ETV Bharat / opinion

ఆన్‌లైన్‌ బాటలో పాఠాలు.. 'ఈ-విద్య'తో ప్రోత్సాహం

author img

By

Published : May 22, 2020, 8:08 AM IST

లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నడిపించే పరిస్థితి లేదు. మునుపటి మాదిరిగా తరగతుల్లో విద్యార్థులను గుంపులుగా కూర్చోబెట్టే పరిస్థితి అంతకన్నా లేదు. ఈ క్రమంలో కేంద్రం ఆన్‌లైన్‌ విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, ఆన్‌లైన్‌ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు. 'ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించేందుకు 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమాన్ని ప్రారంభించనుంది కేంద్రం.

e learning increasing
ఆన్‌లైన్‌ బాటలో పాఠాలు.. 'ఈ-విద్య'తో ప్రోత్సాహం

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరమవుతున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో సమూల మార్పులు, సంస్కరణలు చేపట్టేందుకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్వావలంబన భారత్‌ లక్ష్యంగా ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలపై కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 'ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌' ఆన్‌లైన్‌ విద్యను ప్రోత్సహించేందుకు 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు నడిపించే పరిస్థితి లేదు. మునుపటి మాదిరిగా తరగతుల్లో విద్యార్థులను గుంపులుగా కూర్చోబెట్టే పరిస్థితి అంతకన్నా లేదు. ఈ క్రమంలో కేంద్రం ఆన్‌లైన్‌ విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, ఆన్‌లైన్‌ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారు. పాఠ్యాంశాలు, బోధన అభ్యసన ప్రక్రియల్ని పునర్‌వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. విద్యార్థులను సంప్రదాయ తరగతి గది బోధన, అభ్యసన పద్ధతుల నుంచి ఆన్‌లైన్‌ పాఠాల వైపు ఆకర్షించే దిశగా కసరత్తు ప్రారంభించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచే పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు వివిధ మార్గాల ద్వారా కృషి మొదలైంది. ముఖ్యంగా గుగూల్‌ క్లాస్‌రూం, జూమ్‌ యాప్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాల ద్వారా డిజిటల్‌ తరగతులను, దృశ్య, శ్రవణ రూపాల్లో పాఠ్యబోధన, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

పెద్దఎత్తున ప్రోత్సాహం..

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమానికి పెద్దయెత్తున ప్రోత్సాహం కల్పిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఒకటి నుంచి 12వ తరగతి వరకు అందరికీ ఛానళ్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడున్న ఛానళ్లనూ ఆధునికీకరించాలని భావిస్తున్నారు. విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా డీటీహెచ్‌ ఛానళ్లు, ఆన్‌లైన్‌ మార్గాల ద్వారా ఈ నెల 30వ తేదీ నుంచి పలురకాల కోర్సులను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నారు. 'ప్రధాని ఈ-విద్య' కార్యక్రమం ద్వారా విభిన్న రకాల పద్ధతుల్లో డిజిటల్‌ విద్య కోసం మొదటగా 100 విశ్వవిద్యాలయాలను అనుమతించి, సుమారు 3.7 కోట్ల మందికి ఆన్‌లైన్‌లో విద్యను అందిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోక్రియాల్‌ పేర్కొనడం గమనార్హం. కొన్ని కోర్సులను దూరవిద్య ద్వారా ఇప్పుడున్న దానికన్నా అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

పాఠశాల విద్యలో విద్యార్థులను ఆకట్టుకునేందుకు తెస్తున్న 'దీక్ష' (డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ షేరింగ్‌) వేదికను ప్రతి విద్యార్థీ ఉపయోగించుకోవచ్ఛు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలు అందించేందుకు రూపొందించిన ఈ 'దీక్ష' ఆన్‌లైన్‌ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఈ-పాఠ్యాంశాలు అందించాలని, దీనిద్వారా 25 కోట్ల విద్యార్థులకు సేవలు అందించవచ్చని భావిస్తున్నారు. వీటితోపాటు టీవీ, రేడియో, వెబ్‌కాస్ట్‌ మాధ్యమాలతో మరిన్ని ఛానళ్లను అందిస్తారు. 'శిక్షావాణి' పేరుతో సీబీఎస్‌ఈ పాఠశాలలో 9-12 తరగతుల విద్యార్థులకు ప్లేస్టోర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ మొబైళ్లకు అనుకూలంగా సుమారు 400 పాఠ్యాంశ భాగాలను ఎస్‌సీఈఆర్‌టీ విభాగం రూపొందించిన ఆడియో ఫైళ్ల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్‌ పాఠ్యాంశాలను రూపొందించారు. వీరి కోసం నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌/యూట్యూబ్‌ ద్వారా పాఠాలు బోధించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. వీరికి ప్రత్యేక స్టడీమెటీరియల్‌ను సైతం అందించనుంది. పాఠాలన్నీ 'జ్ఞానామృత' ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. ఓపెన్‌ స్కూల్‌లోని కిశోర్‌ మంచ్‌ 21 ఛానల్‌తోపాటు మరికొన్ని ఛానళ్లనూ చేర్చారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రచారం చేసే బోధన అభ్యసన కార్యక్రమాలు, దూరదర్శన్‌, దిశ టీవీ, జియోటీవీ యాప్‌ను కూడా దీనికింద చేరుస్తారు. సెకండరీ, వృత్తివిద్య విద్యార్థులకు బోధించే కోర్సులన్నీ 'ముక్తివిద్యావాణి' ద్వారా ఎక్కువ మందికి చేర్చే ప్రయత్నం జరుగుతోంది.

ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ పద్ధతిలో తరగతులతోపాటు, పరీక్షలు, మూల్యాంకనం వంటి ప్రక్రియలను సైతం నిర్వహించే దిశగా ముమ్మర కసరత్తు సాగుతోంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ, యూజీసీ కొన్ని మార్గదర్శకాలు జారీ చేశాయి. వచ్చే మూడు నెలలకు సంబంధించిన కార్యక్రమాల జాబితానూ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలూ కేంద్ర మార్గదర్శకాలు పాటిస్తూ, ఉమ్మడి నిర్ణయాలతో ముందుకు సాగాల్సి ఉంది. 'ప్రధాని ఈ-విద్య' స్ఫూర్తితో ఆత్మనిర్భర్‌ భారత్‌ వైపు అడుగులు వేస్తూ పురోభివృద్ధి సాధించాలంటే యావత్‌ దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్థలు ఏకోన్ముఖ లక్ష్యసాధనకు పునరంకితమై పరిశ్రమించాలి.

రచయిత: డాక్టర్‌ రావుల కృష్ణ(రచయిత-హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.