఆంక్షలపై వెనక్కితగ్గి మీడియా స్వేచ్ఛకు కేంద్రం గొడుగు పట్టాలి!

ఇదీ చూడండి:బొమ్మల పరిశ్రమకు చేయూతగా కేంద్రం ప్రణాళిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.